Bhuma Jagat Vikhyat Reddy : నంద్యాల బరిలోకి దిగుతున్నా.. కాళ్లు పట్టుకొని క్షమాపణ అడిగితేనే..

వచ్చే ఎన్నికల్లో నంద్యాల నుంచి టీడీపీ తరపున పోటీకి సిద్ధమవుతున్నట్టు వెల్లడించారు భూమా దంపతుల కుమారుడు భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి.

Bhuma Jagat Vikhyat Reddy : నంద్యాల బరిలోకి దిగుతున్నా.. కాళ్లు పట్టుకొని క్షమాపణ అడిగితేనే..

Bhuma Jagat Vikhyat Reddy (Pic: Instagram)

Bhuma Jagat Vikhyat Reddy: నంద్యాల అసెంబీ నియోజకవర్గ బరిలో తాను కూడా ఉండబోతున్నట్టు భూమా దంప‌తుల కుమారుడు భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో నంద్యాల నుంచి టీడీపీ తరపున పోటీకి సిద్ధమవుతున్నట్టు వెల్లడించారు. శిల్పా చక్రపాణి రెడ్డి తిరిగి టీడీపీలోకి రావాలనుకుంటే లోకేశ్, చంద్రబాబు కాళ్లు పట్టుకొని క్షమాపణ కోరాలని అన్నారు. అక్రమంగా కేసులు ఎదుర్కొంటున్న టీడీపీ కార్యకర్తలందరికీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆ తర్వాతే పార్టీలో చేర్చుకోవాలో, లేదో ఆలోచిస్తామంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు జగత్ విఖ్యాత్ రెడ్డి.

‘మా నాన్నలా నేను కూడా ఇక్కడి నుంచే రాజకీయం నేర్చుకోవాలని నిర్ణయించుకున్నాను. నేను ఏమాట మాట్లాడినా ఆలోచించే మాట్లాడతాను. నేను మాట్లాడితే ఒక అర్థం ఉంటుంది అంతేగాని గాలి మాటలు అలవాటులేదు. గ్రౌండ్ లెవెల్ లో ఎవరికి సత్తా ఉంటే.. కార్యకర్తలకు భరోసా ఇవ్వగలిగితే వారికే టిక్కెట్ వస్తుంది. టికెట్ కోసం చేసే ప్రయత్నాల్లో ఎవరి ప్లాన్ వారికుంటాయి. టీడీపీ అధిష్టానం ఎవరికి టికెట్ ఇచ్చినా వారి గెలుపుకోసం పనిచేస్తా. టీడీపీ కార్యకర్తలు ఎక్కడికి వెళ్లినా భరోసా ఉండాలి. ఎమ్మెల్యే పదవిలో ఉన్నా, లేకపోయినా నేను నంద్యాలోనే ఉంటాన’ని జగత్ విఖ్యాత్ రెడ్డి అన్నారు.

దూకుడు పెంచిన జగత్
కాగా.. భూమా జగత్ రెడ్డి వ్యాఖ్యలు ఉమ్మడి కర్నూలు జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. రాజకీయంగా తండ్రి స్థానాన్ని భర్తీ చేసేందుకు జగత్ అడుగులు వేస్తున్నట్టుగా కనబడుతోంది. తండ్రి రాజకీయ పాఠాలు నేర్పకున్నా.. తండ్రి ఆలోచనలు పుణికిపుచ్చుకున్న తనయుడిగా పేరు తెచ్చుకోవాలన్న తపన ఆయనలో కనబడుతోంది. నంద్యాల రాజకీయాల్లో తండ్రి స్థానాన్ని భర్తీ చేసేందుకు జగత్ దూకుడు పెంచినట్లుగా తెలుస్తోంది.

Also Read: పరిటాల శ్రీరామ్ కు టిక్కెట్ ఖరారు.. ఆల్ ది బెస్ట్ చెప్పిన కేతిరెడ్డి

నంద్యాల నుంచి పోటీకి సై
2014లో రోడ్డు ప్రమాదంలో తల్లి శోభానాగిరెడ్డి ప్రాణాలు కోల్పోయే నాటికి జగత్ విఖ్యాత్ రెడ్డికి చాలా చిన్నవయసు. 2017లో తండ్రి నాగిరెడ్డి కూడా దూరం కావడంతో భూమా కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయింది. జగత్ విఖ్యాత్ రెడ్డి అక్క అఖిలప్రియ.. టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచి, మంత్రిగా పనిచేయడంతో భూమా కుటుంబం మళ్లీ రాజకీయంగా కుదుటపడింది. అక్కచాటు తమ్ముడిగానే ఉంటూ వచ్చిన జగత్ ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగుతున్నారు. నంద్యాల నుంచి పోటీకి సిద్ధంగా ఉన్నట్టు సంకేతాలు ఇచ్చారు.

Also Read: మా పార్టీలో జరగబోయే బ్లాస్ట్ అదే.. మిడిమిడి జ్ఞానంతో మాట్లాడొద్దు..