Parabolic Solar Dryer : ఇక పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు ఎంచక్కా ఎండబెట్టుకుని తినొచ్చు.. సోలార్ డ్రయ్యర్ వచ్చేసింది..

Parabolic Solar Dryer : ఇక పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు ఎంచక్కా ఎండబెట్టుకుని తినొచ్చు.. సోలార్ డ్రయ్యర్ వచ్చేసింది..

Parabolic Solar Dryer

Parabolic Solar Dryer : పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం వెంకట్రామన్నగూడెంలోని ఉద్యాన విశ్వవిద్యాలయంలోని కృషి విజ్ఞాన కేంద్రంలో పారాబోలిక్‌ సోలార్‌ డ్రయ్యర్‌ ఏర్పాటు చేశారు. రాష్ట్ర ఉద్యాన శాఖ సహకారంతో రూ.4.80 లక్షలతో సమకూర్చిన దీనిని ఇటీవల వర్సిటీ వైస్ చాన్సలర్ ప్రారంభించారు. ఈ డ్రయ్యర్ లో పండ్లు, ఆకుకూరలు, కూరగాయలను ఎండ బెట్టుకుని నిల్వ చేసుకోవచ్చు. రుచిలో ఏ మాత్రం తేడాలుండవు. ఎండిన తర్వాత వివిధ రకాల ఉత్పత్తులను తయారు చేసుకుని ప్యాకెట్లలో నిల్వ చేసుకోవచ్చు.

24 కిలోవాట్ల సామర్థ్యం.. సౌర విద్యుత్తుతో పనిచేసే విధంగా యంత్రానికి సమీపంలోనే 24 కిలోవాట్ల సౌర పలకను(సోలార్ ప్యానెల్) ఏర్పాటు చేశారు. ఎండ తక్కువగా ఉన్నప్పుడు, వర్షాకాలంలో కూడా ఈ యంత్రం సౌర విద్యుత్తుతో పనిచేసే విధంగా రూపకల్పన చేశారు. యంత్రానికి అమర్చిన కంట్రోల్‌ ప్యానల్‌ ఉష్ణోగ్రత, తేమశాతాన్ని సమయానుకూలంగా మారుస్తుంది.

ఎండబెట్టుకునే విధానం..
* పనస, సపోటా, మామిడి, అరటి, ఉల్లి, కొబ్బరి, అల్లం వెల్లుల్లి, ఎండు మిరప వంటి వాటితో పాటు ఆకుకూరలు, కూరగాయలను ఈ యంత్రంలో సులువుగా ఆరబెట్టవచ్చు.
* ఒకేసారి 100 నుంచి 150 కిలోలను యంత్రం లోపల ఏర్పాటు చేసిన ట్రేలలో ఉంచి డ్రయ్యర్‌ చేయవచ్చు.
* సాధారణంగా ఉద్యాన ఉత్పత్తుల్లో 80 నుంచి 90 వరకూ తేమ శాతం ఉంటుంది.
* ఎండ బెట్టడంతో తేమ 10 శాతానికి తగ్గిపోతోంది.
* బయటి ఉష్ణోగ్రతలు 35 డిగ్రీలుంటే యంత్రం లోపల 50 నుంచి 55 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయి.
* దీంతో ఆయా ఉత్పత్తులు పూర్తిగా ఆరిపోవటానికి గంట నుంచి 14 గంటల వరకూ సమయం పడుతోంది.
* ఎండిన ఉత్పత్తులను పొడిగా చేసుకుని ప్యాకెట్లలో ఆరు నెలల నుంచి ఏడాది వరకు నిల్వ చేసుకోవచ్చు.
* మునగకాయల కంటే ఆకుల్లో, కరివేపాకు, జీడిమామిడిలో ఎక్కువ పోషకాలుంటాయి.
* వీటిని యంత్రం ద్వారా ఆరబెట్టి బిస్కెట్‌లు, జామ్‌లు, జ్యూస్‌ల తయారీపై మహిళలకు శిక్షణ ఇవ్వనున్నారు.
* మహిళలు ఇంటి దగ్గరే సొంతంగా ఈ యూనిట్లను ఏర్పాటు చేసుకునేలా ప్రోత్సహిస్తామని కేవీకే సమన్వయకర్త కరుణశ్రీ, శాస్త్రవేత్త వెంకటసుబ్బయ్య వెల్లడించారు.

* పండ్లను అధిక ఉష్ణోగ్రతలో ఎండబెట్టడం ద్వారా వాటి పరిమాణం చాలావరకు తగ్గిపోతోంది.
* కిలో పండ్ల నుంచి 200 గ్రాములు, కిలో ఆకుకూరల నుంచి 180 గ్రాములొస్తాయి.
* అయితే వీటి రుచిలోనూ, పోషక విలువల్లోనూ ఎటువంటి తేడాలుండవు.
* కిలోలో ఉండాల్సిన పోషకాలు, విటమిన్లు, ప్రొటీన్లు, ఖనిజ లవణాలన్నీ 200 గ్రాముల్లోనే లభిస్తాయి.