Chandrababu Bail : ఉండవల్లి నివాసానికి చంద్రబాబు.. హారతిచ్చి స్వాగతం పలికిన భువనేశ్వరి.. టీడీపీ శ్రేణులకు అచ్చెన్నాయుడు కీలక సూచన

రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు నుంచి మధ్యంతర బెయిల్ పై బయటకు వచ్చిన చంద్రబాబు నాయుడు బుధవారం తిరుపతి వెళ్లి స్వామివారి దర్శనం చేసుకోవాల్సి ఉంది. కానీ, చంద్రబాబును వైద్య పరీక్షలకు వెంటనే హైదరాబాద్ తీసుకురావాలని ..

Chandrababu Bail : ఉండవల్లి నివాసానికి చంద్రబాబు.. హారతిచ్చి స్వాగతం పలికిన భువనేశ్వరి.. టీడీపీ శ్రేణులకు అచ్చెన్నాయుడు కీలక సూచన

Chandrababu

Chandrababu Bail : స్కిల్ డెవలప్మెంట్ కేసులో రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబు నాయుడుకు హైకోర్టు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆయన మంగళవారం సాయంత్రం 4.15నిమిషాల సమయంలో జైలు నుంచి బయటకు వచ్చారు. తెలుగుదేశం పార్టీ శ్రేణులు, ఆయన అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి చంద్రబాబుకు స్వాగతం పలికారు. రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు నుంచి రోడ్డు మార్గం ద్వారా ఉండవల్లిలోని తన నివాసానికి బయలుదేరారు.. దీంతో భారీ సంఖ్యలో టీడీపీ శ్రేణులు చంద్రబాబుకు స్వాగతం పలికేందుకు రోడ్లపైకి రావడంతో చంద్రబాబు ప్రయాణిస్తున్న కాన్వాయ్ నెమ్మదిగా ముందుకు సాగింది. మంగళవారం సాయంత్రం 5గంటల సమయంలో సెంట్రల్ జైలు నుంచి కాన్వాయ్ లో బయలుదేరిన చంద్రబాబు బుధవారం ఉదయం 6 గంటలకు ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకున్నారు.

Chandrababu naidu

Also Read : Kottu Satyanarayana : ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయకపోవడానికి కారణం ఏంటో చంద్రబాబు చెప్పాలి- మంత్రి కొట్టు సత్యనారాయణ

ఉండవల్లి నివాసం వద్ద చంద్రబాబుకు టీడీపీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. నివాసానికి చేరుకున్న చంద్రబాబుకు ఆయన సతీమణి నారా భువనేశ్వరి హారతి ఇచ్చారు. అంతకుముందు చంద్రబాబుకోసం రాత్రి నుంచి ఆయన నివాసం వద్ద ఎదురు చూసిన అమరావతి రైతులు, మహిళలు గుమ్మడి కాయలుకొట్టి చంద్రబాబుకు దిష్టి తీశారు. సెంట్రల్ జైలు నుంచి ఉండవల్లిలోని తన నివాసానికి రావడానికి చంద్రబాబుకు దాదాపు 14గంటల సమయం పట్టింది. రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి బయటికి వచ్చినప్పటి నుంచి ఉండవల్లిలోని తన నివాసంకు చేరుకునేంత వరకు చంద్రబాబుకు టీడీపీ నేతలు, కార్యకర్తలు, జననీరాజనం పలికారు. అర్థరాత్రి, తెల్లవారు జాము వరకు టీడీపీ శ్రేణులు, మహిళలు చంద్రబాబుకోసం రోడ్లపైనే వేచి చూశారు. చంద్రబాబుకు దారి పొడవున పూల వర్షం కురిపించారు. కోర్టు ఉత్తర్వుల మేరకు చంద్రబాబు తన వాహనం నుంచి ఎక్కడా బయటకు రాలేదు. కేవలం తన వాహనంలో నుంచే ప్రజలకు అభివాదం చేసుకుంటూ ముందుకు కదిలారు.

chandrababu

Also Read : Pawan Kalyan : చంద్రబాబుకు బెయిల్ మంజూరు, పవన్ కల్యాణ్ ఏమన్నారంటే..

తిరుపతి పర్యటన రద్దు..
రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు నుంచి మధ్యంతర బెయిల్ పై బయటకు వచ్చిన చంద్రబాబు నాయుడు బుధవారం తిరుపతి వెళ్లి స్వామివారి దర్శనం చేసుకోవాల్సి ఉంది. కానీ, చంద్రబాబును వైద్య పరీక్షలకు వెంటనే హైదరాబాద్ తీసుకురావాలని కుటుంబ సభ్యులకు వైద్యులు సూచనలు చేయడంతో చంద్రబాబు తిరుమల పర్యటన వాయిదా పడింది. ఈ విషయాన్ని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు. చంద్రబాబు ఉండవల్లిలోని తన నివాసం నుంచి నేరుగా వైద్య పరీక్షల కోసం హైదరాబాద్ వెళ్తారు. అయితే, బుధవారం చంద్రబాబు ఎవరినీ కలవరని, ఈ విషయాన్ని నాయకులు, కార్యకర్తలు గమనించాలని అచ్చెన్నాయుడు విజ్ఞప్తి చేశారు.