Taraka Ratna Health : దేవుడిని ప్రార్థిస్తున్నా.. తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
బెంగళూరు నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తారకరత్నను.. టీడీపీ అధినేత చంద్రబాబు పరామర్శించారు. తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై నారాయణ హృదయాలయ వైద్యులను అడిగి తెలుసుకున్నారు.

Taraka Ratna Health : గుండెపోటుకు గురైన నందమూరి తారకరత్నకు బెంగళూరు నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. బెంగళూరు చేరుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. నారాయణ హృదయాలయ ఆసుపత్రికి వెళ్లారు. వైద్యులను అడిగి తారకరత్న ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. తారకరత్న కుటుంబ సభ్యులకు చంద్రబాబు ధైర్యం చెప్పారు.
అనంతరం మీడియాతో మాట్లాడిన చంద్రబాబు.. తారకరత్న ఆరోగ్య పరిస్థితి గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. తారకరత్నకు ఐసీయీలో చికిత్స కొనసాగుతోందని, అబ్జర్వేషన్ లో పెట్టారని వెల్లడించారు. డాక్టర్లతో తాను మాట్లాడానని చెప్పారు. తారకరత్న త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు చంద్రబాబు.
నిన్న నారా లోకేశ్ యువగళం పాదయాత్రకు తారకరత్న వచ్చారని, పాదయాత్ర సమయంలో తారకరత్నకు గుండెపోటు వచ్చిందని చంద్రబాబు వెల్లడించారు. కుప్పం ఆసుపత్రిలో తారకరత్నకు ప్రాథమిక వైద్యం అందించారని, ఎందుకైనా మంచిదని బెంగళూరు ఆసుపత్రి నుంచి కూడా వైద్యులను రప్పించామని చంద్రబాబు వివరించారు. వైద్యుల సలహా మేరకు మరింత మెరుగైన చికిత్స కోసం తారకరత్నను బెంగళూరు తీసుకొచ్చినట్టు చంద్రబాబు వివరించారు.
రక్తప్రసరణలో గ్యాప్స్ ఇంకా వస్తున్నాయని, తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై నారాయణ హృదయాలయ వైద్యులు పర్యవేక్షిస్తున్నారని వెల్లడించారు. వైద్యులు ఏ చికిత్స చేయాలో నిర్ణయించి, ఆ దిశగా ముందుకుపోతారని చంద్రబాబు చెప్పారు. బ్లాక్స్ ఎక్కువగా ఉన్నందున కోలుకునేందుకు టైమ్ పడుతుందని డాక్టర్లు చెప్పినట్లు చంద్రబాబు తెలిపారు. తారకరత్న కోలుకుంటారని భావిస్తున్నామన్నారు.
నందమూరి తారకరత్నకు చిన్న వయసులో తీవ్ర గుండెపోటు రావడం బాధాకరమని మాజీ ఎంపీ పురంధేశ్వరి అన్నారు. ప్రస్తుతం తారకరత్న ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, సోమవారం కీలక పరీక్షలు జరుగుతాయని చెప్పారామె. అప్పటివరకు వేచి చూడాలన్నారు. బెంగళూరు నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తారకరత్నను.. టీడీపీ అధినేత చంద్రబాబు, పురంధేశ్వరి, హరికృష్ణ కూతురు సుహాసిని పరామర్శించారు. తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై నారాయణ హృదయాలయ వైద్యులను చంద్రబాబు, పురంధేశ్వరిని అడిగి తెలుసుకున్నారు.
”తారకరత్న యువగళం పాదయాత్రకు వచ్చారు. అక్కడ సొమ్మసిల్లి పడిపోయారు. వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రధమ చికిత్స చేయించాం. ఎందుకైనా మంచిదని ఆయనను అక్కడి నుంచి బెంగుళూరుకు తరలించాం. అక్కడ కంటే కూడా ఇక్కడ బెటర్ గా వైద్యం చేస్తున్నారు. వైద్యులతో మాట్లాడాను. ఇంకా గ్యాప్స్ ఉన్నాయని, అబ్జర్వేషన్ లో పెట్టారు. టైమ్ టు టైమ్ డాక్టర్లు పర్యవేక్షిస్తున్నారు. ఇవన్నీ చూసుకొని ఎలాంటి చికిత్స చేయాలో చేస్తున్నారు. అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. త్వరగా ఆయన కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తూ.. కోలుకుంటారని ఆశిస్తున్నా” అని చంద్రబాబు తెలిపారు.
10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.
నందమూరి తారకరత్నకు బెంగుళూరు నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స జరుగుతోంది. ఇప్పటికీ ఆయన పరిస్థితి అత్యంత విషమంగానే ఉందని డాక్టర్లు చెబుతున్నారు. ఐసీయూలో తారకరత్నకు చికిత్స అందిస్తున్నారు. ఇప్పటికే తారకరత్న తల్లిదండ్రులు శాంతి, మోహనకృష్ణ, భార్య రెడ్డి అలేఖ్య రెడ్డి, కూతురు నిషిత, నందమూరి బాలకృష్ణ, టీడీపీ నేతలు చినరాజప్ప, దేవినేని ఉమ, పరిటాల శ్రీరామ్ ఆసుపత్రికి వెళ్లి తారకరత్న ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీశారు.
నిన్న నారా లోకేశ్ పాదయాత్రలో నందమూరి తారకరత్న సొమ్మసిల్లి పడిపోగా, వెంటనే ఆసుపత్రికి తరలించడం తెలిసిందే. తారకరత్నకు తీవ్ర గుండెపోటు వచ్చిందని వైద్యులు నిర్ధారించారు. గత రాత్రి తారకరత్నను మెరుగైన వైద్యం కోసం కుప్పం నుంచి బెంగళూరు తరలించారు. ప్రస్తుతం తారకరత్నకు బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో అత్యవసర చికిత్స జరుగుతోంది.