KG D-6 : ఏపీ తీరంలో రిలయన్స్ గ్యాస్ ఉత్పత్తి

KG D-6 : ఏపీ తీరంలో రిలయన్స్ గ్యాస్ ఉత్పత్తి

reliance-bp-start-gas-production : ఆంధ్రప్రదేశ్‌ తీరంలోని కృష్ణా-గోదావరి బేసిన్‌ నుంచి రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (Reliance) మళ్లీ గ్యాస్‌ ఉత్పత్తి ప్రారంభించింది. కేజీ-డీ6 (KG D – 6) క్షేత్రంలోని ఆర్‌-క్లస్టర్‌ నుంచి కొత్తగా గ్యాస్‌ ఉత్పత్తి ప్రారంభించినట్టు కంపెనీ తెలిపింది. వచ్చే ఏడాదికల్లా ఈ క్లస్టర్‌ నుంచి రోజుకు 1.29 కోట్ల ప్రామాణిక ఘనపు మీటర్ల గ్యాస్‌ ఉత్పత్తి కానుంది. బ్రిటిష్‌ పెట్రోలియం సంస్థ (BP)తో కలిసి రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (Reliance Industries (RIL)) ఈ బ్లాకులో మరో రెండు గ్యాస్‌ క్లస్టర్లను అభివృద్ధి చేస్తోంది. ఈ మూడు క్లస్టర్లు కాకినాడ తీరం నుంచి 60 కిలోమీటర్ల దూరంలో లోతట్టు సముద్ర జలాల్లో ఉన్నాయి. 2022 నాటికి మిగతా రెండు క్లస్టర్ల నుంచి సహజ వాయువు ఉత్పత్తి ప్రారంభం కానుంది.

ఈ మూడు క్లస్టర్ల నుంచి పూర్తి స్థాయిలో గ్యాస్‌ ఉత్పత్తి ప్రారంభమైతే దేశీయంగా 15 శాతం గ్యాస్‌ అవసరాలు దీని ద్వారా తీరిపోతాయని అంచనా వేస్తున్నారు. సముద్ర ఉపరితలం నుంచి దాదాపు 2 వేల మీటర్ల లోతున ఉన్న ఈ బావుల నుంచి రిలయన్స్‌- బీపీ (Reliance – BP) కంపెనీలు గ్యాస్‌ వెలికితీయబోతున్నాయి. ఆసియాలో ప్రస్తుతం మరే ప్రాంతంలోనూ సముద్ర జలాల్లో ఇంత లోతు నుంచి సహజ వాయువును వెలికి తీయడం లేదు. ఆసియాలోనే లోతైన గ్యాస్ బావి నుంచి సహజ వాయువును వెలికి తీస్తున్నట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్, బీపీ సంస్థలు ప్రకటించాయి. కేజీ-డీ 6 (KG D-6) బ్లాక్‌లో ఈ గ్యాస్‌ను వెలికి తీయనున్నారు. ఇక్కడి నుంచి వెలికి తీసే గ్యాస్.. 2023 నాటికి భారత అవసరాల్లో 15 శాతాన్ని తీర్చగలదు. దేశీయ గ్యాస్ ఉత్పత్తిలో ఇది 25 శాతం ఉంటుంది. దీని ద్వారా సహజవాయువు దిగుమతుల భారం తగ్గుతుంది.

ముకేశ్ అంబానీ (Mukesh Ambani)కి చెందిన ఆర్‌ఐఎల్ (RIL), బీపీ (BP) కలిసి.. కేజీ డీ-6 (KG D – 6 )‌లో ఆర్ క్లస్టర్, శాటిలైట్స్ క్లస్టర్, ఎంజే అనే మూడు డీప్ వాటర్ గ్యాస్ ప్రాజెక్టులను అభివృద్ధి చేస్తున్నాయి. కేజీ డీ6 బ్లాక్‌లో ఇప్పటికే ఉన్న హబ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను ఈ ప్రాజెక్టులు ఉపయోగించుకుంటాయి. కేజీ డీ-6లో రిలయన్స్‌కు 66.67 శాతం, బీపీకి 33.33 శాతం పార్టిసిపెంట్ ఇంట్రెస్ట్ ఉన్నాయి. కాకినాడ తీరంలో ప్రస్తుతం ఉన్న కేజీ డీ-6 కంట్రోల్ అండ్ రైజర్ ప్లాట్‌ఫామ్‌కు 60 కిలోమీటర్ల దూరంలో ఆర్ క్లస్టర్ ఫీల్డ్ ఉంది. ఇది ఆసియాలోకెల్లా లోతైన గ్యాస్ ఫీల్డ్‌గా భావిస్తున్నారు. 2021 నాటికి రోజుకు 12.9 మిలియన్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్ల గ్యాస్‌ను ఈ ఫీల్డ్ నుంచి ఉత్పత్తి చేస్తారని అంచనా. శాటిలైట్స్ క్లస్టర్ వచ్చే ఏడాది చివరి నాటికి, అలాగే మూడో ప్రాజెక్టు ఎంజే 2022 చివరి నాటికి అందుబాటులోకి వస్తుందని వెల్లడించారు.