Pawan Kalyan At Rushikonda : మట్టి గుట్ట ఎక్కి.. రుషికొండ దగ్గర నిర్మాణాలను పరిశీలించిన పవన్ కల్యాణ్

విశాఖ పర్యటనలో ఉన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ రుషికొండను పరిశీలించారు. మట్టి గుట్ట ఎక్కి.. అక్కడ జరుగుతున్న పనులను స్వయంగా చూశారు.

Pawan Kalyan At Rushikonda : మట్టి గుట్ట ఎక్కి.. రుషికొండ దగ్గర నిర్మాణాలను పరిశీలించిన పవన్ కల్యాణ్

Pawan Kalyan At Rushikonda : విశాఖ పర్యటనలో ఉన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ రుషికొండను పరిశీలించారు. వైసీపీ నేతలు యథేచ్ఛగా తవ్వేస్తున్నారంటూ టీడీపీ సహా వామపక్షాలు ఆరోపిస్తున్న రుషికొండను పరిశీలించేందుకు పవన్ వెళ్లారు. జనసేనకు చెందిన స్థానిక నేతలను కొందరిని వెంటేసుకుని రుషికొండ చేరుకున్న పవన్ కల్యాణ్.. కొండపై జరుగుతున్న పనులేమిటన్న దానిపై ఆరా తీశారు. ఈ సందర్భంగా కొండపై పనులు జరుగుతున్న ప్రాంతాల్లో భారీ షీట్లతో బారికేడ్లు ఏర్పాటు చేసి ఉండగా.. వాటిని ముట్టుకోని పవన్.. ఆ బారికేడ్లకు ఆనుకుని ఉన్న ఓ మట్టి గుట్టను ఎక్కి.. బారికేడ్ల అవతలివైపు ఏం జరుగుతోందన్న దాన్ని పరిశీలించారు.

విశాఖ పర్యటనకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యేందుకు శుక్రవారం పవన్ కల్యాణ్ నగరానికి చేరుకున్న సంగతి తెలిసిందే. శుక్రవారం ప్రధాని మోదీ, జనసేన నేతలతో భేటీలతోనే గడిపిన పవన్ కల్యాణ్.. నగరంలో మరే కార్యక్రమం పెట్టుకోలేదు. తాజాగా ప్రధాని విశాఖను వీడిన తర్వాత విశాఖ పరిసర ప్రాంతాల పరిశీలనకు పవన్ బయలుదేరారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

అంతకుముందు శనివారం సాయంత్రం వైజాగ్ బీచ్ లో పవన్ దర్శనమిచ్చారు. నాదెండ్ల మనోహర్ తో కలిసి కాసేపు బీచ్ లో నడిచారు పవన్. బీచ్ నీళ్లలో కలియతిరిగారు. అక్కడే కనిపించిన మత్సకారులతో మాట్లాడారు. ఫిషింగ్ గురించి వారిని అడిగి తెలుసుకున్నారు. పవన్ కల్యాణ్ సడెన్ గా బీచ్ కు రావడంతో ఆయన్ని చూసేందుకు స్ధానికులు తరలివచ్చారు. ఫొటోలు దిగేందుకు ఎగబడ్డారు.

పవన్ కళ్యాణ్ శుక్రవారం సాయంత్రం వైజాగ్ వచ్చారు. ప్రధాని మోదీతో ఐఎన్ఎస్ చోళ గెస్ట్ హౌస్ లో భేటీ అయ్యారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాపై చర్చలు జరిపారు. తర్వాత అక్కడి నుంచి నోవోటెల్ హోటల్ కు వెళ్లిపోయారు. పవన్ శుక్రవారం రాత్రికి హైదరాబాద్ వెళ్లిపోతారని భావించినా శనివారం కూడా విశాఖలోనే ఉన్నారు. ఉదయం నుంచి హోటల్ లో ఉంటూ మధ్యలో పార్టీ నేతలతో భేటీ అయిన పవన్.. సాయంత్రానికి బీచ్ లో దర్శనమిచ్చారు. గత విశాఖ పర్యటనలో బీచ్ లో వాకింగ్ చేయాలని ఉందని పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు. అప్పుడు అది సాధ్యపడలేదు. అయితే, ఈ పర్యటనలో తన కోరికను తీర్చుకున్నారు పవన్ కల్యాణ్. వైజాగ్ బీచ్ లో అలా అలా తిరిగి తన సరదా తీర్చుకున్నారు పవన్.