Thopudurthi Prakash Reddy: చంద్రబాబు విషయంలో న్యాయం గెలిచిందా? రోగం గెలిచిందా?
చంద్రబాబు బయటకు రాగానే జంతు బలులు ఇస్తున్నారు.. చంద్రబాబుకు అధికారం వస్తే ఇంకెంత మందిని బలిస్తారో అంటూ ప్రకాశ్ రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు.

Thopudurthi Prakash Reddy
Raptadu MLA : టీడీపీ అధినేత చంద్రబాబుకు హైకోర్టు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ నాలుగు వారాలు ఇచ్చిందని, దీంతో న్యాయం గెలిచిందంటూ టీడీపీ శ్రేణులు విచిత్ర విన్యాసాలు చేయడం సిగ్గుచేటని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి విమర్శించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు విడుదల సందర్భంగా టీడీపీ నాయకులు జంతు బలి ఇవ్వడం దారుణం అన్నారు. మానవతాదృక్పదంతోనే కోర్టు చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ ఇచ్చిందని, కానీ, టీడీపీ శ్రేణులు మాత్రం చంద్రబాబు చిత్ర పటానికి పొట్టేళ్లను బలి ఇచ్చి.. రక్తం పూసి హేయమైన కార్యక్రమాలు చేస్తున్నారని ప్రకాశ్ రెడ్డి మండిపడ్డారు.
చంద్రబాబు బయటకు రాగానే జంతు బలులు ఇస్తున్నారు.. చంద్రబాబుకు అధికారం వస్తే ఇంకెంత మందిని బలిస్తారో అంటూ ప్రకాశ్ రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. శాశ్వతంగా జైలులో ఉండాల్సిన చంద్రబాబు నాలుగు వారాలు వైద్యంకోసం మాత్రమే బయటకు వచ్చాడని అన్నారు. చంద్రబాబు ఇంకొక పదిహేనేళ్లు బతకాలి.. సీఎంగా జగన్ ఉండాలి. చంద్రబాబు బతికి ఉన్నంతకాలం ప్రజలు జగన్ మోహన్ రెడ్డిని సీఎంగా గెలిపిస్తారంటూ ప్రకాశ్ రెడ్డి అన్నారు.
వైద్యంకోసం బయటకు వచ్చిన చంద్రబాబు తిరిగి ఆరోగ్యంగా జైలుకు వెళ్లాలి. 2024 కురుక్షేత్ర యుద్ధంలో కౌరవులకు పట్టిన గతే టీడీపీకి పడుతుందని ప్రకాశ్ రెడ్డి జోస్యం చెప్పారు. తప్పు చేసిన వాళ్లు బయట తిరిగితే ప్రజాస్వామ్యం మీద నమ్మకం పోయి ఈ దేశం పాకిస్థాన్ లా తయారువుతుందని ప్రకాశ్ రెడ్డి అన్నారు.