Ap Capital Heat: హీటెక్కిన రాజధాని రాజకీయం.. శ్రీశైలం టూ అమరావతి చైతన్య యాత్ర
అమరావతి ఉండాలంటూ ఆ ప్రాంత రైతులు చేస్తున్న పోరాటానికి వ్యతిరేకంగా రాయలసీమ మేధావుల ఫోరం ఆందోళనలకు శ్రీకారం చుట్టింది.

Capital
Ap Capital Heat: ఏపీలో రాజధాని అంశం మరింత హీటెక్కుతోంది. ఏకైక రాజధానిగా అమరావతి ఉండాలంటూ ఆ ప్రాంత రైతులు చేస్తున్న పోరాటానికి వ్యతిరేకంగా రాయలసీమ మేధావుల ఫోరం ఆందోళనలకు శ్రీకారం చుట్టింది. ఒక రాజధాని వద్దు మూడు రాజధానులు ముద్దు అనే నినాదంతో యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది.
అధికార వికేంద్రీకరణకు మద్దతుగా రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేపట్టాలని నిర్ణయించింది. మూడు రాజధానులకు మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా రిలే దీక్షలు, ఆందోళనలు చేపట్టనున్నట్లు రాయలసీమ మేధావుల ఫోరం నేతలు తెలిపారు. ప్రతి విశ్వవిద్యాలయంలో అధికార వికేంద్రీకరణ కోసం సదస్సులు నిర్వహిస్తామని పేర్కొన్నారు. త్వరలోనే శ్రీశైలం టూ అమరావతికి చైతన్య యాత్ర చేపట్టనున్నట్లు రాయలసీమ మేధావుల ఫోరం తెలిపింది.
రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలంటే రాయలసీమతో పాటు , ఉత్తరాంధ్రలోనూ రాజధానులు ఉండాలని రాయలసీమ హక్కుల వేదిక నేతలు స్పష్టం చేశారు. అమరావతి రైతులు నిర్వహించిన సభకు పోటీగా రాయలసీమ మేధావుల ఫోరం ఇందిరా మైదానంలో బహిరంగ సభను ఏర్పాటు చేశారు.
ఈ బహిరంగ సభలో పాల్గొన్న రాయలసీమ మేధావుల ఫోరం కన్వీనర్ పురుషోత్తం రెడ్డి ..అభివృద్ధి ఒకే ప్రాంతానికి పరిమతం కారాదన్నారు. వికేంద్రీకరణతో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని పేర్కొన్నారు.