గుంటూరు, చిత్తూరు జిల్లాల కలెక్టర్ల నియామకం, ఎస్ఈసీ ఆదేశాలు

గుంటూరు, చిత్తూరు జిల్లాల కలెక్టర్ల నియామకం, ఎస్ఈసీ ఆదేశాలు

Collectors of Guntur and Chittoor : గుంటూరు, చిత్తూరు జిల్లాల కలెక్టర్ల విషయంలో వివాదానికి తెరపడింది. వారిని నియమిస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు 2021, జనవరి 31వ తేదీ ఆదివారం సాయంత్రం సీఎస్ కు ఎస్ఈసీ ఆదేశాలు జారీ చేసింది. గుంటూరు జిల్లా కలెక్టర్ గా బసంత్ కుమార్, చిత్తూరు జిల్లా కలెక్టర్ గా హరి నారాయణనను నియమిస్తూ..ఆదేశాల్లో పేర్కొంది. ప్రభుత్వం తక్షణమే బాధ్యతలు అప్పగించాలని ఎస్ఈసీ సూచించింది.

నాలుగు దశల్లో పంచాయతీ ఎన్నికలు : –
పంచాయతీ ఎన్నికలకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్‌ ఇవ్వడంతో.. రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది. నాలుగు దశల్లో పంచాయతీ ఎన్నికలు జరుగనున్నాయి. అందులో భాగంగా..తొలి విడత నామినేషన్ల దాఖలు ప్రక్రియ 2021, జనవరి 31వ తేదీ ఆదివారంతో ముగిశాయి. ఎన్నికలను రీ షెడ్యూల్ చేసిన ఎస్‌ఈసీ నిమ్మగడ్డ.. పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజాశంకర్‌పై బదిలీ వేటు వేసిన సంగతి తెలిసిందే. ఇద్దరు అధికారులను బదిలీ చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించారు.

ఎస్ఈసీ లేఖ : –
గుంటూరు, చిత్తూరు కలెక్టర్లను బదిలీ చేయాలని ప్రభుత్వానికి ఎస్‌ఈసీ లేఖ రాసింది. ఎస్‌ఈసీ లేఖతో ప్రభుత్వం మార్పులు చేర్పులు చేసింది. గుంటూరు, చిత్తూరు జిల్లాల కలెక్టర్లు శామ్యూల్ ఆనంద్, నారాయణ్ భరత్ గుప్తాలను ప్రభుత్వం జీఏడీకి సరండర్ చేసింది. ఆయా జిల్లాల జాయింట్ కలెక్టర్లకు కలెక్టర్లుగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. తిరుపతి అర్బన్ ఎస్పీ రమేష్ రెడ్డిని సాధారణ పరిపాలన శాఖకు అటాచ్ చేసిన ప్రభుత్వం… చిత్తూరు ఎస్పీ సెంథిల్ కుమార్‌కు తిరుపతి అర్బన్‌ ఎస్పీగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది.