Ramya Murder : ఆ పరిచయమే రమ్య హత్యకు దారితీసింది

రాష్ట్రంలో సంచలనం రేపిన బీటెక్ విద్యార్థిని రమ్య హత్య కేసు వివరాలను ఇంచార్జి డీఐజీ రాజశేఖర్ మీడియాకు తెలిపారు. సోషల్ మీడియాలో(ఇన్ స్టాగ్రామ్) ఏర్పడిన

Ramya Murder : ఆ పరిచయమే రమ్య హత్యకు దారితీసింది

Guntur Ramya Murder Case

Guntur Ramya Murder Case : రాష్ట్రంలో సంచలనం రేపిన బీటెక్ విద్యార్థిని రమ్య హత్య కేసు వివరాలను ఇంచార్జి డీఐజీ రాజశేఖర్ మీడియాకు తెలిపారు. సోషల్ మీడియాలో(ఇన్ స్టాగ్రామ్) ఏర్పడిన పరిచయమే రమ్య హత్యకు దారితీసిందన్నారు. నిందితుడు శశికృష్ణకు, రమ్యకు ఆర్నెల్ల కిందట ఇన్ స్టాగ్రామ్ లో పరిచయం జరిగిందని తెలిపారు.

దీని ఆధారంగా ప్రేమించాలంటూ రమ్య వెంటపడేవాడని, రెండు నెలలుగా మితిమీరి వేధించాడని తెలిపారు. దాంతో శశికృష్ణతో రమ్య మాట్లాడడం మానేసిందని, ఇది మనసులో పెట్టుకున్న శశికృష్ణ పలుమార్లు బెదిరింపులకు కూడా పాల్పడ్డాడని వెల్లడించారు. చివరికి నిన్న ఆమెతో వాగ్వాదం జరిగిన అనంతరం కత్తితో నరికి చంపాడని తెలిపారు.

కాగా, స్థానికులు అడ్డుకుని ఉంటే రమ్య బతికుండేదని ఆయన అభిప్రాయపడ్డారు. ఇలాంటి ఘటనలను అడ్డుకునేందుకు ప్రత్యేక ఫోన్ నెంబర్లు, ప్రత్యేక యాప్ లు, దిశ పెట్రోలింగ్ వంటి సదుపాయాలను ప్రభుత్వం తీసుకొచ్చిందని, కానీ ఎవరూ స్పందించ లేదని విచారం వ్యక్తం చేశారు. ఒకవేళ ఎవరైనా ఫిర్యాదు చేసి, తాము స్పందించకపోతే అప్పుడు తప్పు పోలీసులదే అవుతుందని అన్నారు. కానీ ప్రజలెవరూ ముందుకు రాలేదని తెలిపారు.

సోషల్ మీడియాలో ఏర్పడే పరిచయాల పట్ల యువత దూరంగా ఉంటే మేలని హితవు పలికారు. ఇలాంటి పరిచయాలను ఆసరాగా చేసుకుని వేధించే వాళ్లపై ఫిర్యాదు చేయాలని, రమ్య కూడా ముందుగానే పోలీసులకు ఫిర్యాదు చేసి ఉంటే పరిస్థితి ఇంతవరకు వచ్చి ఉండేది కాదేమోనని ఇన్చార్జి డీఐజీ అన్నారు.

ఇక, ఈ వ్యవహారంలో రాజకీయాలకు తావులేదని స్పష్టం చేశారు. మృతురాలి ఫోన్ డేటా నుంచి డిలీట్ అయిన వివరాలను కూడా రాబట్టి, దర్యాప్తును ముందుకు తీసుకెళతామని అన్నారు. అమ్మాయిలపై జరిగే అఘాయిత్యాలు, దాడులకు సంబంధించి చైతన్యం కలిగించేలా మరిన్ని కార్యక్రమాలు నిర్వహించాలని డీజీపీ ఆదేశించారని వెల్లడించారు.

ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయంటే ఇందుకు కారణం పోలీసులు కాదు. మీరు ఫిర్యాదు చేసి, పోలీసులు స్పందించకపోతే దానికి బాధ్యత మాదే. కానీ, అది జరగలేదని రాజశేఖర్ అన్నారు.

”ఇబ్బంది కలిగిందనప్పుడు చాలామంది పోలీస్‌స్టేషన్‌కు రావడానికి భయపడతారు. దాన్నో తప్పుగా భావిస్తారు. బాలికలు, మహిళలు తమకు సమస్య వచ్చినప్పుడు నిర్భయంగా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయండి. మహిళల భద్రత మా బాధ్యత. నిన్న జరిగిన ఘటనలో అక్కడే ఉన్న ప్రజలు వెంటనే స్పందించి ఉంటే బాగుండేది. ప్రాణాలు పోయి ఉండేవి కావు. ఈ ఘటన పోలీస్‌శాఖను కలచి వేసింది” అని ఇన్‌ఛార్జ్‌ డీఐజీ రాజశేఖర్‌ అన్నారు.

స్వాతంత్ర్య దినోత్సవం రోజునే ఏపీలో దారుణం చోటు చేసుకుంది. గుంటూరు నగరం కాకాని రోడ్డులో బీటెక్‌ విద్యార్థిని రమ్యను శశికృష్ణ అనే యువకుడు అతి కిరాతకంగా కత్తితో పొడిచి హత్య చేశాడు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. రమ్యను కత్తితో విచక్షణారహితంగా పొడిచి చంపేశాడు.