ఏపీ పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ, జనసేన పొత్తు

ఏపీ పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ, జనసేన పొత్తు

BJP, Janasena alliance in AP panchayat elections : ఏపీ పంచాయతీ ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తున్నట్లు బీజేపీ, జనసేన పార్టీల నేతలు స్పష్టం చేశారు. ఈ మేరకు ఇవాళ విజయవాడ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, జనసేన నేత నాదెండ్ల మనోహర్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పంచాయతీ ఎన్నికలు, తిరుపతి ఉప ఎన్నికపై చర్చించారు. అనంతరం సంయుక్తంగా ప్రెస్ మీట్ నిర్వహించారు. చర్చించిన అంశాలను మీడియాకు వివరించారు. పంచాయతీ ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తామని నాదెండ్ల మనోహర్ తెలిపారు. పంచాయతీ ఎన్నికల్లో యువతకు ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు.

యువతకు ప్రోత్సహించి నామినేషన్లు వేయిస్తామన్నారు. తమపై ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఆరోపించారు. ఏకగ్రీవాలకు ప్రభుత్వం కుట్ర పన్నుతోందన్నారు. ఈ నెల 29న గవర్నర్ ను కలిసి వినతిపత్రం ఇస్తామని చెప్పారు. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరగాలన్నారు. బెదిరించే ఏకగ్రీవాలు జరగకూడదన్నారు. మంత్రుల ఏకగ్రీవ ప్రకటనల్ని ఈసీ సుమోటోగా తీసుకోవాలని కోరారు.

ఏపీ పంచాయతీ ఎన్నికలు, తిరుపతి ఎన్నికల్లో బీజేపీ-జనసేన కలిసి పోటీ చేస్తాయని సోము వీర్రాజు చెప్పారు. ఎన్నికలు సజావుగా జరిగేలా ప్రభుత్వం సహకరించాలని కోరారు. ఇతర పార్టీల అభ్యర్థులు పోటీలో ఉండకూడదనే విధానం సరికాదన్నారు. గతంలో అనేక విధాలుగా అభ్యర్థులను అడ్డుకున్నారని తెలిపారు. ఆన్ లైన్ నామినేషన్ల విధానాన్ని ప్రవేశపెట్టాలన్నారు.

ఆన్ లైన్ ద్వారా నామినేషన్ వేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ నెల 29న ఆన్ లైన్ నామినేషన్లు ప్రకటించాలన్నారు. అధికార దుర్వినియోగానికి పాల్పడితే గవర్నర్ దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. తిరుపతి ఉప ఎన్నిక అభ్యర్థిపై తమకు స్పష్టమైన విధానం ఉందన్నారు. అందరికీ ఆమోద యోగ్యమైన నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు.