Heavy Rains : ఏపీపై వరుణుడి ప్రతాపం..24 మంది మృతి..జలదిగ్బంధంలో వందలాది గ్రామాలు

ఏపీలో కురిసిన భారీ వర్షాలకు ఇప్పటివరకు రాష్ట్రంలో 24 మంది చనిపోయారు. 17 మంది గల్లంతైనట్లు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. కడప జిల్లాలో 3 వేలకుపైగా పశువులు ప్రాణాలు కోల్పోయాయి.

Heavy Rains : ఏపీపై వరుణుడి ప్రతాపం..24 మంది మృతి..జలదిగ్బంధంలో వందలాది గ్రామాలు

Ap Rains

Heavy rains and floods in AP : రోడ్లు తెగిపోయాయ్.. బ్రిడ్జిలు కూలిపోయాయ్.. రైలు పట్టాలు తేలిపోయాయ్. ఒక్క వాయుగుండం.. నాలుగు జిల్లాలను అతలాకుతలం చేసింది. ఇప్పట్లో కోలుకోలేని విధంగా ముంచేసింది. వర్షాలు ఆగిపోయినా.. కడప, చిత్తూరు, నెల్లూరు, అనంతపురం జిల్లాలు ఇంకా కోలుకోవడం లేదు. కొన్ని ప్రాంతాల్లో.. ఊళ్లకు ఊళ్లే తుడిచిపెట్టుకుపోయాయి. అటు పంట మొత్తం.. నీట మునిగి రైతు కంట కన్నీరు పారిస్తోంది. కుండపోత వర్షాలు భారీ విధ్వంసం సృష్టించాయి.

ఆంధ్రప్రదేశ్‌లో కురిసిన భారీ వర్షాలకు ఇప్పటివరకు రాష్ట్రంలో 24 మంది చనిపోయారు. 17 మంది గల్లంతైనట్లు ప్రభుత్వమే అధికారికంగా ప్రకటించింది. అయితే.. అనధికారికంగా 50 మంది దాకా ఆచూకీ తెలియడం లేదని.. స్థానికులు చెబుతున్నారు. కడప, చిత్తూరు, నెల్లూరు, అనంతపురం జిల్లాల్లోని.. 172 మండలాలపై వర్షం తన ప్రతాపమేంటో చూపించింది. ప్రాథమిక అంచనాలకు ప్రకారం.. 4 జిల్లాల్లో కలిపి సుమారు 6 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. భారీ వర్షాలకు 28 చెరువులు, కుంటలు, కాలువలు తెగిపోయాయి. 188 కిలోమీటర్ల మేర రోడ్లు దెబ్బతిన్నాయి. ఒక్క కడప జిల్లాలోనే మూడున్నర వేల పశువులు ప్రాణాలు కోల్పోయాయి.

Rayala Pond : రాయల చెరువు నుంచి లీకవుతున్న నీరు..కట్ట తెగితే 100 గ్రామాలకు ముప్పు

ఎడతెరపిలేని వర్షాలతో 1,316 గ్రామాలను వరద ముంచెత్తింది. కడప జిల్లాలో అత్యధికంగా 866 గ్రామాలు నీటమునిగినట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. వర్షాలు, వరదల కారణంగా 15 వందల 50 ఇళ్లు దెబతిన్నాయి. కడప జిల్లాలోనే అత్యధికంగా 792 ఇళ్లు వర్షాలకు ధ్వంసమైపోయాయి. వర్షాలు తగ్గాక.. కనిపిస్తున్న దృశ్యాలు అందరినీ కలచివేస్తున్నాయి. కడప జిల్లా రాజంపేట మండలంలో.. ఊళ్లకు ఊళ్లే తుడిచిపెట్టుకుపోయాయి.

ప్రస్తుతానికి వర్షాలు తగ్గినా.. ఇంకా చాలా ప్రాంతాలు కోలుకోలేకపోతున్నాయి నెల్లూరు జిల్లాలో.. పెన్నా నది వరద ఉధృతికి చెన్నై- కోల్‌కతా హైవే కొట్టుకుపోయింది. మరమ్మత్తు పనులు కొనసాగుతున్నాయి. ఇక వెంకటేశ్వరపురం దగ్గర రైల్వే ట్రాక్‌ను పెన్నా వరద తాకుతోంది. దీంతో రైళ్ల రాకపోకలను నిలిపివేశారు. పలు రైళ్లను రద్దు చేశారు. జిల్లా వ్యాప్తంగా 615 కిలోమీటర్ల మేర రోడ్లు ధ్వంసం అయ్యాయి.

Trains Canceled : ఏపీలో భారీ వర్షాలు, వరదల కారణంగా పలు రైళ్లు రద్దు

చిత్తూరు జిల్లాలో 215 చెరువులకు గండ్లు పడ్డాయి. 563 ఇళ్లు నేలమట్టం అయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 48 బ్రిడ్జిలు, 50 కల్వర్టులు కూలిపోవడంతో 191 ప్రాంతాలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. తక్షణ సాయంగా జిల్లాకు.. 2 కోట్లు విడుదల చేసింది ప్రభుత్వం. తిరుపతికి కూడా దారులు మూసుకుపోయాయి. కడప నుంచి తిరుపతికి వెళ్లే దారిలో కమలాపురం దగ్గర.. పాపాగ్ని నదిపై వంతెన కూలిపోయింది.

వెలిగల్లు డ్యాం గేట్లు ఎత్తడంతో పాపాగ్ని నదికి వరద ప్రవాహం ఎక్కువై.. బ్రిడ్జి పిల్లర్లు కుంగిపోయాయి. రాజంపేట, నందలూరు మార్గంలో రైల్వే ట్రాక్ ధ్వంసమైంది. దీంతో రైల్వే శాఖ.. రైళ్ల రాకపోకలను నిలిపివేసింది. అనంతపురం జిల్లాలో పెన్నా, చిత్రావతి, జయమంగళి నదుల ప్రవాహం కొనసాగుతోంది.

MLC Candidates : టీఆర్‌ఎస్‌ లోకల్ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే..!

ప్రస్తుతం వాయుగుండం ప్రభావం తగ్గడంతో.. వర్షాలు ఆగిపోయాయి. అయినప్పటికీ..మరో 5 రోజుల పాటు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. అయితే.. ఈనెల 26 నాటికి బంగాళాఖాతంలో మరోసారి అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో రాయలసీమ, దక్షిణకోస్తాలో.. మళ్లీ వర్షాలు పడొచ్చని భావిస్తున్నారు.