తెలుగు తమ్ముళ్ల వివాదం : బాబు ఫోన్ కాల్ తో అంతా సైలెంట్

తెలుగు తమ్ముళ్ల వివాదం : బాబు ఫోన్ కాల్ తో అంతా సైలెంట్

MP Kesineni Nani : విజయవాడలో తెలుగు తమ్ముళ్ల మధ్య వార్ ముగిసినట్లు తెలుస్తోంది. అధినేత చంద్రబాబు విజయవాడకు రానున్నారు. అక్కడ ఆయన ప్రచారం నిర్వహిస్తుండడంతో నేతలు ఉమ్మడిగా ఏర్పాట్లు చేస్తున్నారు. రచ్చరచ్చగా మారిన కోల్డ్ వార్ ను విజయవాడకు రాకముందే..బాబు కంట్రోల్ చేశారు. మేయర్ అభ్యర్థిగా ఎంపీ కేశినేని నాని కుమార్తె శ్వేత సీటు ఇవ్వడంతో సీనియర్ నేతలు బుద్ధా వెంకన్న, బోండా ఉమా, నాగుర్ మీరా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అంతేగాకుండా..నాని తీరుపై బహిరంగంగానే విమర్శలు గుప్పించారు.

చంద్రబాబును కేశినేని నాని రాంగ్ ట్రాక్ లో తీసుకెళుతున్నారంటూ..ఆరోపణలు చేశారు. నేతల మధ్య పెరుగుతున్న మాటల యుద్ధం పార్టీకి నష్టం చేకూరేలా ఉందని బాబు గ్రహించారు. వెంటనే రంగంలోకి దిగిన బాబు..అందరినీ కంట్రోల్ చేశారు. ఒక్క ఫోన్ కాల్ తో పరిస్థితిని పూర్తిగా మార్చేశారు. ఈక్రమంలో మేయర్ అభ్యర్థి కేశినేని శ్వేత..బోండా ఉమ ఇంటికి వెళ్లారు. నగరపాలక ఎన్నికల్లో తనకు సహకరించాలని కోరారు. అధినేత వార్నింగ్ ఇవ్వడం, శ్వేత స్వయంగా ఇంటికి వచ్చి విజ్ఞప్తి చేయడంతో సీనియర్ నేతలు సైలెంట్ అయిపోయారు. ఆమెకు మద్దతు ఇస్తూ ప్రచారంలో పాల్గొంటామని హమీనిచ్చారు. విజయవాడ పరిధిలోని మూడు నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తామని చెప్పారు.

అయితే…విజయవాడలో బాబు నిర్వహించే ఎన్నికల ప్రచారంలో ఎంపీ కేశినేని నాని పాల్గొంటారా ? లేదా ? అనేది తెలియరాలేదు. బహిరంగంగానే కామెంట్స్ చేసిన…వారు ప్రచారంలో పాల్గొంటే..తాను దూరంగా ఉంటానని కేశినేని నాని సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. తూర్పు గోదావరి జిల్లాలో పిఠాపురంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ నారా లోకేష్ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు.