Pawan kalyan Varahi Yatra : జూన్ 14 నుంచి పవన్ కల్యాణ్ వారాహి యాత్ర.. అన్నవరంలో యాత్రకు శ్రీకారం ..

తూర్పుగోదావరి జిల్లాలోని అన్నవరంలో  రత్నగిరిపై కొలువైన  సత్యనారాయణ స్వామి సన్నిధిలో వారాహికి పూజలు చేయించి స్వామివారిని పవన్ కల్యాణ్ దర్శించుకుని వారాహి యాత్రను ప్రారంభించనున్నారు.

Pawan kalyan Varahi Yatra : జూన్ 14 నుంచి పవన్ కల్యాణ్ వారాహి యాత్ర.. అన్నవరంలో యాత్రకు శ్రీకారం ..

Pawan Kalyan Varahi Yatra

Pawan kalyan Varahi Yatra : జనసేన అధినేత పవన్ కల్యాణ్ ‘వారాహి’పై యాత్రకు సిద్ధమవుతున్నారు. ఇటీవల కాలంలో సినిమా షూటింగులతో బిజీ బిజీగా ఉన్న పవన్ కల్యాణ్ మరోసారి ప్రజల్లోకి రాబోతున్నారు. తాను ప్రత్యేకంగా డిజైన్ చేయించుకున్న వారాహి వాహనంపై యాత్రకు బయలుదేరనున్నారు. దీని కోసం రూట్ మ్యాప్ ను సిద్ధం చేసుకున్నారు.  జూన్ 14 నుంచి వారాహిపై పవన్ కల్యాణ్ యాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. తూర్పుగోదావరి జిల్లాలోని అన్నవరం (Annavaram)లో రత్నగిరిపై కొలువైన సత్యనారాయణ స్వామి సన్నిధిలో వారాహికి పూజలు చేయించి స్వామివారిని పవన్ కల్యాణ్ దర్శించుకుని యాత్రను ప్రారంభించనున్నారని జనసేన పార్టీ (Janasena Party) పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) తెలిపారు. పవన్ వారాహి యాత్ర ఒకేవిడతగా కాకుండా పలు విడతలుగా చేయనున్నారు. దీంట్లో భాగంగా మొదటి విడత అన్నవరం నుంచి భీమవరం (Bhimavaram) వరకు యాత్ర కొనసాగుతుందని నాదెండ్ల తెలిపారు.

మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో గోదావరి జిల్లాల నేతలతో నాదెండ్ల సమావేశమై యాత్ర గురించి చర్చించారు. ఈ యాత్ర ద్వారా పవన్ కల్యాణ్ ప్రజా సమస్యలను తెలుసుకుని పరిష్కారం కోసం క్షేత్రస్థాయిలో పర్యటిస్తారని తెలిపారు. మహిళలు, రైతులు, యువత సమస్యల్ని తెలుసుకుంటారని.. ప్రజల్లో చైతన్యం తీసుకురావటానికి పవన్ యత్నిస్తున్నారని దీంట్లో భాగంగానే వారాహి యాత్ర అని తెలిపారు. ప్రజా క్షేమం కోరి, రాష్ట్ర క్షేమం కోసం పవన్ చేసే ఈ యాత్ర ఉపయోగపడుతుందన్నారు. యాత్రలో భాగంగా పవన్ ఎంతోమందిని కలుసుకుని స్థానిక సమస్యలపై దృష్టి పెట్టనున్నారని తద్వారా పరిష్కార మార్గాల కోసం కృషి చేయనున్నారని నాదెండ్ మనోహర్ తెలిపారు.

పవన్ వారాహి యాత్ర ఒకేవిడతగా కాకుండా పలు విడతలుగా చేయనున్నారు. ఒక్కో విడతలో రెండు జిల్లాల చొప్పున పర్యటన కొనసాగేలా ప్లాన్ వేస్తున్నారు. ఈ యాత్రలో ప్రజల్లో చైతన్యం కోసం జనసేన బలా బలాలను తెలుసుకోవటం కూడా భాగంగా ఉంది. మరి ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో జనసేన బలంపైన అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి. అంచనాలను ఆచరణలోకి తీసుకురావటానికి ఈ యాత్రను ఉపయోగించుకోనున్నారు పవన్ కల్యాణ్. అలాగే జనసేన నేతల అంచనా ప్రకారం ఈ రెండు జిల్లాలో మెజారిటీ సీట్లు సాధిస్తామని భావిస్తున్నారు.

Also Read: టీడీపీ మ్యానిఫెస్టోపై వైసీపీ ఇంతలా రియాక్ట్ కావాల్సిన అవసరముందా?

కాగా పవన్ కల్యాణ్ గత ఎన్నికల్లో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం, విశాఖలోని గాజువాక నుంచి పోటీ చేసి రెండుచోట్లా ఓటమిపాలయ్యారు. అయినా ఏమాత్రం నిరుత్సాహపడకుండా మరోసారి పోటీకి సిద్ధంగా ఉన్నారు. కానీ ఈసారి సీఎం పదవే లక్ష్యంగా కాకుండా రాష్ట్ర ప్రయోజనాల కోసం పొత్తులతో పవన్ ముందుకెళ్లాలని భావిస్తున్నారు. పవన్ 2024 ఎన్నికల్లో రాష్ట్ర రాజకీయాల్లో బలమైన ప్రభావం చూపనున్నారు. గత ఎన్నికల తరువాత ఓటమి భయంతో వెనుకడుగు వేయకుండా పలు పర్యటనలతో ప్రజలతో మమేకమవుతున్నారు. పలు పర్యటనలతో ప్రజలకు దగ్గరవుతున్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు ఆర్థిక సహాయం చేయటంతో పాటు అకాల వర్షాలకు పంటలను కోల్పోయిన రైతుల్ని పరామర్శించటం వంటి పలు కీలక కార్యక్రమలతో ఓ పక్క.. సినిమా షూటింగులు మరోపక్క పర్యటనలతో బిజీ బిజీగాగా ఉన్నారు.

Also Read: కోడెల శివరాంను బుజ్జగిస్తున్న టీడీపీ నేతలు.. చంద్రబాబును కలిసిన కన్నా.. ఇంకా

మరి ముఖ్యంగా వారాహి యాత్ర చేయటానికి పక్కా ప్లాన్ తో పవన్ రెడీ అయినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే వారాహి యాత్ర ప్రారంభమవ్వాల్సి ఉండగా.. ఒప్పుకున్న సినిమాలకు కూడా సమయం కేటాయించాల్సి ఉండటంతో షూటింగుల్లో బిజీగా ఉన్నారు. కాగా పవన్ కల్యాణ్ ఈసారి తూర్పుగోదావరి నుంచి పోటీకి దిగుతారని సమాచారం. అందుకే ముందుగా ఇదే జిల్లా నుంచి యాత్ర ప్రారంభిస్తున్నారనే అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి. కాగా ఇప్పటి వరకు వారాహి యాత్ర ప్రారంభించికపోవటానికి కారణం నారా లోకేష్ యువగళం యాత్ర వల్లేనని విమర్శలు ఉన్నాయి. కానీ విమర్శలకు చెక్ పెడుతూ ఇక వారాహి యాత్ర షురూ కానుంది.