Guntur: రగిలిపోతున్న ముస్తఫా.. మేయర్ ని టార్గెట్ చేసిన ఎమ్మెల్యే.. గుంటూరు వైసీపీలో ఏం జరగుతోంది?

సీఎం జగన్‌కు సన్నిహితుడైన అప్పిరెడ్డి.. తాడికొండ ఎమ్మెల్యేను బయటకు పంపినట్లు తననూ టార్గెట్ చేసుకున్నారని ఎమ్మెల్యే ముస్తాఫా ఆగ్రహం చెందుతున్నారు.

Guntur: రగిలిపోతున్న ముస్తఫా.. మేయర్ ని టార్గెట్ చేసిన ఎమ్మెల్యే.. గుంటూరు వైసీపీలో ఏం జరగుతోంది?

rift in guntur city ysr congress party mla mustafa and mayor fight

Guntur MLA: గుంటూరు నగరంలో అధికార వైసీపీ రాజకీయం గరంగరంగా మారింది. స్వపక్షంలోనే విపక్షంలా నాయకుల మధ్య యుద్ధం జరుగుతోంది. ముఖ్యంగా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో (guntur east constituency) ఎమ్మెల్యే ముస్తఫా (MLA Mustafa) మేయర్ కావాటి మనోహర్ నాయుడు (Kavati Manohar Naidu) మధ్య విభేదాలు మరింత తీవ్రమయ్యాయి. మేయర్ ఉద్దేశ పూర్వకంగా తన నియోజకవర్గ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని మండిపడుతున్న ఎమ్మెల్యే ముస్తఫా.. మేయర్‌పై కార్పొరేషన్ మీటింగ్‌లోనే ఫైర్ అయ్యారు. ఐతే వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ దక్కదనే అనుమానంతోనే ఎమ్మెల్యే రచ్చ చేస్తున్నారని ఆయన వ్యతిరేక వర్గం ప్రచారం చేస్తోంది. ఎప్పుడూ లేనట్లు ఇలా అధికార పార్టీలో ముఖ్య నేతలు బహిరంగ విమర్శలు చేసుకోవడం తీవ్ర చర్చకు దారితీస్తోంది. ఇంతకీ గుంటూరులో ఏం జరుగుతోంది?

గుంటూరు నగరంలో వైసీపీ రాజకీయం హీట్ పుట్టిస్తోంది. ముఖ్యంగా ఎమ్మెల్యే ముస్తాఫాకు టిక్కెట్ రాదంటూ జరుగుతున్న ప్రచారంతో… రాజకీయం ఒక్కసారిగా మారిపోయింది. వరుసగా రెండుసార్లు గెలిచిన ముస్తఫా నగరంలో మంచి పట్టు సంపాదించారు. ఐతే పార్టీ అధికారంలోకి వచ్చినా అభివృద్ధి పనులు చేయించుకోలేకపోతున్నారనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఎమ్మెల్యే గెలవకముందు ప్రతిరోజు నగరంలో తిరుగుతూ.. రోడ్లు, కాలువలు అభివృద్ధి చేస్తానని ప్రజలకు నమ్మకం కల్పించిన ముస్తఫా.. తొమ్మిదిన్నరేళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్నా.. ఆ సమస్యను మాత్రం తీర్చలేకపోయారు. 2014-19 మధ్య వైసీపీ అధికారంలో లేకపోవడంతో పనులు చేయించలేకపోయానని చెప్పిన ముస్తాఫా.. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చినా ఆయా పనులను పూర్తి చేయలేదు.

ఐతే తన నియోజకవర్గం అభివృద్ధిని ఉద్దేశపూర్వకంగానే అడ్డుకుంటున్నారని రగిలిపోతున్న ముస్తఫా.. మేయర్ మనోహర్‌ నాయుడిని టార్గెట్ చేశారు. తన మద్దతుతో మేయర్‌గా గెలిచి.. తన అనుచరులైన కార్పొరేటర్ల
సహకారంతో మేయర్‌గా కొనసాగుతూ.. తన నియోజవర్గంలో పనులు జరగకుండా అడ్డుకుంటున్నారని మండిపడుతున్నారు ఎమ్మెల్యే.. మేయర్ మనోహర్‌నాయుడు, ఎమ్మెల్సీ అప్పిరెడ్డి (Lella Appi Reddy) కలిసి తనను బలహీన పర్చడానికి ప్రయత్నిస్తున్నారని ముస్తాఫా రగిలిపోతున్నారు. ఉద్దేశపూర్వకంగా తనకు టిక్కెట్ దక్కదనే ప్రచారం చేస్తున్నారని.. ఈ ప్రచారాన్ని అడ్డుకోవడానికి మున్సిపల్ సమావేశాన్నే వేదికగా చేసుకున్నారు ముస్తఫా.. తన నియోజకవర్గంలో పనులు ఎందుకు చేయడం లేదని అధికార పార్టీ మేయర్‌పై తిరుగుబాటు చేయడం చర్చనీయాంశమైంది.

Also Read: చిన్నశ్రీను సీనులోకి వస్తే బొత్స పరిస్థితి ఏంటి.. ఎంపీగా పోటీ చేస్తారా?

కొన్నాళ్లుగా ముస్తఫాకు టిక్కెట్ రాదనే ప్రచారం జరుగుతుండటంతో ఆయన కుమార్తెకు టిక్కెట్ ఇప్పించుకోడానికి ప్రయత్నిస్తున్నారు. రెండుసార్లు గెలిచిన ముస్తఫా.. మైనార్టీ ఓట్ల సహకరాంతో మూడోసారి గెలుపుపై ధీమాగా ఉన్నారు. ఐతే ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి తనకు వ్యతిరేకంగా ఉన్నట్లు అనుమానిస్తున్నారు. సీఎం జగన్‌కు సన్నిహితుడైన అప్పిరెడ్డి.. తాడికొండ ఎమ్మెల్యేను బయటకు పంపినట్లు తననూ టార్గెట్ చేసుకున్నారని ఆగ్రహం చెందుతున్నారు. నియోజకవర్గంలో అభివృద్ధి పనులు అడ్డుకుని తనను బలహీన పరచాలని చూస్తున్నారని బహిరంగంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ముస్తఫా.. దీంతో గుంటూరు రాజకీయం ఒక్కసారిగా హీట్ ఎక్కింది. ఎన్నికలు దగ్గరపడుతుంటంతో ఇది ఎంతవరకు దారితీస్తుందోననే ఆందోళన కార్యకర్తల్లో కనిపిస్తోంది.

Also Read: బెజవాడ బ్యాచ్‌పై చంద్రబాబు అసంతృప్తి.. యువగళం పాదయాత్ర కుదింపు.. రగిలిపోతోన్న లోకేశ్!