AP High Court on CRDA: హై కోర్టు తీర్పును స్వాగతించిన నేతలు సుజనా చౌదరి, పురంధేశ్వరి, ఇతరులు

అమరావతిని అభివృద్ధి చేయాలంటూ ఆంధ్రప్రదేశ్ హై కోర్ట్ గురువారం సంచలన తీర్పు ఇచ్చింది. 10టీవీతో మాట్లాడిన పలువురు నేతలు సీఆర్డీఏ పై కోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్లు పేర్కొన్నారు

AP High Court on CRDA: హై కోర్టు తీర్పును స్వాగతించిన నేతలు సుజనా చౌదరి, పురంధేశ్వరి, ఇతరులు

Crda

AP High Court on CRDA: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతిని అభివృద్ధి చేయాలంటూ ఆంధ్రప్రదేశ్ హై కోర్ట్ గురువారం సంచలన తీర్పు ఇచ్చింది. రాజధాని అంశంపై వచ్చిన పిటిషన్లను విచారణకు స్వీకరించిన హై కోర్ట్ త్రిసభ్య ధర్మాసనం.. సీఆర్డీఏ చట్టం ప్రకారమే ప్రభుత్వం వ్యవహరించాలని ఆదేశించింది. ఇక హై కోర్టు తీర్పుపై ఆంధ్రప్రదేశ్ విపక్ష నేతలు ఒక్కొక్కరిగా స్పందిస్తున్నారు. గురువారం 10టీవీతో మాట్లాడిన పలువురు నేతలు సీఆర్డీఏ పై కోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్లు పేర్కొన్నారు. రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి మాట్లాడుతూ ఇవాళ చాలా సంతోషకరమైన వార్త విన్నామని అన్నారు. రాజధాని భూముల విషయంలో న్యాయవ్యవస్ధ న్యాయంగా పనిచేసి.. తీర్పును వెలువరించిందని సుజనా చౌదరి అన్నారు. అమరావతి రాజధానిగా అభివృద్ధి చెందితే విద్యార్ధులు ఇతర రాష్ట్రాల వైపు వెళ్లరని సుజనా చౌదరి అన్నారు. “పార్లమెంటే సుప్రీం..పార్లమెంట్ కు శాసననాధికారం ఉంది. దాని కింద రాష్ట్ర ప్రభుత్వాలు ఉండాలి, హైకోర్టు తీర్పుతో నైనా రాష్ట్ర ప్రభుత్వం తన తప్పును తెలుసుకొని మంచి మార్గాల్లోకి వస్తారనుకుంటున్నాం” అంటూ సుజనా చౌదరి వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని రైతులకు న్యాయం చేయాలని ఆయన అన్నారు.

Also read: Minister Sriranganatha Raju: ప్రభుత్వంపై భారం పెరిగినా నిర్వాసితుల సంక్షేమం కోసం పనిచేస్తున్నాం: మంత్రి చెరుకువాడ

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పురంధేశ్వరి మాట్లాడుతూ రాజధాని పై హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని తెలిపారు. అమరావతిలో రాజధాని అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని ఆమె అన్నారు. రూ. 2 వేల కోట్లకు పైగా నిధులను అమరావతి అభివృద్ధికి కేంద్రం కేటాయించిందని పురందేశ్వరి గుర్తుచేశారు. టీడీపీ హయాంలో సీఆర్డీఏ అభివృద్ధికి కేంద్రం రూ.2500 కోట్లు కేటాయించిందని..రాజధాని వరకు రోడ్ల కనెక్టివిటీని తీసుకువచ్చిందని ఆమె అన్నారు. రైతులు చేసిన పోరాటాల్లో మేము భాగస్వామ్యం అయ్యామని.. సీఆర్డీఏను కోర్టు గుర్తించిన తీరు నేడు జడ్జిమెంట్ లో చూశామని పురందేశ్వరి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పేరుమీదున్న ఆస్తులను, భూములను వైసీపీ ప్రభుత్వం తనఖా పెడుతుందని..భూములను తనకా పెట్టే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని ఆమె అన్నారు. ప్రస్తుత హైకోర్టు తీర్పుతో అమరావతి భూములకు రక్షణగా భావించవచ్చని ఆమె తెలిపారు.

Also read: Botsa Satyanarayana: రాజధాని అంశంలో హైకోర్టు తీర్పుపై స్పందించిన మంత్రి బొత్స

హై కోర్టు తీర్పు రైతుల విజయమని, రాష్ట్ర ప్రజల విజయమని టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ అన్నారు. సీఆర్డీఏ భూముల విషయంలో ప్రభుత్వంపై గతంలో కోర్టులు ఎన్ని మొట్టికాయలు వేసినా వితండవాదం చేశారని.. ఇప్పుడు కోర్టు ఇచ్చిన తీర్పుతో వైసీపీ ప్రభుత్వానికి బుద్ధి రావాలని సత్యప్రసాద్ అన్నారు. కోర్టు తీర్పు వచ్చినా.. ఇంకా మూడు రాజధానులకే కట్టుబడి ఉన్నామని మంత్రి బొత్స చెప్పడం సిగ్గుచేటని.. కోర్టు తీర్పును దిక్కరించే విధంగా మంత్రి మాట్లాడుతున్నారని ఎమ్మెల్యే సత్యప్రసాద్ మండిపడ్డారు. రాజధాని అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లో నిధులు కూడా కేటాయించినట్లు ఎమ్మెల్యే గుర్తుచేశారు.

Also read: AP Inter Exams: మారిన ఎపీ ఇంటర్ పరీక్షల షెడ్యూల్

ఇక హై కోర్టు తీర్పుపై ఏపీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్, వర్కింగ్ ప్రెసిడెంట్ తులసి రెడ్డి స్పందించారు. 807 రోజుల అమరావతి రైతుల పోరాటం ఫలించిందని ఏపీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్ అన్నారు. రాజధానిపై చట్టాలు చేసే అధికారం శాసనసభకు లేదని హైకోర్టు తీర్పు ఇవ్వడం హర్షణీయమని..3 రాజధానులు, సీఆర్డీఏ రద్దు పిటిషన్లపై హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని ఆయన అన్నారు. సీఆర్‌డీఏ చట్ట ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించాలని.. ఆరు నెలల్లో అభివృద్ధి ప్రణాళిక పూర్తిచేయాలని హైకోర్టు ఇచ్చిన తీర్పును ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ శైలజానాథ్ డిమాండ్ చేశారు. ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి మాట్లాడుతూ రాజధాని అంశంపై హైకోర్టు తీర్పు చరిత్రాత్మకమని అన్నారు. పోలవరం వ్యయాన్ని కేంద్ర ప్రభుత్వం భరించాలని డిమాండ్ చేశారు. వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ అధికారులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని విచారించాలని తులసి రెడ్డి డిమాండ్ చేశారు.

Also read: Amaravathi: 3 రాజధానులు, CRDA రద్దుపై హైకోర్టు సంచలన తీర్పు