Audimulapu Suresh : ఆ పని వైసీపీ వాళ్లే చేశారని తేల్చితే రాజకీయ సన్యాసం తీసుకుంటా : మంత్రి ఆదిమూలపు
లోకేష్ హింసను ప్రోత్సహిస్తున్నాడు.. అతని వల్ల శాంతి భద్రతలు లోపించే అవకాశం ఉందన్నారు. ఎవరు ఎవరిని తరిమి కొడతారో ప్రజలే తేలుస్తారని పేర్కొన్నారు.

Minister Adimulapu Suresh (1)
Audimulapu Suresh- Chandrababu : టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్ పై మంత్రి ఆదిమూలపు సురేష్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. యర్రగొండపాలెంలో చంద్రబాబు కాన్వాయ్ పై రాళ్లు వేసిన వాళ్లు ఎవరో తేల్చేందుకు తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. రాళ్లు ఎవరు వేశారో వీడియోల్లో స్పష్టంగా ఉందన్నారు. ఒకవేళ వైసీపీ వాళ్లే రాళ్లు వేశారని తేల్చితే తాను రాజకీయ సన్యాసం తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నానని సవాల్ చేశారు. ఈ మేరకు బుధవారం మంత్రి ప్రకాశం జిల్లాలో మీడియాతో మాట్లాడారు. సరుకు లేకనే యర్రగొండపాలెంలో ఇటువంటి రాజకీయాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు.
లోకేష్ హింసను ప్రోత్సహిస్తున్నాడు.. అతని వల్ల శాంతి భద్రతలు లోపించే అవకాశం ఉందన్నారు. ఎవరు ఎవరిని తరిమి కొడతారో ప్రజలే తేలుస్తారని పేర్కొన్నారు. సెల్ ఫోన్ కనిపెట్టాను, టెక్నాలజీ అంతా తనకే తెలుసంటున్న చంధ్రబాబు అదే టెక్నాలజీ దొంగ ఓటర్లను ఏరిపారేస్తోందన్నారు. దొంగ ఓట్లు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలిసిపోతుందికదా ఇక తప్పిదమెక్కడుందని ప్రశ్నించారు.
డీబీటీలో వందల కోట్లు అవినీతి జరిగిందంటూ అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. డబ్బులు నేరుగా లబ్ధిదారుల అకౌంట్లలోకి వెలుతుంటే ఎక్కడ అవినీతి ఉందని నిలదీశారు. జగన్ మళ్లీ సీఎం కాకూడదనే కక్షతోనే ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. ‘రెడ్ డైరీ ఉంది..మీ అంతు చూస్తాం..తరిమి తరిమి కొడతామంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు.. మీరు అధికారంలోకి వస్తానంటుంది ఇందుకోసమేనా’ అని ప్రశ్నించారు.
ఊర్వకొండలో దొంగ ఓట్ల నమోదు జరిగిందంటూ ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. చంద్రబాబు ఎన్ని రాజకీయాలు చేసినా ఎదుర్కోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. ఆధార్, మోభైల్ నెంబర్ తో ఓటు సీడింగ్ జరుగుతోందన్నారు. ఎక్కడ కూడా అక్రమంగా ఓట్ల తొలగింపు అనేది లేదని స్పష్టం చేశారు.