Tirumala : శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఆఫ్‌లైన్‌లో సర్వదర్శనం టోకెన్లు..!

కరోనా కేసులు తగ్గితే.. ఫిబ్రవరి 15 తర్వాత ఆఫ్‌లైన్ లో సర్వదర్శనం టోకెన్లు భక్తులకు జారీ చేస్తామని తెలిపారు. అంతేకాదు .. కేసులు అదుపులోకి వస్తే.. మార్చి 1 నుంచి..

Tirumala : శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఆఫ్‌లైన్‌లో సర్వదర్శనం టోకెన్లు..!

Tirumala

Updated On : February 4, 2022 / 7:17 PM IST

Tirumala : తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. కరోనా కేసులు తగ్గితే.. ఫిబ్రవరి 15 తర్వాత ఆఫ్‌లైన్ లో సర్వదర్శనం టోకెన్లు భక్తులకు జారీ చేస్తామని టీటీడీ ఈవో జవహర్ రెడ్డి తెలిపారు. అంతేకాదు .. కేసులు అదుపులోకి వస్తే.. మార్చి 1 నుండి శ్రీవారి ఆర్జిత సేవలకు భక్తులను అనుమతిచ్చే అవకాశం కూడా ఉందని తెలిపారు. తిరుమల అన్నమయ్య భవనంలో అధికారులతో టీటీడీ ఈవో జవహర్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. పలు అంశాలపై చర్చించారు.

శ్రీవారి దర్శనం టిక్కెట్లు విక్రయించే నకిలీ వెబ్‌సైట్లను గుర్తించి తొలగిస్తున్నామని ఈవో తెలిపారు. డూప్లికేట్ వెబ్ సైట్లను అడ్డుకునేందుకు టీటీడీ సైబర్ విభాగం నిరంతర నిఘా కొనసాగుతుందన్నారు. టీటీడీ అధికారిక వెబ్‌సైట్ లోనే భక్తులు.. దర్శనం, వసతి టికెట్లు పొందాలని విజ్ఞప్తి చేశారాయన.

Stomach Problem : పొట్ట సమస్య బాధిస్తుందా!…పరిష్కారం మీ చేతుల్లో..?

తిరుమలలో విపత్తుల నిర్వహణపై ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయనున్నామని.. కొండచరియలు, బండరాళ్లు విరిగిపడే ప్రమాదాలను ముందుగానే గుర్తించే సాంకేతికతను తీసుకొస్తామని ఈవో చెప్పారు. ఇప్పటికే ప్రకృతి విపత్తులు, ప్రమాదాలు, భద్రత పరమైన సమస్యలు నివారణకు చేపట్టాల్సిన చర్యలపై చర్చించి… ఈ నెలాఖరులోగా ప్రణాళిక సమర్పించాలని రాష్ట్ర, జాతీయ విపత్తు నివారణ సంస్థలను కోరినట్లు చెప్పారు జవహర్ రెడ్డి. పర్యావరణ పరిరక్షణలో భాగంగా మరింత పటిష్టంగా ప్లాస్టిక్ ‌నిషేధం అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. ఇక ఈ నెల 16న అంజనాద్రి అభివృద్ధి పనులకు భూమి పూజ చేస్తామని ఈవో జవహర్‌ రెడ్డి తెలిపారు.

కాగా… కోవిడ్ వ్యాప్తి చెందుతుందన్న ఆందోళనతో తిరుపతిలో ఆఫ్ లైన్ ద్వారా టోకెన్లు జారీ విధానాన్ని గత ఏడాది సెప్టెంబర్ 25 వ తేదీ నుంచి రద్దు చేశారు. ఆన్ లైన్ లో సర్వదర్శనం టోకెన్లు జారీ చేస్తున్నప్పటికీ, అవి గ్రామీణ ప్రాంతంలో ఉన్న సామాన్య భక్తులకు అందడం లేదన్న భావనలో టీటీడీ ఉంది. కోవిడ్ కారణంగా ఉద్యోగులు, భక్తుల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని విధి లేని పరిస్థితిలో ఆన్ లైన్ ద్వారా సర్వదర్శనం టోకెన్లు జారీ చేస్తున్నామని టీటీడీ వర్గాలు తెలిపాయి.

సామాన్య భక్తులకు సౌకర్యవంతంగా ఉండేలా తిరుపతిలో ఆఫ్ లైన్ విధానం లో సర్వదర్శనం టోకెన్లు జారీ చేయాలని అనేకసార్లు భావించినా.. కోవిడ్ తీవ్రత కారణంగా వాయిదా వేయక తప్పడం లేదని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఇదివరకే వివరణ ఇచ్చారు. ఫిబ్రవరి 15వ తేదీ నాటికి ఒమిక్రాన్ తీవ్రత తగ్గుముఖం పడుతుందని నిపుణులు చెబుతున్నందు వల్ల వారి సూచన మేరకు ప్రస్తుతం ఆన్ లైన్‌లో ఫిబ్రవరి 15వ తేదీ వరకు సంబంధించిన సర్వదర్శనం టోకెన్లు మాత్రమే జారీ చేస్తున్నామని ఇటీవల తెలిపారు.

Omicron: ఒమిక్రాన్ ఒకే మనిషికి మళ్లీ మళ్లీ వస్తదా..

ఫిబ్రవరి 15వ తేదీ కోవిడ్ వ్యాప్తి పరిస్థితిని అంచనా వేసి సర్వదర్శనం టోకెన్లు సామాన్య భక్తులకు సులభతరంగా అందేలా ఆఫ్ లైన్ విధానంలో జారీ చేసే అంశంపై నిర్ణయం తీసుకుంటామని వైవీ సుబ్బారెడ్డి కొన్ని రోజుల క్రితం తెలియజేశారు.