స్థానిక సంస్థల ఎన్నికలు.. ఏపీ ఎస్ఈసీ కీలక నిర్ణయం

  • Published By: naveen ,Published On : November 18, 2020 / 03:04 PM IST
స్థానిక సంస్థల ఎన్నికలు.. ఏపీ ఎస్ఈసీ కీలక నిర్ణయం

ap sec nimmagadda: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ విషయంలో ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. హైకోర్టుకి వెళ్లాలని ఆయన నిర్ణయించారు. ఎన్నికల కమిషన్ కు రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదని ఆయన అంటున్నారు. హైకోర్టు ఆదేశాలను అధికారులు ధిక్కరిస్తున్నారని చెబుతున్నారు. 2021 ఫిబ్రవరిలో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పామన్నారు. స్థానిక ఎన్నికలపై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాలని సీఎస్ కు లేఖ రాశామన్నారు. కాగా, ప్రతిపాదనలను ప్రభుత్వం తిరస్కరించిందన్నారు. ఈ విషయంలో ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకునేందుకు నిమ్మగడ్డ సిద్ధమైనట్లు తెలుస్తోంది.

దమ్ము, ధైర్యం ఉంటే ఎన్నికల్లో పోటీ చేయాలని నిమ్మగడ్డకు సవాల్:
స్థానిక ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధం అని ఎన్నికల కమిషన్ అంటుంటే, ప్రభుత్వం మాత్రం నో అంటోంది. కరోనా తీవ్రత తగ్గిందని ఎస్ఈసీ అంటుంటే, తగ్గలేదని ప్రభుత్వం చెబుతోంది. నిమ్మగడ్డ రమేష్ టీడీపీ సూచనల మేరకు పని చేస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. చంద్రబాబు వల్ల రాజ్యాంగ వ్యవస్థలు కుప్పకూలాయని, అలాంటి వ్యక్తి చెప్పినట్టు నిమ్మగడ్డ నడుచుకుంటున్నారని మండిపడుతున్నారు.

ప్రభుత్వాన్ని సంప్రదించకుండా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని మంత్రులు సీరియస్ అవుతున్నారు. నిమ్మగడ్డ రమేష్ సుప్రీంకోర్టు ఆదేశాలను పట్టించుకోవడం లేదంటున్నారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ చంద్రబాబు తొత్తులా వ్యవహరిస్తున్నారని మంత్రి కొడాలి నాని ఫైర్ అయ్యారు. దమ్ము, ధైర్యం ఉంటే పదవికి రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీ చెయ్యాలని నిమ్మగడ్డ రమేష్ కు సవాల్ విసిరారు మంత్రి కొడాలి నాని.