Pawan Kalyan : యుద్ధానికి సిద్ధంగా ఉన్నాం, ప్రజల్లో మార్పు వచ్చే వరకు పోరాటం చేస్తాం- పవన్ కల్యాణ్

Pawan Kalyan : యుద్ధానికి సిద్ధంగా ఉన్నాం, ప్రజల్లో మార్పు వచ్చే వరకు పోరాటం చేస్తాం- పవన్ కల్యాణ్

Pawan Kalyan : విశాఖ ఎయిర్ పోర్టు దగ్గర మంత్రుల కాన్వాయ్ పై దాడి ఘటనపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్రంగా స్పందించారు. జగన్ ప్రభుత్వంపై ఆయన ఫైర్ అయ్యారు. జనసేన కార్యకర్తల అరెస్ట్ ను పవన్ ఖండించారు.

తాము లేని సమయంలో దాడులు జరిగాయని, ఈ గొడవతో తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని పవన్ కల్యాణ్ తేల్చి చెప్పారు. తమ కార్యకర్తలపై పెట్టిన కేసులను వెంటనే ఉపసంహరించుకుని, వారిని విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే తత్వం ఉండాలన్నారు.

”కనీసం పాతికేళ్లు సేవ చేయాలనే పార్టీని పెట్టాం. ఏ పార్టీ కూడా మరో పార్టీని ఎదగనివ్వాలని చూడదు. అది సహజం. మేము యుద్ధానికి సిద్ధంగా ఉన్నాం. దెబ్బలు తగలకుండా, జైలుకెళ్లకుండా, కేసులు పడకుండా రాజకీయం ఉండదు. అది మాకు ఓకే. నా మీద ఎన్ని కేసులు పెట్టినా నేను జైలుకి వెళ్లడానికి కూడా సిద్ధమే. సరదాగా చెప్పడం లేదు. ఐయామ్ ప్రిపేర్డ్.

ఈ రాష్ట్రం గురించి, ఈ దేశం గురించి మాట్లాడే వ్యక్తుల సమూహం పెరగాలని కోరుకుంటున్నా. ఒక తరానికి బాధ్యతను గుర్తు చేయడానికి వచ్చాం. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే తత్వం లేకపోతే దోపిడీ పెరిగిపోతుంది. బూతులు తిట్టేవాళ్లు, దౌర్జన్యాలు, అక్రమాలు, భూదందాలు, మర్డర్లు, మానభంగాలు చేసే వాళ్లని వెనకేసుకొచ్చే వాళ్లు రాజ్యాన్ని ఏలుతారు. ఇలాంటి నేరచరితులు పోవాలంటే ప్రజల్లో మార్పు రావాలి. ఆ మార్పు వచ్చే వరకు మేము పోరాటం చేస్తాం. మార్పు రావొచ్చు, రాకపోవచ్చు. కానీ, మా పోరాటం ఆగదు” అని పవన్ కల్యాణ్ అన్నారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

కాగా.. విశాఖ ఎయిర్ పోర్టు దగ్గర వైసీపీ మంత్రులు, నాయకులపై జరిగిన రాళ్ల దాడికి సంబంధించిన కేసులో పోలీసులు గత అర్ధరాత్రి జనసేన నాయకులను అరెస్ట్ చేశారు. విమానాశ్రయం వద్ద జరిగిన దాడికి సంబంధించి సీసీటీవీ ఫుటేజీని సేకరించిన పోలీసులు దాని ఆధారంగా నిందితులను గుర్తించి పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అనంతరం కోన తాతారావు, పీతల మూర్తియాదవ్, విశ్వక్‌సేన్, సుందరపు విజయ్ కుమార్, పంచకర్ల సందీప్, శివప్రసాద్‌రెడ్డి, పీవీఎస్ఎన్ రాజు, శ్రీనివాస్ పట్నాయక్, కీర్తీస్, యశస్విని, గేదెల చైతన్య, పట్టిమ రాజులను అరెస్ట్ చేశారు.

మంత్రులు జోగి రమేశ్, రోజా, ఇతర వైసీపీ నాయకుల కార్లపై రాళ్లు, జెండా కర్రలు, పదునైన ఇనుప వస్తువులతో జనసేన నాయకులు వారిని దూషిస్తూ దాడికి పాల్పడినట్టు పోలీసులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఆస్తులు కూడా ధ్వంసమైనట్టు తెలిపారు.