లాక్ డౌన్ నిబంధనలను తుంగలో తొక్కిన పలమనేరు ఎమ్మెల్యే

  • Published By: madhu ,Published On : April 3, 2020 / 10:33 AM IST
లాక్ డౌన్ నిబంధనలను తుంగలో తొక్కిన పలమనేరు ఎమ్మెల్యే

ప్రస్తుతం కరోనా ఫీవర్ నెలకొంది. దేశ మంతా లాక్ డౌన్ అమల్లో ఉంది. ఇళ్లలోనే ఉండాలని స్వయంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కోరుతున్నారు. కానీ ఈ నిబంధనలు తనకు పట్టవ్..అని అనుకున్నారో ఏమోగాని ..ఓ ప్రజాప్రతినిధి చేసిన నిర్వాకం చూసి ప్రజలు చీదరించుకుంటున్నారు. సామాజిక దూరం పాటించాలని చెప్పాల్సిన పలమనేరు ఎమ్మెల్యే  వెంకట గౌడ గీత దాటారు. అనుచరులను వెంటేసుకుని రోడ్లపైకి ఎక్కారు. ఇతనిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

దేశంలో లాక్ డౌన్ అమలవతున్న క్రమంలో సభలు, సమావేశాలు, ప్రారంభోత్సవాలు, ర్యాలీలు, ఇతరత్రా వాటిని నిషేధించారు. కానీ చిత్తూరు జిల్లా పలమనేరు ఎమ్మెల్యే వెంకట గౌడ నిబంధనలు ఉల్లఘించారు. 2020, ఏప్రిల్ 03వ తేదీ శుక్రవారం పలమనేరు నియోజకవర్గంలోని వి.కోట మండల కేంద్రంలోని కీలపల్లి సప్లై ఛానల్ పై నిర్మించిన ఓ కల్వర్టును అట్టహాసంగా ప్రారంభించారు. ప్రారంభోత్సవం అంటే ఎలా ఉంటుందో అలాగే జరిగింది. పూలమాలలు వేసుకోవడం, గుంపులుగా రావడం, షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడం జరిగాయి. చాలా మంది అనుచరులు వెంట వచ్చారు. 

కార్యక్రమం నిర్వహించడం నిబంధనలకు విరుద్ధం..పైగా ఇంత మందితో ఇలా చేయడం సబబు కాదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే పలమనేరు రెడ్ జోన్ పరిధిలో ఉంది. పలమనేరులో మూడు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వందల మంది క్వారంటైన్ లో చికిత్సలు తీసుకుంటున్నారు. ఈ సమయంలో ఎంతో జాగ్రత్తగా నిలిచి..ప్రజలకు సూచనలు, సలహాలు చెప్పాల్సిన ప్రజాప్రతినిధిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై ఆయన ఎలాంటి సమాధానం చెబుతారో చూడాలి.