Loan App Harassment : తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ పెరుగుతున్న లోన్‌యాప్ ఆగడాలు..బలైపోతున్న ప్రాణాలు | loan app harassment in Ap Telangana states

Loan App Harassment : తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ పెరుగుతున్న లోన్‌యాప్ ఆగడాలు..బలైపోతున్న ప్రాణాలు

ఓ అడ్రస్ ఉండదు.. చెప్పుకోవడానికి ఆఫీస్ ఉండదు. ఇవ్వడం అయినా.. లాక్కోవడం అయినా.. అంతా ఆన్‌లైనే ! డబ్బులు చెల్లించడం గంట అటు ఇటు అయినా.. ప్రాణాలు తీసేలా వేధిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో లోన్‌యాప్ ఆగడాలు మళ్లీ పెరిగాయ్. మన అవసరాన్ని వాళ్లు పెట్టుబడిగా చేసుకొని.. నరకం చూపిస్తున్నారు. శవాల మీద చిల్లర ఏరుకుంటున్నారు. లోన్‌యాప్ ఆగడాలతో వరుసగా ప్రాణాలు పోతున్న వేళ.. పోలీసులు అలర్ట్ అయ్యారు.

Loan App Harassment : తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ పెరుగుతున్న లోన్‌యాప్ ఆగడాలు..బలైపోతున్న ప్రాణాలు

loan app harassment In AP and telangana : ఓ అడ్రస్ ఉండదు.. చెప్పుకోవడానికి ఆఫీస్ ఉండదు. ఇవ్వడం అయినా.. లాక్కోవడం అయినా.. అంతా ఆన్‌లైనే ! డబ్బులు చెల్లించడం గంట అటు ఇటు అయినా.. ప్రాణాలు తీసేలా వేధిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో లోన్‌యాప్ ఆగడాలు మళ్లీ పెరిగాయ్. మన అవసరాన్ని వాళ్లు పెట్టుబడిగా చేసుకొని.. నరకం చూపిస్తున్నారు. శవాల మీద చిల్లర ఏరుకుంటున్నారు. లోన్‌యాప్ ఆగడాలతో వరుసగా ప్రాణాలు పోతున్న వేళ.. పోలీసులు అలర్ట్ అయ్యారు.

అది ఆన్‌లైన్‌ లోన్ కాదు.. ఆన్‌లోన్ యమపాశం ! అవసరమే వారికి పెట్టుబడి.. డబ్బులు కావాలని ఒక్క క్లిక్ చేస్తే చాలు క్షణాల్లో బ్యాంక్ ఖాతాల్లో మనీ జమ చేస్తారు. ఎంతో కొంత వడ్డీ తీసుకుంటారు. సక్రమంగా కట్టామా సరేసరి ! లేకపోతే ఇక అంతే సంగతులు. ఫోటో పెట్టి.. డబ్బులు తీసుకున్నాడు తిరిగి ఇవ్వడం లేదు.. మోసం చేస్తున్నాడు.. అంటూ బంధువులకు, మిత్రులకు, తెలిసిన వారికి, పరిచయం ఉన్న వారికి అందరికీ మేసేజీలు పెడతారు. ఆ తర్వాత తెలిసిన వారికి ఫోన్లు చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారు. కొన్ని సందర్భాల్లో అయితే… తీసుకున్న అప్పు పూర్తిగా చెల్లించినా.. వడ్డీ పెరిగిందని, ఛార్జీలు కట్టాలని వేధిస్తారు. బంధుమిత్రులకు మేసేజీ పెడతామని బెదిరిస్తారు. ప్రాణం ఉన్నంతసేపు, రక్తం పారినంతసేపు జలగలు పీల్చుకుంటాయేమో… ఈ ఆన్‌లైన్‌ దగుల్బాజీలు మాత్రం ప్రాణం పోయినా వదలడం లేదు. వేధింపులు ఆపడం లేదు.

ఆన్‌లైన్‌లో లోన్‌యాప్స్‌ ఇప్పుడు పోటెత్తుతున్నాయ్. ఈ యాప్స్‌ ద్వారా అప్పులు తీసుకొని.. వాటికి వడ్డీలు చెల్లించలేక అవమానాలు పాలైన వ్యక్తులు తెలుగు రాష్ట్రాల్లో ఎంతోమంది ! లక్ష రూపాయాలు తీసుకొని వడ్డీగా 2 లక్షలు కట్టిన ఘటనలు ఎన్నో ఉన్నాయ్. వడ్డీకి చక్రవడ్డీ.. ఆపైన భూచక్రవడ్డీ లెక్కలు వేసి జలగలు పీల్చినట్లు.. జనాల రక్తం పీలుస్తున్నాయీ ఆన్‌లైన్ లోన్‌యాప్స్‌. అప్పులు తీర్చలేక ఆత్మహత్య చేసుకున్న ఘటనలు ఎన్నో చూశాం కూడా ! ప్రభుత్వాలు, పోలీసులు.. వీటిపై కఠిన చర్యలు తీసుకుంటున్నా.. ఆగడాలు ఆగడం లేదు. ఆ మధ్య ఆ దారుణాలు తగ్గినట్లే కనిపించినా.. ఇప్పుడు ఆన్‌లైన్‌ లోన్ మాఫియా మళ్లీ విషం కక్కుతోంది.

ఖమ్మం జిల్లాలో లోన్‌యాప్ ఆగడాలు వెలుగులోకి వచ్చాయ్. తీసుకున్న రుణం చెల్లించినా.. మళ్లీ వేధించడం మొదలుపెట్టారు. అప్పు ఇంకా తీరలేదని.. చెల్లించకపోతే ఇంట్లో వాళ్ల ఫొటోను మార్ఫింగ్ చేసి.. పోర్న్‌సైట్లలో అప్‌లోడ్‌ చేస్తామని బెదిరించారు. ఖమ్మం జిల్లా మధిర పట్టణానికి చెందిన ప్రవీణ్‌ అనే యువకుడిని లోన్‌యాప్‌ నిర్వాహకులు పెట్టిన హింస అంతా ఇంతా కాదు. యువకుడి కాంటాక్ట్‌ లిస్టులో ఉన్న ఫోన్‌ నంబర్లకు మోసగాడు అంటూ మెసేజ్‌ పంపారు. అప్పు ఇచ్చే ముందు ఆ యువకుడి ఆధార్‌తో పాటు అతని తల్లి ఆధార్ ఫొటో కాపీలు కూడా తీసుకున్నారు. ఇప్పుడు వాటిని అడ్డుపెట్టుకొని అతనికి నరకం చూపిస్తున్నారు.

ఖమ్మం యువకుడిని మాత్రమే కాదు.. మంచిర్యాలకు చెందిన ఓ యువతిని కూడా యాప్‌కింకరులు ఇలానే బెదిరించారు. ఫొటోలు మార్ఫింగ్‌ చేసి.. వాటిని అందరికి పంపిస్తామని బెదిరించారు. దీంతో ఆ యువతి ఆత్మహత్య చేసుకుంది. ఇంత జరిగాక కూడా లోన్‌యాప్ నిర్వాహకులు దారుణాలు ఆగలేదు. యువతి చనిపోయిన ఫొటోను పంపించాలని డిమాండ్‌ చేశారు. ఇక హైదరాబాద్‌లోనూ లోన్‌యాప్ కేసులు భారీగా పెరుగుతున్నాయ్. ఈ మధ్యే వేధింపులు తాళలేక ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో లోన్‌యాప్‌ ఆగడాలు మరోసారి చర్చకు దారి తీస్తున్నాయ్. ఇప్పటికిప్పుడు అడ్డుకోకపోతే మరిన్ని దారుణాలు చూడాల్సి వస్తుందన్న ఆందోళన కనిపిస్తోంది.

రెండేళ్ల కింద జరిగిన పరిణామాలతో పోలీసులు రంగప్రవేశం చేసి.. లోన్‌యాప్‌ల మీద ఉక్కుపాదం మోపేందుకు ప్రయత్నాలు చేశారు. చైనా మూలాలు గుర్తించి.. కొందరిని అరెస్ట్ చేసి ఈడీకి అప్పగించారు కూడా ! ఐతే ఆ తర్వాత నెమ్మదించిన లోన్‌యాప్ ఆగడాలు.. ఇప్పుడు మళ్లీ మొదలయ్యాయ్. అంతకుమించి అనే స్థాయిలో వేధింపులు పెరిగాయ్. ప్రాణాలు మింగేస్తున్నాయ్. ఇలాంటి దరిద్రపు యాప్‌లకు దూరంగా ఉండడమే ఉత్తమమని పోలీసులు సూచిస్తున్నారు. అప్పటికప్పుడు అవసరం తీరుతుంది.. లోన్‌ కట్టకపోతే బెదిరింపులు వస్తాయ్.. ఆలస్యం చేస్తే బంధువులకు అసభ్య మెసేజ్‌లు వెళ్తాయ్. ఇంకా ఆలస్యం చేస్తే.. మార్ఫింగ్ చేసిన న్యూడ్‌ ఫొటోలు పంపిస్తారు.. అవసరమా ఈ లోన్‌ యాప్స్‌ అని పోలీసులు చెప్తున్నారు.

ఈ లోన్‌ యాప్‌ల పేర్లు కూడా తమాషాగా ఉంటాయ్. బబుల్‌ లోన్, లిక్విడ్‌ క్యాష్, రుపీ ఫ్యాక్టరీ, పైసా లోన్, ఫ్లిప్‌క్యాష్, ఇన్‌నీడ్, రుపీప్లస్, పాన్‌లోన్, క్యాష్‌పాట్, వన్‌హోప్‌… ఇలా వీటికి అంతేలేదు. గూగుల్‌ ప్లే స్టోర్‌లో 5వందలకు పైగానే ఇలాంటి యాప్స్ ఉన్నాయన్న లెక్కలు వినిపిస్తున్నాయ్. ఒక్కో యాప్‌నకు దాదాపు 10 లక్షలకుపైగా డౌన్‌లోడ్స్‌ ఉన్నాయంటే పరిస్థితి.. ఇవి ఎంతలా అల్లుకుపోయాయో అర్థం చేసుకోవచ్చు. వీటికి ఒక వెబ్‌సైట్‌గానీ.. చెప్పుకోవడానికి ఆఫీస్‌గానీ ఉండవ్‌. కనీసం సంప్రదించడానికి ఫోన్‌ నంబర్‌ కూడా ఉండదు. అన్నిటికీ యాప్‌ ఒక్కటే మార్గం. ఇవ్వడమైనా, గుంజుకోవడమైనా ఆన్‌లైనే !

×