Pawan Kalyan: జనసేనాని డైరెక్షన్‌.. వచ్చే ఎన్నికలకు పవన్ కళ్యాణ్ సరికొత్త రూట్ మ్యాప్!

ఇన్నాళ్లూ ఎన్డీయేలో భాగస్వామిగా ఉంటూ బీజేపీ, టీడీపీ చెప్పింది చేస్తున్నారనే అపవాదు మూటగట్టుకున్న పవన్ కళ్యాణ్.. ఇప్పుడు వచ్చే ఎన్నికలకు సరికొత్త రూట్ మ్యాప్ ప్రకటించడం ద్వారా రాజకీయ దర్శకుడిగా సరికొత్త పేరు సంపాదించుకున్నారు.

Pawan Kalyan: జనసేనాని డైరెక్షన్‌.. వచ్చే ఎన్నికలకు పవన్ కళ్యాణ్ సరికొత్త రూట్ మ్యాప్!

pawan kalyan political direction leads to latest route map for ap elections

Pawan Kalyan Political Direction: పవన్ కళ్యాణ్. ఆయన ఎవరు అడగ్గానే చాలా మంది చెప్పే మాట సినీ హీరో. లేదంటే.. జనసేన పార్టీ (Janasena Party) అధినేత అని. సినిమాల్లో హీరోయిజం చూపించే ఆయన.. రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేసుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ.. ఇప్పుడా హీరో డైరెక్టర్ అవతారం ఎత్తారు. అదేంటి ఓ హీరో డైరెక్టర్‌గా మారిపోవడమేంటని ఆశ్చర్యపోతున్నారా? నిజమేనండి. ఇప్పుడాయన డైరెక్టర్‌గా మారింది ఆంధ్రప్రదేశ్ రాజకీయాలనే (Andhra Pradesh Politics) సినిమాను నడిపించడానికే. ఇంతకీ ఆయన డైరెక్షన్‌లో నడవబోతున్న పార్టీలేంటి? అందుకోసం పవన్ రెడీ చేసుకున్న స్క్రిప్ట్ ఏంటి? ఈ తెరవెనుక రాజకీయం తెలుసుకుందాం రండి.

రాజకీయాల్లో ఎవరి వ్యూహాలు ఎలా ఉంటాయో ఊహించడం చాలా కష్టం. తాజాగా ఏపీ రాజకీయాల్లో పొత్తులపై ప్రకటన చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. రాబోయే ఎన్నికల్లో టీడీపీతో కలిసి పోటీ చేస్తామని క్లారిటీ ఇచ్చారు. అయితే.. ఎన్డీయేలో భాగస్వామిగా ఉన్న పవన్ కళ్యాణ్ తమను సంప్రదించకుండా టీడీపీతో పొత్తు ప్రకటన చేయడం బీజేపీకి అస్సలు మింగుడు పడటం లేదు. నిజానికి పవన్ కళ్యాణ్‌ ఏపీ బీజేపీ నేతలతో పెద్దగా టచ్‌లో ఉండరు. బీజేపీలో ఏ రకమైన చర్చలు చేయాలన్నా.. ఆయన నేరుగా ఢిల్లీకి వెళుతుంటారు. అక్కడ అమిత్ షా, (Amit Shah) నడ్డా (JP Nadda) వంటి వారితో కలిసి ఏపీలో పరిణామాలపై చర్చిస్తుంటారు.

గతేడాది మార్చి 14న ఇప్పటంలో జరిగిన జనసేన ఆవిర్భావ సభలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల కోసం బీజేపీ ఇచ్చే రూట్ మ్యాప్ కోసం ఎదురుచూస్తున్నానంటూ ప్రకటించారాయన. అయితే అప్పటి ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కూడా దానిపై క్లారిటీ ఇచ్చారు. బీజేపీతో జనసేన కలిసి పనిచేయడమే పవన్‌కు ఇచ్చిన రూట్ మ్యాప్ అంటూ కౌంటర్ ఇచ్చారు వీర్రాజు. అప్పటి నుంచి ఏపీలో రెండు పార్టీల మధ్య దూరం పెరుగుతూనే వస్తోంది.

ఈ క్రమంలోనే రాజమండ్రి వేదికగా పవన్ చేసిన ప్రకటన ఏపీ రాజకీయాల్లో పెద్ద దుమారాన్నే లేపింది. వచ్చే ఎన్నికల్లో టీడీపీతో కలిసి పనిచేస్తామన్న ఆయన.. బీజేపీ కూడా కలిసి వస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. అలా 2024 ఎన్నికలకు తాను రెడీ చేసుకున్న రూట్ మ్యాప్‌ను ప్రకటించేశారు జనసేనాని. అప్పుడు బీజేపీతో కలిసి జనసేన కలవాలన్నది వీర్రాజు చెప్పిన రూట్ మ్యాప్ అయితే.. ఇప్పుడు జనసేన, టీడీపీతో కలిసి బీజేపీ పోటీ చేయాలన్నది పవన్ కళ్యాణ్ ఇచ్చిన రూట్ మ్యాప్. అయితే.. దీనికి ఏం సమాధానం చెప్పాలో తెలియని ఏపీ బీజేపీ.. పొత్తుల అంశం పార్టీ జాతీయ నాయకత్వం తీసుకుంటుందని సైడై పోయింది.

Also Read: జనసేన పార్టీకి గుడ్‌న్యూస్ చెప్పిన కేంద్ర ఎన్నికల సంఘం.. మరోసారి అదే గుర్తు

మరోవైపు పొత్తుల బంధాన్ని వేగంగా ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు పవన్. ఈనెలలోనే ఇరు పార్టీలు సమన్వయ సమావేశం నిర్వహించాలని తీర్మానించారు. ఈ బాధ్యతలను జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్‌కు అప్పగించారు. జనసేన, టీడీపీ తరఫున సభ్యుల నియామకం పూర్తి చేయడం ద్వారా.. వెంటనే బీజేపీ నుంచి స్పందన వచ్చేలా చేయాలన్నది పవన్ కళ్యాణ్ వ్యూహం.

Also Read: పొలిటికల్‌‌గా ఆ విషయంలో రూట్ మార్చిన జనసేనాని.. మొన్నటి దాకా వైట్ అండ్ వైట్ కానీ ఇప్పుడు..

ఇన్నాళ్లూ ఎన్డీయేలో భాగస్వామిగా ఉంటూ బీజేపీ, టీడీపీ చెప్పింది చేస్తున్నారనే అపవాదు మూటగట్టుకున్న పవన్ కళ్యాణ్.. ఇప్పుడు వచ్చే ఎన్నికలకు సరికొత్త రూట్ మ్యాప్ ప్రకటించడం ద్వారా రాజకీయ దర్శకుడిగా సరికొత్త పేరు సంపాదించుకున్నారు. మరి పవన్ రాసిన ఈ స్క్రిప్ట్‌ని టీడీపీ, బీజేపీలు తు.చ. తప్పకుండా పాటిస్తాయా? జనసేనాని డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా ఏపీ ప్రజల్ని మెప్పిస్తుందా? లేదా ? అన్నది వేచి చూడాల్సిందే.