విశాఖలో భారీ ప్రమాదం.. విషవాయువు లీక్, ఇళ్లు వదిలి పరుగులు తీసిన ప్రజలు

  • Published By: naveen ,Published On : May 7, 2020 / 02:15 AM IST
విశాఖలో భారీ ప్రమాదం.. విషవాయువు లీక్, ఇళ్లు వదిలి పరుగులు తీసిన ప్రజలు

అసలే కరోనా భయంతో జనాలు వణికిపోతున్నారు. ప్రాణాలు మాస్క్ లో పెట్టుకుని బతుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో విశాఖ నగర వాసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఇల్లు వదిలి బయటకు పరుగులు తీశారు. ప్రాణ భయంతో వణికిపోతున్నారు. విశాఖ నగరంలో భారీ ప్రమాదం జరిగింది. నగరంలోని గోపాలపట్నం పరిధిలోని ఆర్.ఆర్.వెంకటాపురంలో ఉన్న ఎల్జీ పాలిమర్స్ రసాయన పరిశ్రమలో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. పరిశ్రమ నుంచి రసాయన వాయువు లీక్ అయ్యింది. లీక్ అయిన వాయువు 3 కిలోమీటర్ల​ మేర వ్యాపించింది. గురువారం(మే 7,2020) తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది.

విష వాయువు లీక్.. కళ్ల మంటలు, కడుపు నొప్పి, ఊపిరి ఆడటం లేదు:
క్షణాల్లోనే గాల్లోకి వ్యాపించిన విష వాయువు చుట్టుపక్కల ప్రజల్ని కమ్మేశాయి. కంపెనీ చుట్టుపక్కల ఉన్న 5 గ్రామాల ప్రజలు ప్రాణ భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ గ్యాస్ కారణంగా ప్రజలు కళ్ల మంటలు, కడుపు నొప్పితో బాధపడుతున్నారు. వందలాది మంది తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో వారిని అంబులెన్స్ ద్వారా ఆసుపత్రులకు తరలిస్తున్నారు. ఆర్ఆర్ వెంకటాపురం ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఇటీవల కాలం వరకు లాక్ డౌన్ లో ఉన్న కంపెనీని తెరిపించే క్రమంలో గురువారం(మే 7, 2020) తెల్లవారుజామున 4గంటలకు ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పరిశ్రమ నుంచి స్టైరిన్ మోనోమర్(styrene) అనే విష వాయువు లీకైనట్లు తెలుస్తుంది. గ్యాస్‌ లీకేజీ ఘటనపై అధికార యంత్రాంగం తక్షణమే స్పందించి సైరన్‌ మోగించి ప్రజలను అప్రమత్తం చేశారు. దీంతో పాటు గ్యాస్‌ లీకేజీపై పోలీసులకు సమాచారమందించారు.  

ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ విశాఖ నగరం:
అర్ధరాత్రి సమయంలో ప్రజలంతా మంచి నిద్రలో ఉన్నారు. విశాఖ నగరం ప్రశాంతంగా ఉంది. ఒక్కసారిగా కలకలం రేగింది. లీక్ అయిన విష వాయువు గాల్లోకి వ్యాపించి చుట్టుపక్కల ప్రజల్ని కమ్మేసింది. వారికి శ్వాస ఇబ్బంది మొదలైంది. ఊపిరి ఆడటం కష్టంగా మారింది. అసలేం జరుగుతుందో అర్థం కాలేదు. కళ్లు మండిపోతున్నాయి. కడుపులో నొప్పి, వాంతులు, తల తిప్పడం.. ఇలా పరిస్థితి మొత్తం ప్రాణాలను హరించుకుపోతున్నట్లు పరిస్థితి తయారైంది. 

ఏయే ప్రాంతాలపై ప్రభావం:

కంపెనీకి సమీపంలో ఉన్న వెంకటాపురం గ్రామంపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. పరిశ్రమ ఉన్న ఆర్ఆర్ వెంకటాపురం పరిసరాల్లో ప్రజలంతా ఇళ్లను ఖాళీ చేసి మేఘాద్రి గెడ్డ వైపు, ఇతర సురక్షిత ప్రాంతాల వైపు పరుగులు తీశారు. నాయుడు తోట, పద్మనాభపురం, కంపరపాలెం ప్రాంతాల్లోనూ రసాయన వాయువు వ్యాపించడంతో అక్కడుండే వారంతా ఇళ్లను ఖాళీ చేసి సొంత వాహనాల్లో దూరంగా వెళ్లిపోతున్నారు. వృద్ధులు, చిన్నారులు శ్వాస ఆడక ఇబ్బందులు పడుతున్నారు.

ప్రజలను దూర ప్రాంతాలకు తరలింపు:
ప్రమాదం జరిగిన ప్రాంతం చుట్టుపక్కల 5 కిలోమీటర్ల పరిధిలో నివాసం ఉంటున్న ప్రజలను అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. వారిని ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. సింహాచలం డిపో నుంచి ఆర్టీసీ బస్సులను తీసుకొచ్చి వారిని తరలిస్తున్నారు. రసాయన వాయువు లీకేజీని అరికట్టేందుకు అధికారులు, సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. 

ప్రమాదంలో ముగ్గురు మృతి:
విశాఖ జిల్లా కలెక్టర్ తో సీఎం జగన్ మాట్లాడారు. పరిస్థితి గురించి ఆరా తీశారు. సహాయక చర్యలను ముమ్మరం చేయాలని ఆదేశించారు. రసాయన వాయువు విడుదలైన బాధిత ప్రాంతాల్లో తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేశారు. అప్రమత్తమైన అధికారులు వేగంగా చర్యలు చేపట్టారు. కాగా చాలామంది ప్రజలు సొంత వాహనాల్లో దూరంగా వెళ్లిపోతున్నారు. చిన్న పిల్లల తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. కొంతమంది కళ్లు తిరిగి రోడ్డుపైనే పడిపోయారు. వృద్దులు బాగా ఇబ్బంది పడుతున్నారు. రంగంలోకి దిగిన ప్రత్యేక బృందాలు అస్వస్థతకు గురైన వారిని ఆసుపత్రులకు తరలిస్తున్నాయి. కాగా తీవ్ర అస్వస్థతకు గురైన వారిలో ముగ్గురు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు వృద్ధులు, ఎనిమిదేళ్ల చిన్నారి ఉన్నారు. దాదాపు 200మందికి పైగా అస్వస్థతకు గురైనట్లు సమాచారం.