చిట్టీల పేరుతో రూ.4 కోట్లకు టోపి పెట్టిన దంపతులు…కృష్ణా జిల్లాలో భారీ మోసం

  • Published By: bheemraj ,Published On : July 17, 2020 / 09:40 PM IST
చిట్టీల పేరుతో రూ.4 కోట్లకు టోపి పెట్టిన దంపతులు…కృష్ణా జిల్లాలో భారీ మోసం

కృష్ణా జిల్లాలో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. చిట్టీల వ్యాపారం పేరుతో 4 కోట్ల రూపాయలకు టోపి పెట్టారు కిలాడీ దంపతులు. గుడివాడలోని 35 వ వార్డులో నమ్మకంగా ఉంటూ చిట్టీల వ్యాపారం నిర్వహిస్తున్న లక్ష్మణరావు దంపతులు.. చిట్టీలు వేసిన వారికి హ్యాండ్ ఇచ్చారు. కొద్ది రోజులుగా లక్ష్మణ్ రావు ఇంటికి తాళం వేసి ఉండటం, అతను కనిపించకపోవడంతో మోసపోయామని గ్రహించిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

లక్ష్మణరావు దంపతులు గత కొంతకాలంగా గుడివాడలో నివాసముంటూ స్థానికులను నమ్మబలికి వారి నుంచి మొదట్లో పది వేల చిట్టీ వేశారు. తర్వాత పది వేల నుంచి యాబై వేలు, లక్ష రూపాయలు, రెండు లక్షలు, తర్వాత ఐదు లక్షలు వరకు చిట్టీల వ్యాపారం నిర్వహించారు. రోజువారి వ్యాపారం చేసుకునే వారు, ఉద్యోగస్తులను నమ్మించి చిట్టీల వ్యాపారం చేస్తున్నారు.

నాలుగు సంవత్సరాల నుంచి చిట్టీల వ్యాపారం చేస్తున్నారు. కొద్ది కాలంగా చిట్టీ కట్టే వారి నుంచి డబ్బులు తీసుకుంటూ వారికి రిటన్ ఇవ్వకుండా తీవ్రస్థాయలో ఇబ్బంది పెట్టారు. దీంతో స్థానికులకు అనుమానం వచ్చింది. నెల రోజుల నుంచి ఇంటికి తాళం వేసి ఉండటంతో స్థానికులకు అనుమానం రావడంతో అక్కడికి వెళ్లి చూడగా ఇంట్లో ఎవరూ లేరు. ఇంట్లో సామానులు తక్కువగా ఉండటంతో అనుమానం వచ్చింది. ఒక్కసారిగా గుడివాడ పట్టణం 35 వార్డులో గందగోళం నెలకొంది.

చిన్న చిన్న వ్యాపారం చేసుకునే వారందరం చిట్టీలు వేశాం..పిల్లల పెళ్లిళ్లు, పిల్లల చదువుల కోసం డబ్బులు దాసుకుంటే ఇట్లా మోసం చేశారంటూ ఒక్కసారిగా బాధితులు ఆందోళనకు గురయ్యారు. దీంతో బాధితులు ఇవాళ ఉదయం పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. అయితే సీఐ లేకపోవడంతో కొద్ది సేపటి క్రితం పీఎస్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ దంపతులను అదుపులోకి తీసుకుంటామని చెప్పడంతో బాధితులు ఇంటికెళ్లిపోయారు.