Konidela Nagababu : ఇప్పటికైనా ప్రజల రాజధాని నిర్మించాలి, ప్రజలతో శత్రుత్వం వద్దు- నాగబాబు

వైసీపీ ప్రభుత్వం పంతాలకు పోకూడదని నాగబాబు(Konidela Nagababu) హితవు పలికారు. ఏ ప్రభుత్వం అయినా ప్రజలతో శత్రుత్వం పెట్టుకుంటే..

Konidela Nagababu : ఇప్పటికైనా ప్రజల రాజధాని నిర్మించాలి, ప్రజలతో శత్రుత్వం వద్దు- నాగబాబు

Nagababu

Konidela Nagababu : అమరావతి రాజధానిపై ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై మెగాబ్రదర్ నాగబాబు స్పందించారు. కోర్టు తీర్పుపై హర్షం వ్యక్తం చేసిన నాగబాబు.. ఏపీ రాష్ట్ర చరిత్రలోనే హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చిందని అన్నారు. ఇది.. సుమారు 800 రోజులకు పైగా మొక్కవోని దీక్ష చేస్తున్న అమరావతి రైతులు, మహిళలు, అందరి విజయంగా అభివర్ణించారు.

గతంలో అధికార టీడీపీ అమరావతిని రాజధానిగా ప్రతిపాదించగా, వైసీపీ కూడా ఒప్పుకుందని నాగబాబు(Konidela Nagababu) గుర్తు చేశారు. అమరావతే రాజధాని అవుతుందని నమ్మి రైతులు తమ భూములు ఇచ్చారని చెప్పారు. కానీ, అధికారంలోకి వచ్చాక అమరావతి రాజధానిని నిర్వీర్యం చేయాలని వైసీపీ ప్రయత్నించిందని నాగబాబు ఆరోపించారు. ప్రభుత్వం మూడు రాజధానుల ప్రతిపాదన తెరపైకి తెచ్చిందన్నారు.

”అమరావతి ఉద్యమాన్ని వైసీపీ మంత్రులు, నేతలు ఎన్నో మాటలు అన్నారు. స్పాన్సర్డ్ ఉద్యమం, స్వార్థపరుల ఉద్యమం అని అన్నారు. ఇన్ని రోజుల పాటు చేసే ఉద్యమాలు కడుపు రగిలితేనే వస్తాయి తప్ప స్పాన్సర్లతో రావు. అమరావతి ఉద్యమానికి మా జనసేన పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్, జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, జనసేన నాయకులు, కార్యకర్తలు ఎంతో మద్దతిచ్చాం” అని నాగబాబు అన్నారు.

Botsa Satyanarayana: రాజధాని అంశంలో హైకోర్టు తీర్పుపై స్పందించిన మంత్రి బొత్స

”హైకోర్టు తీర్పుతో మేం కూడా చాలా సంతోషిస్తున్నాం. అమరావతి ఓ రాజధానిగా ఏర్పడే తరుణం వచ్చిందనుకుంటున్నాం. ఇక వైసీపీ నేతలకు నేను చెప్పేది ఏంటంటే… హైకోర్టు తీర్పునే అంతిమ తీర్పు అనుకోండి. ఒకవేళ సుప్రీంకోర్టుకు వెళతారేమో… అక్కడా రాజధాని ప్రాంత రైతులకే అనుకూల తీర్పు రావడం ఖాయం” అని నాగబాబు అన్నారు.

వైసీపీ ప్రభుత్వం పంతాలకు పోకూడదని నాగబాబు హితవు పలికారు. ఏ ప్రభుత్వం అయినా ప్రజలతో శత్రుత్వం పెట్టుకుంటే నిలబడడం కష్టం అని చెప్పారు. ఎవరితోనైనా పెట్టుకోండి కానీ ప్రజల జోలికి వెళ్లొద్దన్నారు. వైసీపీ ప్రభుత్వం అలాంటి తప్పు చేసిందన్నారు. ఇకనైనా తప్పుదిద్దుకుని, హైకోర్టు తీర్పును గౌరవించి, అమరాతి రైతుల మనోవేదనను తగ్గించేలా ముందుకు వెళ్లాలని సూచించారు నాగబాబు.

రాజధాని అనేది అమరావతి పరిసరాల్లోని ప్రజలకు మాత్రమే చెందింది కాదని, రాష్ట్రం మొత్తానికి చెందిన రాజధాని అని నాగబాబు స్పష్టం చేశారు. ఇది ప్రజల విజయం అని అన్నారు. భారతదేశంలో న్యాయవ్యవస్థలు ఇంకా పటిష్ఠంగా ఉన్నాయని చెప్పడానికి హైకోర్టు ఇచ్చిన తీర్పే నిదర్శనం అని నాగబాబు అన్నారు. ఈ మేరకు నాగబాబు తన అభిప్రాయాలను తెలుపుతూ వీడియో రిలీజ్ చేశారు.

ఆంధ్రప్రదేశ్ రాజధానిపై హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. రాజధాని ప్రాంత ప్రాధికార సంస్థ (సీఆర్డీఏ) చట్టం ప్రకారమే రాష్ట్ర ప్రభుత్వం నడుచుకోవాలని ఆదేశించింది. 6 నెలల్లోగా మాస్టర్ ప్లాన్ ను పూర్తి చేయాలని ఆదేశాలిచ్చింది. ఈ మేరకు మూడు రాజధానుల ఏర్పాటు, రాజధాని ప్రాంత ప్రాధికార సంస్థ (సీఆర్డీఏ) రద్దుపై దాఖలైన 75 వ్యాజ్యాలపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం గురువారం తీర్పునిచ్చింది.

రాజధానిపై చట్టాలు చేసే అధికారం అసెంబ్లీకి లేదని, అమరావతినే రాజధానిగా అభివృద్ధి చేయాలని, అభివృద్ధి పనులపై ఎప్పటికప్పుడు నివేదిక సమర్పించాలని ఆదేశించింది. మాస్టర్ ప్లాన్ లో ఉన్నది ఉన్నట్టుగా అమలు చేయాలని తేల్చి చెప్పింది. అమరావతి నుంచి ఆఫీసులను తరలించకూడదని స్పష్టం చేసింది. భూములను ప్రభుత్వానికిచ్చిన రైతులు, వాటాదారులకు 3 నెలల్లోగా అన్ని సౌకర్యాలతో అభివృద్ధి చేసిన ప్లాట్లను అప్పగించాలని ప్రభుత్వానికి తేల్చి చెప్పింది.

Andhra Pradesh : మూడు రాజధానులు, CRDA రద్దుపై హైకోర్టు తీర్పు

అంతేకాదు రాజధాని అవసరాలకు తప్ప ఇతర అవసరాలకు ఆ భూములను తాకట్టు పెట్టరాదని న్యాయస్థానం స్పష్టం చేసింది. అమరావతి రాజధానిపై వ్యాజ్యాలు దాఖలు చేసిన పిటిషనర్లకు ఖర్చుల కింద రూ.50 వేల చొప్పున చెల్లించాల్సిందిగా సర్కారును ఆదేశించింది.