విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వద్దంటూ ప్రధానికి సీఎం జగన్ లేఖ

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ అంశంపై ప్రధాని మోడీకి ఏపీ సీఎం జగన్ లేఖ రాశారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ తప్పదంటూ నిన్న లోక్‌సభలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చింది. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ వద్దంటూ మరోసారి ప్రధాని మోడీకి లేఖ రాశారు.

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వద్దంటూ ప్రధానికి సీఎం జగన్ లేఖ

CM Jagan letter to Modi : విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ అంశంపై ప్రధాని మోడీకి ఏపీ సీఎం జగన్ మరోసారి లేఖ రాశారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ వద్దంటూ ప్రధాని మోడీకి లేఖ రాశారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ తప్పదంటూ నిన్న లోక్‌సభలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చింది. ఈ నేపథ్యంలో సీఎం జగన్‌ మరోసారి ప్రధానికి లేఖ రాశారు. నష్టాల్లో కూరుకుపోయిన విశాఖ స్టీల్‌ను ఎలా పునరుద్ధరింవచ్చో పలు సూచనలు చేశారు.

స్టీల్ ప్లాంట్ మనుగడకు నాలుగు ప్రతిపాదనలు సూచించారు. వాటన్నింటినీ స్వయంగా వివరిస్తానని వెల్లడించారు. అందువల్ల వీలైనంత త్వరగా అపాయింట్‌మెంట్‌ ఇవ్వాలని జగన్ లేఖలో ప్రధానమంత్రిని కోరారు. అఖిలపక్ష బృందంతో పాటు, కార్మిక సంఘాల నాయకులను కూడా వెంటబెట్టుకు వస్తానని ప్రధానికి తెలిపారు. అందరం కలిసి రాష్ట్ర ప్రజల ఆకాంక్షను, విశాఖ ఉక్కు కర్మాగారంపై తమకు ఉన్న సెంటిమెంట్‌ను స్వయంగా వివరిస్తామని ప్రధానికి రాసిన లేఖలో జగన్ వెల్లడించారు. 100 శాతం పెట్టుబడులు ఉపసంహరణపై పున:పరిశీలన చేయాలని కోరారు.

కేంద్రం ప్రకటనతో విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ భగ్గుమంది. స్టీల్‌ ప్లాంట్ ఎదుట రాత్రి నుంచి హై టెన్షన్ నెలకొంది. ఉదయం అడ్మినిస్ట్రేషన్ భవన్‌ను కార్మికులు ముట్టడించారు. ప్లాంట్‌లోకి వెళ్లేందుకు వచ్చిన ఫైనాన్స్‌ డైరెక్టర్‌ను అడ్డుకున్నారు. కారు ముందు బైఠాయించి ఘెరావ్ చేయడంతో.. పోలీసు భద్రత నడుమ ఆయన వెనక్కు వెళ్లిపోయారు. కార్మికులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. స్టీల్ ప్లాంట్ పరిపాలనా భవనం ముట్టడితో ఉద్రిక్తత నెలకొంది.

ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని కార్మికులు డిమాండ్ చేశారు. ఇప్పటికైనా అన్నిపార్టీలు కలిసి రావాలని ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ప్రభుత్వం కార్యాచరణ ప్రకటించాలని డిమాండ్ చేశారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌పై బీజేపీ, వైసీపీ ప్రజలను తప్పుదోవ పట్టించాయని మండిపడ్డారు. పవన్ కల్యాణ్ విశాఖ వచ్చి ఉద్యమం చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రజాప్రతినిధులంతా రాజీనామా అస్త్రాలు సంధించాలని.. అప్పుడే కేంద్రం దిగొస్తుందని గంటా శ్రీనివాసరావు అంటున్నారు.