వైఎస్ఆర్ కాంగ్రెస్ లోకి పురంధేశ్వరి

  • Published By: veegamteam ,Published On : January 10, 2019 / 08:21 AM IST
వైఎస్ఆర్ కాంగ్రెస్ లోకి పురంధేశ్వరి

ఏపీ రాజకీయాల్లో సంచలనం. దేశ రాజకీయాల్లోనే తనదైన ముద్ర వేసిన మాజీ కేంద్ర మంత్రి, ఎన్టీఆర్ కుమార్తె పురంధేశ్వరి పార్టీ మారుబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఏపీ బీజేపీలో కీలక, అగ్రనేతగా ఉన్న ఆమె.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రత్యేక హోదా అంశంలో బీజేపీ యూటర్న్ తీసుకోవటం, ఏపీకి కమలం పార్టీ అన్యాయం చేసిందనే భావన ప్రజల్లో బలంగా ఉండటంతో పురంధేశ్వరి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికీ బీజేపీ వ్యవహారాల్లో చురుగ్గానే పాల్గొంటున్నా.. ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో.. రాజకీయంగా కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు సంకేతాలు వస్తున్నాయి.

సంక్రాంతి తర్వాత పురంధేశ్వరి కీలక నిర్ణయం :

టీడీపీలోకి వెళ్లే పరిస్థితులు లేవు. బీజేపీలో ఉంటే రాజకీయ జీవితం సమాధి అవుతుంది.. అలాఅని జనసేనలోకి వెళితే భవిష్యత్ కనిపించటం లేదు. ఈ లెక్కలు చూస్తే పురంధేశ్వరికి దగ్గర ఉన్న బెస్ట్ ఆప్షన్ ఒకటే. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావటం. ఈ ఆలోచన చేసిన చిన్నమ్మ.. జగన్ పార్టీలోని కీలక నేతలతో చర్చలు కూడా జరిపినట్లు తెలుస్తోంది. సంక్రాంతి పండుగ తర్వాత విజయవాడ వేదికగా.. జగన్ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నట్లు ప్రచారం జరుగుతుంది.

ఎంపీగా పురంధేశ్వరి, కుమారుడు ఎమ్మెల్యేగా..

దగ్గుబాటి ఫ్యామిలీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావటం ఖాయమనే ప్రచారం ఊపందుకోవటంతో.. ప్రకాశం జిల్లా రాజకీయాలు వేడెక్కాయి. సమీకరణాలు మారిపోతున్నాయి. పురంధేశ్వరి ఎంపీగా పోటీ చేయనున్నట్లు సమాచారం. గుంటూరు లేదా నర్సరావుపేట నుంచి లోక్ సభ బరిలోకి దిగనున్నట్లు ప్రచారంలో ఉన్నా.. జగన్ నుంచి ఇంకా క్లియరెన్స్ రాలేదంట. విశాఖపట్నం నుంచి పోటీ చేయమని జగన్ కోరుతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పురంధేశ్వరి మాత్రం గుంటూరు లేదా నర్సరావుపేట సీటుపై పట్టుబడుతుంది. ఇక కుమారుడు హితేశ్ రాజకీయ అరంగేట్రం కూడా 2019 ఎన్నికల్లో జరగబోతుంది. కుమారుడికి పర్చూరు అసెంబ్లీ నుంచి బరిలోకి దించాలనే ప్రయత్నాలు సాగుతున్నాయి. తల్లీ, కుమారుడు ఇద్దరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలోకి దిగనున్నట్లు ప్రకాశం జిల్లా రాజకీయాల్లో జోరుగా సాగుతున్న చర్చలు. దగ్గుబాటి ఫ్యామిలీ లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల్లో ఎవరో ఒకరు అధికారికంగా ప్రకటించే వరకు క్లారిటీకి రావటం కష్టమే. ఎందుకంటే రాజకీయాల్లో ఎప్పుడైనా.. ఏమైనా జరగొచ్చు కదా…

See also : వెంకన్న దివ్య దర్శనానికి.. జగన్ సర్వదర్శనం టోకెన్