Earthquake: చిత్తూరు జిల్లాలో భూప్రకంపనలు.. భూమిలోంచి భారీ శబ్ధాలు

చిత్తూరు జిల్లా రామకుప్పం మండలంలో అర్థరాత్రి నుంచి భూప్రకంపనలు కొనసాగుతున్నాయి.

Earthquake: చిత్తూరు జిల్లాలో భూప్రకంపనలు.. భూమిలోంచి భారీ శబ్ధాలు

Earthquake (1)

Earthquake: చిత్తూరు జిల్లా రామకుప్పం మండలంలో అర్థరాత్రి నుంచి భూప్రకంపనలు కొనసాగుతున్నాయి. మండలం పరిధిలోని గడ్డురు, గెరిగిపల్లె, యనాది కాలనీ, కృష్ణ నగర్, గొరివిమాకుల పల్లి, పెద్దగరిక పల్లి ప్రాంతాల్లో విపరీతమైన శబ్దంతో భూప్రకంపనలు సంభవించాయి. భూమి పొరల నుంచి భారీ శబ్ధాలు వినిపిస్తూ ఉన్నాయి. గ్రామాల్లో భూమి కంపించడంతో అక్కడి ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

ప్రజలు ఇళ్లు వదిలి పొలాల్లోకి పరుగుల పెడుతున్నారు. మరోవైపు.. ఏనుగుల బెడద కూడా అక్కడి ప్రజలను వేధిస్తోంది. దగ్గరలోని అడవుల్లో ఏనుగులు శబ్ధాల దెబ్బకు ఊర్లలోకి వస్తున్నాయి. పొలాల్లో సంచరిస్తున్నాయి. పలు చోట్ల ఇళ్ల గోడలకు చీలికలు రాగా.., భారీ శబ్దం దాటికి ఇళ్లలో వస్తువులు కిందపడుతున్నాయి.

భయంతో అర్ధరాత్రి నుండి ఇళ్ల బయటే జాగారం చేస్తున్నారు గ్రామస్తులు. వారం రోజుల క్రితం కూడా ఇదే తరహాలో పలుమార్లు భూమి కంపించింది. వింత శబ్దాలు భూప్రకంపనలపై అధికారులు పట్టించుకోవడం లేదంటూ గడ్డురు గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భూమి పొరల్లో శబ్ధాలు కొనసాగుతూనే ఉన్నాయి. శబ్దాలు పెరుగుతూ ఉండటంతో జనాలు హడలిపోతున్నారు.