సీఎం చెప్పినా రామసుబ్బారెడ్డిని పట్టించుకోవట్లా..

సీఎం చెప్పినా రామసుబ్బారెడ్డిని పట్టించుకోవట్లా..

జిల్లా వ్యాప్తంగానే కాదు… రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయంగా జమ్మలమడుగు నియోజకవర్గానిది ప్రత్యేక స్థానం. దశాబ్దాలుగా రాజకీయం నడిపించిన రామసుబ్బారెడ్డి ఏ పార్టీలో ఉన్నా ఇబ్బందులు తప్పడం లేదు. టీడీపీలో ఉన్నా.. అధికార వైసీపీలో చేరినా ఇంటిపోరు మాత్రం తప్పడం లేదంటున్నారు. జమ్మలమడుగులో మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి వర్సెస్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి సమస్య సీఎం దృష్టి వరకు వెళ్లింది. వారి మధ్య సయోధ్య కుదరకపోవడంతో ఇప్పుడు వైసీపీ పెద్దలకు తలనొప్పిగా మారిందట.

ఎడమొహం పెడమొహంతో సీనియర్ వర్సెస్ జూనియర్ ఆధిపత్య పోరులో జమ్మలమడుగు రాజకీయం సాగుతోంది. నియోజకవర్గంలో వైసీపీ శ్రేణుల మధ్య వైరం కొనసాగుతోంది. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జోక్యం చేసుకున్నా స్థానిక రాజకీయాలు ఓ కొలిక్కి రాలేదట. 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా రామసుబ్బారెడ్డి, వైసీపీ అభ్యర్థిగా సుధీర్ రెడ్డి పోటీ చేశారు. ఎన్నికల సమయంలో ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేల్చుకుని నువ్వా నేనా అన్నట్లు ఇద్దరి మధ్య పొలిటికల్‌ వార్‌ నడిచింది.

రాజకీయాలకు కొత్త అయినప్పటికీ వైఎస్ కుటుంబంపై ఉన్న అభిమానంతో సుధీర్‌ రెడ్డికి పట్టం కట్టారు ఇక్కడి ఓటర్లు. రామసుబ్బారెడ్డిపై 51వేల 641 ఓట్ల భారీ మెజారిటీతో గెలిపించారు. ప్రతిపక్షంలోని రామసుబ్బారెడ్డి కొత్తగా వచ్చిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి చేసే ప్రతి లోటుపాట్లను లేవనెత్తుతూ సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకున్నారు. రామసుబ్బారెడ్డి వైసీపీలో చేరాలని ప్రయత్నిస్తుండగా, అప్పట్లో సుధీర్ రెడ్డి అడ్డుకునే ప్రయత్నం చేశారు.

ఈ సందర్భంగా వైసీపీ పెద్దలతో వాగ్వాదానికి కూడా దిగారు. కానీ, అనూహ్య పరిణామాల మధ్య సీఎం జగన్ సమక్షంలో రామసుబ్బారెడ్డి వైసీపీ కండువా కప్పుకున్నారు. సుధీర్‌రెడ్డి వర్గంలో ఎక్కువ సంఖ్యలో యువకులే కావడంతో, ప్రతిపక్షంలో ఉండగా వైసీపీకి అండగా ఉన్న కార్యకర్తలు రామసుబ్బారెడ్డి రాకను జీర్ణించుకోలేకపోయారు. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిపై కార్యకర్తలు ఓ దశలో ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్‌ నిర్ణయమని, చేసేదేమీ లేదని కార్యకర్తలను బుజ్జగిస్తూ వచ్చారు.

పార్టీలో చేరినప్పటి నుంచి రామసుబ్బారెడ్డిని పట్టించుకోకుండా సుధీర్‌రెడ్డి వర్గం వ్యవహరిస్తోంది. జిల్లా పర్యటనలో భాగంగా వచ్చిన జగన్‌ దృష్టికి ఈ విషయాన్ని రామసుబ్బారెడ్డి స్వయంగా తీసుకెళ్లారు. తనను పట్టించుకోవడం లేదని చెప్పారట. ఈ అంశంపై సీఎం జగన్ సానుకూలంగా స్పందించినట్టు సమాచారం. సీఎం ఆధ్వర్యంలో ఈ పంచాయతీని తేల్చేసేందుకు వైసీపీ పెద్దలు సుధీర్‌రెడ్డిని విజయవాడకు పిలిపించారు పార్టీ పెద్దలు.

రామసుబ్బారెడ్డిని కలుపుకొని పోవాలని సర్ది చెప్పినా ఫలితం లేదంటున్నారు. ఇద్దరి మధ్య సఖ్యత కుదరక, ఇరువర్గాల కార్యకర్తలు కలవలేక పార్టీకి తలనొప్పిగా మారింది. నియోజకవర్గంలో జరిగే అభివృద్ధి పనులు దగ్గర నుంచి, అధికారులతో నిర్వహించే సమీక్ష సమావేశాల వరకు ఎవరికి వారే యమునా తీరే అన్న విధంగా వ్యవహరిస్తున్నారు. దీంతో కార్యకర్తలు ఎటువైపు వెళ్లాలో తెలియక అయోమయ పరిస్థితిలో ఉన్నారని అంటున్నారు.