అసలు కాదు నకిలీ, కడప జిల్లాలో రోడ్డు ప్రమాదంలో కొత్త ట్విస్ట్

  • Published By: naveen ,Published On : November 2, 2020 / 04:25 PM IST
అసలు కాదు నకిలీ, కడప జిల్లాలో రోడ్డు ప్రమాదంలో కొత్త ట్విస్ట్

kadapa road accident: కడప జిల్లా వల్లూరు మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. తమిళ స్మగ్లర్లకు, నకిలీ పోలీసులకు మధ్య జరిగిన ఛేజింగ్‌ వల్లే ప్రమాదం జరిగినట్లు గుర్తించారు పోలీసులు. ఎర్ర చందనం దుంగలను అక్రమంగా తీసుకెళ్తూ నకిలీ పోలీసులకు పట్టుబడటంతో స్మగ్లర్లు వారినుంచి తప్పించుకునే ప్రయత్నం చేశారు. పోలీసులకు దొరక్కూడదని.. వారి నుంచి తప్పించుకునేందుకు వాహనంలో అతివేగంగా వెళ్తూ .. రోడ్డు పక్క నుంచి డీజిల్‌తో వస్తున్న టిప్పర్ ను గమనించలేదు.

మంటల్లో నలుగురు స్మగ్లర్లు సజీవ దహనం:
దీంతో తమిళ స్మగ్లర్లు వస్తున్న స్కార్పియో అతి వేగంగా వెళ్తూ .. టిప్పర్‌ను బలంగా ఢీ కొట్టింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పెద్ద ఎత్తున అక్కడున్న వాహనాలకు మంటలు అంటుకున్నాయి. ఈ మంటల్లో నలుగురు స్మగ్లర్లు సజీవ దహనమయ్యారు. మరో ముగ్గురికి తీవ్రగాయాలు కాగా వారిని రిమ్స్‌ కు తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో వ్యక్తి చనిపోయాడు. స్వల్పంగా గాయపడ్డ ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

కారు నకిలీ పోలీస్‌ గ్యాంగ్‌ది:
వేగంగా వస్తున్న స్కార్పియో.. డీజిల్‌తో వెళ్తున్న టిప్పర్‌ ను గమనించనందుకే ప్రమాదం జరిగినట్లు గుర్తించారు పోలీసులు. ప్రమాదంలో సజీవ దహనమైన వారితో పాటు గాయపడ్డ వారంతా స్మగ్లర్ల బ్యాచ్ కాగా.. వెంబడిస్తున్న కారు నకిలీ పోలీస్‌ గ్యాంగ్‌దిగా గుర్తించారు. నకిలీ పోలీసుల కోసం గాలింపు ముమ్మరం చేశారు.

కడప జిల్లా శివారులోని గోటూరు, తోళ్లగంగన్నపల్లె మధ్యలో అర్ధరాత్రి రెండు గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. స్కార్పియో వాహనంలో ఎర్ర చందనం అక్రమ రవాణా చేస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. వీరంతా తమిళనాడుకు చెందిన స్మగ్లర్లుగా గుర్తించారు.