పదో తరగతి పరీక్షలు రద్దు చేయాలి: ఎమ్మెల్యే అనగాని డిమాండ్

  • Published By: vamsi ,Published On : June 14, 2020 / 07:24 AM IST
పదో తరగతి పరీక్షలు రద్దు చేయాలి: ఎమ్మెల్యే అనగాని డిమాండ్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేబినెట్‌ మీటింగ్‌ సరిగా నిర్వహించలేని ప్రభుత్వం పదవ తరగతి పరీక్షలు ఎలా నిర్వహిస్తుందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు రేపల్లె తెదేపా ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌. కరోనా నివారణలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విమర్శించారు ఆయన.

పదవ తరగతి పరీక్షలు నిర్వహించాలి అని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం వల్ల విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నట్లు చెప్పారు ఆయన. పదో తరగతి పరీక్షలు రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. కరోనా వైరస్‌కు భయపడి ముఖ్యమంత్రి తాడేపల్లి ప్యాలెస్‌ నుంచి, మంత్రులు తమ నియోజకవర్గం దాటి బయటకు రావడం లేదన్నారు.

ఇటువంటి పరిస్థితుల్లో విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు ఎలా వస్తారని ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం, తమిళనాడు ప్రభుత్వాలు మాదిరిగా ఏపీలో కూడా పదో తరగతి పరీక్షలు రద్దు చేసి విద్యార్థులను తర్వాతి తరగతికి పాస్‌ చేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో రోజు రోజుకీ కరోనా కేసులు పెరుగుతుంటే.. పరీక్షలు నిర్వహించి విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడతారా? అంటూ ఆయన మండిపడ్డారు.