గంటా టీడీపీ వదిలేయడం ఖాయమేనా.. దీని వెనుక అవంతి హ్యాండ్ ఉందా..

గంటా టీడీపీ వదిలేయడం ఖాయమేనా.. దీని వెనుక అవంతి హ్యాండ్ ఉందా..

విశాఖ ఉత్తర నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పార్టీ వీడడం దాదాపు ఖాయమైనట్టే. కాకపోతే వైసీపీలోకి వెళ్లాలని భావిస్తున్న ఆయనకు వ్యతిరేక వర్గం నుంచి అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా ఇంతకుముందు ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్న భీమిలి నియోజకవర్గ వైసీపీ నాయకులు, కార్యకర్తలు గంటా రాకను అడ్డుకుంటున్నారు. దీని వెనుక గంటా శిష్యుడిగా చెప్పే ప్రస్తుత మంత్రి అవంతి శ్రీనివాసరావు హ్యాండ్‌ ఉందని అంటున్నారు. అంతా సెట్‌ అయిపోయింది ఇక చేరడమే తరువాయి అనుకుంటున్న తరుణంలో వైసీపీలో ఆయన వ్యతిరేక వర్గం తీవ్రంగా అభ్యంతరాలు తెలుపుతోంది. ఈ పరిస్థితుల్లో గంటా శ్రీనివాసరావు బీజేపీ వైపు చూస్తున్నారనే టాక్‌ కూడా వినిపిస్తోంది.

నిజానికి గంటా ఎక్కడ ఉంటే అక్కడ ఆయనకంటూ ప్రత్యేకంగా ఒక వర్గం ఉంటుంది. ప్రజారాజ్యం పార్టీ ప్రారంభించిన సమయంలో ఇప్పుడు వివిధ పార్టీలలో కొనసాగుతున్న మాజీ ఎమ్మెల్యేలు పంచకర్ల రమేశ్‌ బాబు, చింతలపుడి వెంకట్రామయ్య, పల్లా శ్రీనివాసరావు లాంటి వాళ్లే కాకుండా ప్రస్తుత ఎమ్మెల్యే గణబాబు, విశాఖ నగర అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాసరావు, ప్రస్తుతం మంత్రిగా ఉన్న అవంతి శ్రీనివాసరావు లాంటి వాళ్లు ఆయన శిష్యులే. గంటా శ్రీనివాసరావు ప్రజారాజ్యం నుంచి కాంగ్రేస్‌లోకి మారిన తర్వాత 2009 ఎన్నికల్లో గెలిచిన పంచకర్ల రమేశ్‌బాబు, చింతలపుడి వెంకట్రామయ్య, అవంతి శ్రీనివాసరావులు గంటా శ్రీనివాసరావుతో కలిసి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. 2014 ఎన్నికల ముందు ఈ బృందం అంతా టీడీపీలో చేరిపోయింది.

ఇంత వరకూ బాగానే ఉన్నా 2019లో గంటా అనుచరులుగా ఉన్నా అనేక మంది ఆయనతో టచ్ లేకుండా పోయారు. అవంతి శ్రీనివాసరావు వైసీపీలో చేరి మంత్రి పదవి పొందగా పంచకర్ల రమేశ్‌ బాబు ఆ ఎన్నికలకు దూరంగా ఉన్నారు. చింతలపూడి వెంకట్రామయ్య జనసేనలోనూ, ఎన్నికల తర్వాత వైసీపీలో చేరారు. ఇక టీడీపీలో ఉన్న పల్లా శ్రీనివాసరావు కేవలం తన నియోజకవర్గానికే పరిమితం కాగా, గణబాబు కూడా టీడీపీ అధిష్టానంతో టచ్‌లో లేకుండా పోయారంటున్నారు. ఏ పార్టీ మారినా తనకంటూ ఒక ప్రత్యేక వర్గాన్ని ఆ పార్టీలో పెట్టుకుంటారు గంటా. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఆయనతో పాటు రావడానికి ఎవరు సిద్ధంగా ఉన్నారనేదే ప్రశ్నగా మారిందని అంటున్నారు.

ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్‌బాబు ఒక్కరే రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఆయన గంటాతో పాటు పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని అంటున్నారు. విశాఖ నగర పరిధిలో మాత్రమే టీడీపీ ఎమ్మెల్యేలున్నారు. అందులో గంటా శ్రీనివాసరావు ఒకరు. మిగిలిన ముగ్గురిలో కనీసం ఇద్దరు పార్టీ మారతారని ప్రచారం జరుగుతోంది. ఆ ఇద్దరు ఎవరనేదీ మాత్రం ఏ క్యాంపు నుంచి బయటకు రావడం లేదు. ప్రస్తుతం జిల్లా టీడీపీలో కీలకంగా ఉన్న ఓ ఎమ్మెల్యే ఇప్పటికే తన అనుచరులను వైసీపీలోకి పంపి వారికి కార్పొరేట్ టికెట్లు, కనకమహాలక్ష్మీ అమ్మవారి దేవస్థానం బోర్డులో పదవులు ఇప్పించుకున్నారు. ఆ ఎమ్మెల్యేతో పాటుగా టీడీపీ అధిష్టానం వ్యవహార శైలితో విసిగిపోయిన మరో ఎమ్మెల్యే కూడా గంటాతో పాటు వైసీపీ తీర్ధం పుచ్చుకోనున్నట్లు తెలుస్తోంది.

ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా విశాఖకు పరిపాలనా రాజధాని తరలిన తర్వాతే మారతారని అంటున్నారు. అంతే కాకుండా తమ పదవులకు రాజీనామా చేయకుండా బయట నుంచి వైసీపీకి మద్దతు తెలుపుతారని చెబుతున్నారు. తెలుస్తుంది. మొత్తంగా తాను ఎక్కడున్నా తన వర్గాన్ని పెట్టుకునే గంటా శ్రీనివాసరావు ఇప్పుడు వైసీపీలోకి మారేందుకు అడ్డంకులు అధిగమిస్తారా లేదా అన్న ఉత్కంఠ పెరుగుతోంది.

వైసీపీలో ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న విశాఖ జిల్లా నేతలు చాలా మందే ఉన్నారు. వారంతా ఆయన రాకను అడ్డుకొనేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు.
ముఖ్యంగా అవంతి శ్రీనివాసరావు మాత్రం గంటా పార్టీలో చేరడాన్ని ససేమిరా అంటున్నారు. ఈ పరిస్థితుల్లో ముందుగా వేసుకున్న ప్రణాళికలో భాగంగా ప్లాన్‌ బీ అమలు చేయాలని అనుకుంటున్నారట గంటా. వైసీపీలోకి వెళ్లడం కుదరకపోతే బీజేపీలోకి వెళ్లి తన హవా చలాయించాలని చూస్తున్నారట. మరి మున్ముందు ఈ వ్యవహారం ఎలాంటి ట్విస్టులు తీసుకుంటుందో చూడాల్సిందే.