అదానీకి ఆమోదం: విశాఖలో డేటా సెంటర్.. 25వేల ఉద్యోగాలు

  • Published By: vamsi ,Published On : November 5, 2020 / 06:02 PM IST
అదానీకి ఆమోదం: విశాఖలో డేటా సెంటర్.. 25వేల ఉద్యోగాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపిస్తున్న పలు మెగా ప్రాజెక్టుల ఏర్పాటు ప్రతిపాదనలపై ఏపీ కేబినేట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ క్రమంలోనే అదానీ డేటా సెంటర్ ఏర్పాటు గురించి కేబినేట్‌లో‍ నిర్ణయం తీసుకున్నట్లుగా ఏపీ మంత్రి కన్నబాబు వెల్లడించారు. విశాఖలో అదానీ డేటా సెంటర్ ఏర్పాటుకు కేబినేట్ అంగీకారం తెలిపిందని వెల్లడించారు.



150 ఎకరాల్లో డేటా సెంటర్ ఏర్పాటుకు అంగీకారించినట్లు చెప్పారు. గత ప్రభుత్వంలో అదానీ గ్రూప్ డేటా సెంటరుకు 500 ఎకరాలు కేటాయించారని ఆయన చెప్పుకొచ్చారు. అదానీ డేటా సెంటర్ వెళ్లిపోయిందని చంద్రబాబు, టీడీపీ గోబెల్స్ ప్రచారం చేసిందని, ఇప్పుడు అది నిజం కాదని తేలిపోయిందని అన్నారు.



సీఎం జగన్ అధ్యక్షతన తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశంలో రాష్ట్రంలో పెట్టుబడి పెట్టనున్న పలు పరిశ్రమల గురించి చర్చించారు. ఇంటెలిజెంట్ సెజ్, అదానీ డేటా సెంటర్, ఏటీసీ టైర్ల పరిశ్రమ ఏర్పాటు ప్రతిపాదనలను ఆమోదించారు. అంతేకాదు రాష్ట్రంలో పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి చూపిస్తున్న పరిశ్రమలు, ప్రభుత్వం నుండి అడుగుతున్న సహకారాన్ని, వారు కోరుకున్న రాయితీలను అధికారులు సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు.



విశాఖ జిల్లా మధురవాడలో అదానీ ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్‌ సంస్థ దాదాపు రూ.15 వేల కోట్లతో ఐటి పార్కు రూపొందించనుంది. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి.. ఇటీవలే ఇంటిగ్రేటెడ్‌ డేటా సెంటర్‌ పార్క్, ఇంటిగ్రేటెడ్‌ ఐటీ అండ్‌ బిజినెస్‌ పార్క్, రిక్రియేషన్‌ సెంటర్‌తో పాటు, స్కిల్‌ యూనివర్సిటీ ఏర్పాటు ప్రతిపాదనలపైనా అధికారులతో సమీక్షించారు.



గత ప్రభుత్వం 500ఎకరాలు ఇచ్చి 6వేల మందికి ఉద్యోగాలు వచ్చేలా ఒప్పందం చేసుకుందని, మా హయంలో 150ఎకరాలు ఇచ్చి 25వేల మందికి ఉపాధి కల్పించేలా ఒప్పందం చేసుకున్నట్లు చెప్పారు. వాస్తవానికి చంద్రబాబు హయాంలో అదానీ గ్రూప్.. విశాఖపట్నం కాపులప్పాడు APIICకి చెందిన భూముల్లో 70 వేల కోట్ల పెట్టుబుడులతో ఐటి హబ్ ఏర్పాటు చేసేందుకు ఎంవోయు కుదుర్చుకుంది. 20ఏళ్లలో లక్ష ఉద్యోగాలు కల్పించేలా ఒప్పందం చేసుకుంది. 2019జనవరిలో ఒప్పందం జరగగా.. ఇప్పుడు 150ఎకరాలు మాత్రమే కేటాయించింది ప్రభుత్వం.