పార్టీలు మారినప్పుడల్లా రాజధానులు మారకూడదు, అధికారం అంతిమ లక్ష్యం వేల కోట్లు కూడగట్టుకోవడం కాకూడదు

  • Published By: naveen ,Published On : November 17, 2020 / 03:41 PM IST
పార్టీలు మారినప్పుడల్లా రాజధానులు మారకూడదు, అధికారం అంతిమ లక్ష్యం వేల కోట్లు కూడగట్టుకోవడం కాకూడదు

pawan kalyan: పార్టీలు మారినప్పుడల్లా రాజధానులు మారకూడదని జనసేనాని పవన్ కళ్యాణ్ అన్నారు. రాజధాని విషయంలో 2014 నిర్ణయానికే జగన్ ప్రభుత్వం కట్టుబడి ఉండాలన్నారు. రాజధానిగా అమరావతే ఉండాలని జనసేన మొదటి నుంచి డిమాండ్ చేస్తోందని పవన్ గుర్తు చేశారు. అధికారం అంతిమ లక్ష్యం రూ.వేల కోట్లు కూడగట్టుకోవడం కాదన్న పవన్.. ప్రజలు కోల్పోయిన వాటిని అందజేయడం అని హితవు పలికారు. అది జనసేన చేస్తుందని పార్టీ శ్రేణుల భేటీలో పవన్ అన్నారు. సమస్యను ఎత్తి చూపితే వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని పవన్ మండిపడ్డారు. అంతేకానీ వాటిని పరిష్కరించే ఆలోచన మాత్రం పాలకులకు లేదని ఘాటు విమర్శలు చేశారు.

పారిపోవడం నాకు తెలీదు:
తనకు జీవితంలో పారిపోవడం తెలియదని పవన్ అన్నారు. ఏ సమస్యనైనా ధైర్యంగా ఎదుర్కొంటానని చెప్పారు. అభిప్రాయం చెప్పాల్సి వచ్చినప్పుడు ధైర్యంగా చెబుతానని అన్నారు. పాలకులు పరిస్థితులకు తగ్గట్టు మాట మార్చేస్తూ ఉంటారని ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు. అమరావతి విషయంలో అదే జరిగిందని పవన్ అన్నారు. విభజించి పాలించే విధానంతో వెళ్తున్నారని పవన్ మండిపడ్డారు.

స్పీడ్ పెంచిన పవన్:
సినిమాలో బిజీగా ఉంటూనే రాజకీయంగా స్పీడ్ పెంచారు పవన్. ఇందులో భాగంగా ఆయన మంగళగిరిలో పర్యటిస్తున్నారు. రెండు రోజుల పాటు పార్టీ కార్యాలయంలో వివిధ జిల్లాల నాయకులతో పవన్ సమావేశం కానున్నారు. నవంబర్ 17న ఉదయం 11గంటలకు ఇచ్ఛాపురం, రాజోలు, మంగళగిరి, నెల్లూరు రూరల్, అనంతపురం నియోజకవర్గాల పై సమీక్ష జరిపారు పవన్. మధ్యాహ్నం మూడు గంటలకు తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల ముఖ్య నేతలతో భేటీ అయ్యారు. బుధవారం(నవంబర్ 18,2020) ఉదయం పది గంటలకు అమరావతి పోరాట సమితి నేతలు, అమరావతికి చెందిన కొందరు మహిళా రైతులతో పవన్ కళ్యాణ్ భేటీ కానున్నారు. ఆ తర్వాత 32 నియోజకవర్గాల నేతలతో సమావేశమై పార్టీ సభ్యత్వ కార్యక్రమంపై సూచనలు చేస్తారు.
https://10tv.in/pawan-kalyan-meeting-with-his-party-leaders-and-cader/
రాజధానిపై జేఏసీ నేతలకు పవన్ ఎలాంటి భరోసానిస్తారు:
ఏపీలో జనసేన పార్టీ పరిస్థితులపై ముఖ్య నాయకులు నివేదికల రూపంలో ఇచ్చారు. దీంతో ఇప్పటికే సినిమా షూటింగ్‌లతో బిజీగా ఉన్న పవన్.. రాజకీయ కార్యక్రమాలకు కూడా సమయం కేటాయించాలని పార్టీ నేతలు కోరుతున్నారు. రాజధాని పై జేఏసీ నేతలకు పవన్ ఎలాంటి భరోసానిస్తారోనని అంతా ఎదురు చూస్తున్నారు. జనసేన భవిష్యత్‌ కార్యచరణ గురించి పవన్ ఎలాంటి ప్రకటన చేస్తారన్నది ఆసక్తిగా మారింది.