TDP: చంద్రబాబు సొంత జిల్లాలో టీడీపీకి షాక్.. మాజీ మంత్రి రాజీనామా!

మాజీ మంత్రి గుమ్మడి కుతూహలమ్మ, ఆమె కుమారుడు, జీడీ నెల్లూరు నియోజకర్గ టీడీపీ ఇన్‌చార్జ్‌ హరికృష్ణ తెలుగుదేశం పార్టీకి గుడ్‌బై చెప్పేశారు.

TDP: చంద్రబాబు సొంత జిల్లాలో టీడీపీకి షాక్.. మాజీ మంత్రి రాజీనామా!

Chandrababu

TDP: తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు సొంత జిల్లాల్లో ఎదురుదెబ్బ తగిలింది. మాజీ మంత్రి గుమ్మడి కుతూహలమ్మ, ఆమె కుమారుడు, జీడీ నెల్లూరు నియోజకర్గ టీడీపీ ఇన్‌చార్జ్‌ హరికృష్ణ తెలుగుదేశం పార్టీకి గుడ్‌బై చెప్పేశారు. ఫ్యాక్స్‌ ద్వారా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడికి రాజీనామా లేఖలను పంపినట్లుగా వెల్లడించారు.

అనారోగ్యం కారణంగా పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు లేఖలో కుతూహలమ్మ వెల్లడించారు. ఇద్దరు ప్రధాన నేతలు టీడీపీకి రాజీనామా చేయడంతో జిల్లాలో చర్చనీయాంశం అయ్యింది. అయితే, పార్టీలో వారి కుటుంబానికి త‌గిన ప్రాధాన్యం ఇవ్వ‌కపోవడంతోనే కుతూహలమ్మ రాజీనామా చేసిన‌ట్టు తెలుస్తుంది.

జీడీ నెల్లూరు నియోజకర్గం నుంచి హరికృష్ణ 2019 ఎన్నికల్లో పోటీ చేసి నారాయణ స్వామిపై ఓడిపోయారు. జిల్లా పార్టీ నేతల సూచనతో చిట్టిబాబు అనే వ్యక్తిని నియోజకవర్గ కోఆర్డినేటర్‌గా తెలుగుదేశం పార్టీ నియమించింది. ఇదే వారు పార్టీ విడిచిపెట్టడానికి కారణం అని భావిస్తున్నారు.

గుమ్మడి కుతూహలమ్మ ప్రకాశం జిల్లా , కందుకూరులో పుట్టి, ఎం.బి.బి.ఎస్. పూర్తి చేసింది. వైద్య వృత్తిలో పనిచేసి, తర్వాతకాలంలో కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి ప్రవేశించింది. 2014లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరింది. 2014ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయింది.

కాంగ్రెస్ హయాంలో వైద్యారోగ్య శాఖ, మహిళ శిశుసంక్షేమ శాఖ వంటి ముఖ్యమైన పోర్ట్‌ఫోలియోలను నిర్వహించారు. 24 జులై 2007 నుంచి 19 మే 2009 వరకు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా కూడా ఆమె పనిచేశారు.