Pendurthi Constituency: పెందుర్తిలో ఈసారి హైవోల్టేజ్ పోటీ.. అందుకే పంచకర్ల రమేశ్‌బాబు పార్టీ మారారా?

పెందుర్తి రాజకీయం ప్రస్తుతానికి మంచి కాకమీద కనిపిస్తోంది. టీడీపీ జనసేన పొత్తు ఉంటే హోరాహోరీ పోరు జరిగే అవకాశం ఉంది. లేదంటే వైసీపీ, టీడీపీ, జనసేన మధ్య ముక్కోణ పోటీ జరుగుతుంది.

Pendurthi Constituency: పెందుర్తిలో ఈసారి హైవోల్టేజ్ పోటీ.. అందుకే పంచకర్ల రమేశ్‌బాబు పార్టీ మారారా?

Pendurthi Assembly Constituency Ground Report

Pendurthi Assembly Constituency: విశాఖ నగరంలోని పెందుర్తి నియోజకవర్గం రాజకీయం హీటెక్కిస్తోంది. ఇండస్ట్రియల్ కారిడార్‌తో పరిశ్రమలకు నెలవైన పెందుర్తి విశాఖ నగరానికే ఆయువుపట్టు. అలాంటి చోట గత ఎన్నికల్లో పట్టుసాధించింది వైసీపీ.. ఒకసారి గెలిచిన వారు రెండోసారి గెలవని ఈ నియోజక వర్గంలో వరుసగా జరిగిన మూడు ఎన్నికల్లో మూడు పార్టీల నేతలు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. వచ్చే ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీ చేయాలని అనుకున్న మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్‌బాబు (Panchakarla Ramesh Babu) టిక్కెట్ రాదని తేలిపోవడంతో జిల్లా పార్టీ అధ్యక్షపదవిని వదులుకుని జనసేనలో చేరిపోయారు. ఇక సిట్టింగ్ ఎమ్మెల్యే ఆదీప్‌రాజుకు (Annamreddy Adeep Raj) లైన్‌క్లియర్‌గా భావిస్తుండగా.. ఒక్కసారి గెలుపు సెంటిమెంట్ ఆయన్ను వేధిస్తోందని చెబుతున్నారు. ఇంతకీ పెందుర్తిలో ఈ సెంటిమెంట్ ఏంటి? వచ్చే ఎన్నికల్లో కనిపించబోయే సీనేంటి?

పెందుర్తి నియోజకవర్గం 2009లో ఏర్పాటైంది. నియోజ‌క‌వర్గాల పున‌ర్విభ‌జ‌న‌లో భాగంగా ప‌ర‌వాడ‌, స‌బ్బవ‌రం, పెందుర్తి మండ‌లాలను కలిపి ఈ నియోజకవర్గాన్ని ఏర్పాటు చేశారు. విశాఖ నగరంలోని కొంత ప్రాంతంతో పాటు శివార్లలో ఉన్న గ్రామాలు ఇందులో ఉన్నాయి. పరవాడ పారిశ్రామిక వాడలో ఉన్న పరిశ్రమలతో ఈ ప్రాంతం వేలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పిస్తోంది. అదేసమయంలో ఫార్మా పరిశ్రమల కాలుష్యం కూడా సమస్యగా మారింది. వచ్చే ఎన్నికల్లో ఫార్మా పరిశ్రమల బాధితుల ఓట్లే కీలకమని చెబుతున్నారు.

Annamreddy Adeep Raj

Annamreddy Adeep Raj

పెందుర్తిలో ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా అన్నంరెడ్డి ఆదీప్‌రాజు వ్యవహరిస్తున్నారు. యువకుడైన ఆదీప్ గత ఎన్నికల్లో మాజీ మంత్రి, సీనియర్ నేత బండారు సత్యనారాయణ మూర్తిపై (Bandaru Satyanarayana Murthy) అనూహ్య విజయం సాధించారు. పెద్దగా రాజకీయ అనుభవం లేకపోయినా.. బండారుకు వ్యతిరేకంగా చేసిన రాజకీయం.. వయసు, వైసీపీ హవా గత ఎన్నికల్లో ఆదీప్‌కు భారీ మెజార్టీని తెచ్చిపెట్టింది. వచ్చే ఎన్నికల్లోనూ ఆయనే అభ్యర్థిగా పోటీ చేస్తారని వైసీపీ ఉత్తరాంధ్ర జిల్లాల సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి (YV Subba Reddy) ఇప్పటికే ప్రకటించారు. ఇలా ఆయన ప్రకటించడంతోనే నియోజకవర్గంలో వ్యతిరేకత బయటపడింది. ఆదీప్‌రాజుకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారనే కారణంతో శరగడం చిన అప్పలనాయుడు (Saragadam Chinna Appala Naidu) అనే సీనియర్ నాయకుడిపైసస్పెన్షన్ వేటు వేసింది వైసీపీ అధిష్టానం. ఇదే సమయంలో వచ్చే ఎన్నికల్లో ఆదీప్‌కే టిక్కెట్ అన్న ప్రకటనతో.. ఈ స్థానంపై ఆశలు పెట్టుకున్న మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్‌బాబు పార్టీని వీడారు. ఇలా ఇద్దరు ముఖ్యమైన నేతలు పార్టీ నుంచి బయటకు వెళ్లిపోవడంతో ఆదీప్‌రాజుకు లైన్ క్లియర్ అయింది. కానీ, వచ్చే ఎన్నికల్లో ఆయన గెలవడం అంత ఈజీ కాదంటున్నారు పరిశీలకులు.

Also Read: పాయకరావుపేటలో అంతకుముందు అనితకు ఎదురైన పరిస్థితే.. ఇప్పుడు బాబురావుకు..

గత ఎన్నికల్లో సంచలన విజయం సాధించిన ఆదీప్‌రాజు.. ఇంతవరకు ఎన్నికల హామీలను అమలు చేయలేదనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా సింహాచలం భూముల సమస్య, ఫార్మా కాలుష్యంతో ఇబ్బంది పడుతున్న తాడ గ్రామం తరలింపు ఎమ్మెల్యేకు పెద్ద తలనొప్పిగా మారింది. జగనన్న హౌసింగ్ పథకంలో పైడివాడ అగ్రహారం వద్ద మెగా లే అవుట్, పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం ఎమ్మెల్యేకు బలంగా మారింది. పెట్రోలియం యూనివర్శిటీ భూ సమస్యను పరిష్కరించడం, షీలానగర్‍-సబ్బవరం ఆరులైన్ల రహదారికి క్లియరెన్స్ తేవడం ఎమ్మెల్యేకు కలిసొస్తుందని చెబుతున్నారు.

Panchakarla Ramesh Babu

Panchakarla Ramesh Babu

కానీ, ఎమ్మెల్యేకు పార్టీలోనే సీనియర్ల నుంచి సహకారం కొరవడుతోందని చెబుతున్నారు. ఎమ్మెల్యేకు ఇతర నాయకులకు గ్యాప్ ఉండటంతో వచ్చే ఎన్నికల్లో మైనస్ అయ్యే చాన్స్ ఎక్కువగా ఉందని విశ్లేషకులు అభిప్రాయం. ముఖ్యంగా వైసీపీ నుంచి జనసేనలో (Jana Sena) చేరిన పంచకర్ల రమేశ్‌బాబు ప్రభావం ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. అదేసమయంలో పార్టీ సస్పెన్షన్ వేటు వేసిన శరగడం చిన అప్పలనాయుడు, పంచకర్ల చేతులు కలిపితే.. ఎమ్మెల్యే వ్యతిరేక వర్గం సంఘటితం అయ్యే చాన్స్ ఉందంటున్నారు. మరోవైపు పంచకర్ల బలమైన కాపు సామాజిక వర్గ నేత. ఆ సామాజిక వర్గ ఓటర్లు ఎక్కువగా ఉండటం.. ఆదీప్‌రాజు సామాజిక వర్గం నుంచే టీడీపీ నాయకుడు బండారు సత్యనారాయణమూర్తి పోటీ చేయడం వల్ల ఓట్లు చీలిపోయి.. రమేశ్‌కు మేలు జరిగొచ్చని విశ్లేషిస్తున్నారు. అంతేకాకుండా టీడీపీ-జనసేన పొత్తులో భాగంగా ఈ సీటు జనసేనకు వెళ్లే చాన్స్ ఉందంటున్నారు. ఆ విషయం గ్రహించే మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్‌బాబు ముందుగా జనసేనలో చేరిపోయారని చెబుతున్నారు. ఏదిఏమైనా రమేశ్‌బాబు మూలంగా వైసీపీ ఓటుకు గండిపడే ప్రమాదం ఉందంటున్నారు పరిశీలకులు.

Bandaru Satyanarayana Murthy

Bandaru Satyanarayana Murthy

ఇక వైసీపీకి ప్రధాన ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ తరఫున మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి పోటీచేస్తారా? లేక ఆయన వారసుడు అప్పలనాయుడు బరిలో దిగుతారో ఇంతవరకు తేలలేదు. తండ్రి వారసత్వంతో అప్పలనాయుడు కూడా యాక్టివ్‌గా తిరుగుతున్నారు. ఎమ్మెల్యే ఆదీప్‌రాజు యువకుడు కావడంతో అప్పలనాయుడినే పోటీలో దింపాలని టీడీపీలో ఓ వర్గం కోరుతోంది. కానీ, సీనియర్ కావడం.. అనుభవం ఉండటంతో సత్యానారాయణమూర్తినే పోటీ చేయమంటోంది అధిష్టానం.

Gandi Babji

Gandi Babji

ఇదే సమయంలో మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీతో (Gandi Babji) విభేదాలు టీడీపీలో ఆందోళన పుట్టిస్తున్నాయి. పెందుర్తి నియోజకవర్గానికి చెందిన బాబ్జీని విశాఖ దక్షిణ నియోజకవర్గానికి మార్చినా.. బాబ్జీ అనుచర గణం అంతా పెందుర్తిలోనే ఉన్నారు. వైసీపీ నుంచి బయటకు వచ్చిన బాబ్జీ 2019 ఎన్నికల్లో టీడీపీలో చేరారు. అప్పట్లో బాబ్జీ చేరికకు అడ్డు చెప్పారు సత్యానారాయణమూర్తి. ఇద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో ఓట్లు సంఘటితమవుతాయని సత్యనారాయణమూర్తికి ఒప్పించింది టీడీపీ అధిష్టానం. కానీ, నాలుగున్నరేళ్లుగా ఇద్దరూ వేర్వేరుగానే వ్యవహరిస్తున్నారు. బాబ్జీని విశాఖ దక్షిణ నియోజకవర్గానికి పంపినా.. తన అనుచరుల కోసం పెందుర్తి రాజకీయాల్లో జోక్యం చేసుకుంటున్నారు బాబ్జీ. ఈ ఇద్దరి మధ్య పోరు అధికార పార్టీకి లాభించే అవకాశం ఉందని అంటున్నారు పరిశీలకులు.

Also Read: ఆమదాలవలసలో మామ మరోసారి జెండా ఎగరేస్తారా.. అల్లుడు చక్రం తిప్పుతాడా?

మొత్తానికి పెందుర్తి రాజకీయం ప్రస్తుతానికి మంచి కాకమీద కనిపిస్తోంది. టీడీపీ జనసేన పొత్తు ఉంటే హోరాహోరీ పోరు జరిగే అవకాశం ఉంది. లేదంటే వైసీపీ, టీడీపీ, జనసేన మధ్య ముక్కోణ పోటీ జరుగుతుంది. ఇటు
పంచకర్ల, అటు బండారుతో ఎమ్మెల్యే ఆదీప్‌రాజు తలపడుతున్నారు. ఇద్దరి సీనియర్ల రాజకీయ చాణక్యాన్ని ఎలా ఎదుర్కొంటారో.. పార్టీలో వ్యతిరేకతను ఎలా అధిగమిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా మాజీ
ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్‌బాబు, టీడీపీ నేత బండారు సత్యనారాయణమూర్తి కలిసి పనిచేస్తే రిజల్ట్ ఎలా ఉంటుందనేది ఎవరికీ అంచనాలకు అందడం లేదు. ఏదైనా సరే పెందుర్తిలో ఈసారి హైవోల్టేజ్ పోటీ జరుగుతుందనే అభిప్రాయమే వ్యక్తమవుతోంది.