Mekapati Goutham Reddy : మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణం.. సోషల్ మీడియాలో వస్తున్న ఆ వార్తలను ఖండించిన కుటుంబం

గౌతమ్‌ రెడ్డి వ్యాయామం చేస్తూ ఇబ్బంది పడ్డారని సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను ఆయన కుటుంబ సభ్యులు ఖండించారు. గౌతమ్ రెడ్డి మరణానికి ముందు అసలేం జరిగిందో వివరించారు.

Mekapati Goutham Reddy : మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణం.. సోషల్ మీడియాలో వస్తున్న ఆ వార్తలను ఖండించిన కుటుంబం

Goutham Reddy

Mekapati Goutham Reddy : ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణం చెందారు. సోమవారం ఉదయం ఆయనకు గుండెపోటు రాగా… హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రికి వచ్చే సమయానికే గౌతమ్‌రెడ్డికి శ్వాస ఆడట్లేదని డాక్టర్లు తెలిపారు. ఆయనను కాపాడేందుకు వైద్యులు అన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం దక్కలేదు. గౌతమ్ రెడ్డి.. గుండెపోటుతో మరణించారన్న వార్తను కుటుంబసభ్యులు, మంత్రివర్గ సహచరులు, వైసీపీ నేతలు, రాజకీయ, వ్యాపార రంగ ప్రముఖులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.

కాగా, గౌతమ్‌ రెడ్డి వ్యాయామం చేస్తూ ఇబ్బంది పడ్డారని సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను ఆయన కుటుంబ సభ్యులు ఖండించారు. గౌతమ్ రెడ్డి మరణానికి ముందు అసలేం జరిగిందో వివరించారు. ‘‘నిన్న రాత్రి పెళ్లి వేడుకకు వెళ్లి రాత్రి 9.45 గంటలకు ఇంటికి తిరిగొచ్చారు. ఎప్పటిలానే ఈరోజు ఉదయం 6గంటలకు గౌతమ్‌ రెడ్డి లేచారు. 6.30గంటల వరకు ఇతరులతో మాట్లాడారు. ఉదయం 7గంటలకు ఇంట్లోని సోఫాలో కూర్చున్నారు. ఉదయం 7.12 గంటలకు డ్రైవర్‌ని పిలవమని వంటమనిషికి చెప్పారు. 7.15గంటలకు గుండెపోటుతో సోఫా నుంచి కిందకు ఒరిగారు.

Pawan Kalyan Tributes : గౌతమ్ రెడ్డి మరణం బాధాకరం : పవన్ కళ్యాణ్

వెంటనే స్పందించిన డ్రైవర్ నాగేశ్వరరావు 7.18గంటలకు మంత్రి ఛాతిపై చేయి వేసి రుద్దుతూ ఉపశమనం కలిగించారు. 7.20గంటలకు గౌతమ్‌ రెడ్డి పక్కనే ఉన్న భార్య శ్రీకీర్తి అప్రమత్తం అయ్యారు. 7.22 గంటలకు గుండెనొప్పి వస్తోందని గౌతమ్‌ రెడ్డి చెప్పారు. వెంటనే ఆస్పత్రికి వెళ్దామంటూ సిబ్బందికి చెప్పారు. ఉదయం 7.27 గంటలకు ఇంటి నుంచి ఆస్పత్రికి ఐదు నిమిషాల్లో చేరుకున్నాం. అపోలో ఆస్పత్రిలో అత్యవసర విభాగానికి డ్రైవర్‌, సిబ్బంది తీసుకెళ్లారు. ఉదయం 8.15 గంటలకు పల్స్‌ బాగానే ఉందని డాక్టర్లు చెప్పారు. 9.13 గంటలకు గౌతమ్‌ రెడ్డి మరణించారని డాక్టర్లు నిర్ధారించారు’’ అని గౌతమ్‌ రెడ్డి కుటుంబ సభ్యులు తెలిపారు.

Chandrababu: హుందాగా పని చేసిన వ్యక్తి గౌతమ్ రెడ్డి -చంద్రబాబు

గౌతమ్ రెడ్డి ఆకస్మిక మరణంతో ఆయన కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. వైసీపీ శ్రేణులు తీవ్ర విషాదంలో మునిగిపోయాయి. ఆయన మృతి పట్ల పార్టీలకు అతీతంగా అందరూ దిగ్భ్రాంతికి గురవుతున్నారు. 49 ఏళ్ల చిన్న వయసులోనే ఆయన మరణించడం తీవ్ర విషాదాన్ని నింపింది. గౌతమ్ రెడ్డి ఇక లేరు అనే వార్తను జీర్ణించుకోలేకపోతున్నారు.