నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం జగన్.. పలువురు కేంద్రమంత్రులతో భేటీ

  • Published By: bheemraj ,Published On : December 15, 2020 / 07:07 AM IST
నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం జగన్.. పలువురు కేంద్రమంత్రులతో భేటీ

CM Jagan Delhi today : ఏపీ ముఖ్యమంత్రి జగన్‌… నేడు ఢిల్లీకి వెళ్తున్నారు. మధ్యాహ్నం 2గంటలకు ఆయన బయలుదేరి వెళ్లనున్నారు. పలువురు కేంద్రమంత్రులతో ఆయన భేటీ కానున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, అకాల వర్షాలు, పంటనష్టం, పోలవరం ప్రాజెక్ట్‌సహా ఇతర అంశాలపై కేంద్ర ప్రభుత్వ పెద్దలతో చర్చించనున్నారు. వీలైతే ప్రధాని మోడీని కలిసి రాష్ట్ర సమస్యలు వివరించనున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌.. ఢిల్లీ పర్యటన ముగిసిన రెండు రోజులకే.. ఏపీ సీఎం ఢిల్లీ పర్యటనకు వెళ్లడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది.

జగన్‌ రెండు రోజులపాటు ఢిల్లీలోనే మకాం వేయనున్నారు. ఇవాళ రాత్రి కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో ఆయన భేటీఅవుతారు. వరదలు, అకాల వర్షాలతోతో జరిగిన పంటనష్టం పరిహారం చెల్లింపులపై జగన్‌.. అమిత్‌షాతో చర్చించే అవకాశముంది. అంతేకాదు.. విభజన చట్టంలోని హామీల అమలు…. ఏపీలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి వ్యవహారాలపై త్వరగా విచారణ జరపాలని కోరే చాన్స్‌ ఉంది. శాసన మండలి రద్దుతోపాటు.. పెండింగ్‌ నిధుల విడుదలపైనా అమిత్‌షాతో జగన్‌ చర్చించనున్నారు. ఇక పోలవరం ప్రాజెక్ట్‌కు సవరించిన అంచనాల ప్రకారం నిధులు, పోలవరం నిధుల కేటాయింపులో కేంద్రం ఇటీవల విధించిన కోత వ్యవహారాన్ని అమిత్‌షా దృష్టికి జగన్‌ తీసుకెళ్లనున్నారు.

నీటి ప్రాజెక్టుల అంశాలకు సంబంధించి కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌ను సైతం జగన్ కలిసే అవకాశం ఉంది.. ఇక ఆర్ధిక పరమైన అంశాలకు సంబంధించి కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ను సైతం కలిసే అవకాశముంది. ఏపీకి రావాల్సిన పెండింగ్ నిధులు, పోలవరం ప్రాజెక్టుకు నిధులు విడుదల చేయాలని ఆయన కోరనున్నారు. ఆర్ధిక లోటు భర్తీ , 2021-22 వార్షిక బడ్జెట్‌కు కేంద్ర ఆర్థిక శాఖ కసరత్తు చేస్తున్న తరుణంలో నిర్మలా సీతారామన్‌ను కలువనున్నారు. తదుపరి బడ్జెట్‌లో ఏపీకి కేంద్రం నుంచి ఇవ్వాల్సిన నిధులపై దృష్టి సారించాలని జగన్ కోరే అవకాశం ఉంది

రెండు రోజులపాటు ఢిల్లీలోనే ఉండనున్న జగన్‌.. ప్రధాని నరేంద్రమోదీ అపాయింట్‌మెంట్‌ అడిగినట్టు తెలుస్తోంది. మోదీ అపాయింట్‌ దొరికితే జగన్‌ ప్రధానిని కలువనున్నారు. రాష్ట్రంలో పరిస్థితులు, అభివృద్ధి అంశాలు సహా రాష్ట్రానికి కేంద్ర సహకారం అందించడంపై విజ్ఞాపనలు ఇచ్చే అవకాశం ఉంది.