Pawan Kalyan: అమరావతిలో బీజేపీ నాయకులపై దాడిని ఖండించిన పవన్ కళ్యాణ్

రైతులు 1200 రోజులుగా చేస్తున్న దీక్షలకు మద్దతు పలికిన సత్య కుమార్ పై వైసీపీ శ్రేణులు దాడికి పాల్పడటం గర్హనీయమని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

Pawan Kalyan: అమరావతిలో బీజేపీ నాయకులపై దాడిని ఖండించిన పవన్ కళ్యాణ్

Pawan Kalyan: బీజేపీ జాతీయ కార్యదర్శి సత్య కుమార్(Y Satya Kumar) పై దాడిని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఖండించారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు 1200 రోజులుగా చేస్తున్న దీక్షలకు మద్దతు పలికిన సత్య కుమార్ పై వైసీపీ శ్రేణులు దాడికి పాల్పడటం గర్హనీయమని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య వాదులందరూ ఈ దాడిని ఖండించాలని పవన్ పిలుపు నిచ్చారు. ఈ మేరకు శుక్రవారం పత్రికా ప్రకటన విడుదల చేశారు.

‘అధికారంలో ఉన్న వైసీపీ దాదాగిరి పరాకాష్టకు చేరిందనే వాస్తవం ఈ దాడితో మరోమారు తేటతెల్లమయింది. ఈ దాడిని ప్రతి ప్రజాస్వామ్యవాది ఖండించాలి. రాజధాని రైతులకు మద్దతుగా నిలిస్తే దాడులు చేస్తామని రాష్ట్ర పాలకులు సందేశం ఇస్తున్నారా? ఇదే వైసీపీ ముఖ్యమంత్రి శ్రీ జగన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) గారి విధానం అయితే మేము కచ్చితంగా ప్రజాస్వామ్య పద్ధతిలోనే సమాధానం ఇస్తాం.

‘ఆదినారాయణ రెడ్డి తప్పించుకున్నారు’ అని వైసీపీ ఎంపీ ప్రకటించారు అంటూ శ్రీ సత్య కుమార్ గారు చెప్పిన మాటలపై పోలీసులు దర్యాప్తు చేపట్టాలి. రాజధాని ప్రాంతంలో వైసీపీ శ్రేణులు చేసిన ఈ దాడి ఘటనను బీజేపీ అధినాయకత్వం (BJP High Command) తీవ్రంగా పరిగణించాలి. కేంద్ర ప్రభుత్వం సమగ్ర విచారణ చేయాలి. మూడు రాజధానులు అంటూ ప్రజలను మభ్యపెడుతున్న వైసీపీ ముఖ్యమంత్రినీ, ఆయన పార్టీనీ ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లోని పట్టభద్రులే ఎమ్మెల్సీ ఎన్నికల్లో తిరస్కరించారు.

క్షోభపడుతున్న రాజధాని రైతులకు అండగా నిలుస్తున్న రాజకీయ పక్షాలను, సంఘాలను వైసీపీ ముఖ్యమంత్రి, ఆయన అనుచరులు వర్గ శత్రువులుగా చూస్తున్నారు. రాష్ట్ర పాలకులు సామాన్య ప్రజలపైనా, ప్రశ్నించిన వారిపైనా ఏ విధంగా దౌర్జన్యాలు చేస్తున్నదీ, ప్రతిపక్ష నాయకులను వేధిస్తూ, వారిపై దాడులకు పాల్పడుతున్నదీ త్వరలోనే కేంద్ర ప్రభుత్వం దృష్టికి జనసేన పార్టీ (Janasena Party) తీసుకువెళ్తుంద’ని పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తన ప్రకటనలో పేర్కొన్నారు.

Also Read: బీజేపీకి మూడు రాజధానుల సెగ.. జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌ వాహనంపై దాడి

బీజేపీ నేతలపై వైసీపీ దాడి
రాజధాని రైతులకు సంఘీభావం ప్రకటించి తిరిగి వస్తుండగా ఉద్దండరాయునిపాలెంలో తమపై ఎంపీ నందిగం సురేశ్ అనుచరులు దాడి చేశారని సత్యకుమార్ ఆరోపించారు. తన కారు అద్దాలు పగలగొట్టారని తెలిపారు. చిరుమామిళ్ల అశోక్ తో పాటు తమ కార్యకర్తలపై దాడికి దిగారని చెప్పారు. కాగా, తమ పార్టీ నేతలపై దాడిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు(somu veerraju), కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి (Daggubati Purandeswari) ఖండించారు.