టీడీపీలో విషాదం, మాజీ ఎమ్మెల్యే మృతి

  • Published By: naveen ,Published On : July 21, 2020 / 02:26 PM IST
టీడీపీలో విషాదం, మాజీ ఎమ్మెల్యే మృతి

టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే జనార్ధన్ థాట్రాజ్ గుండెపోటుతో కన్నుమూశారు. గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు ఆయనను విశాఖ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్సపొందుతూ మంగళవారం(జూలై 21,2020) తుదిశ్వాస విడిచారు. జనార్ధన్ విజయనగరం జిల్లా కురుపాం మాజీ ఎమ్మెల్యే. మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజుకి స్వయాన మేనల్లుడు.

జనార్ధన్ థాట్రాజ్ 2009లో కాంగ్రెస్ తరఫున కురుపాం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. రాష్ట్ర విభజన తర్వాత తన మేనమామ విజయరామరాజుతో కలిసి టీడీపీలో చేరారు. 2014లో టీడీపీ నుంచి కురుపాంలో బరిలోకి దిగి ఓడిపోయారు. మళ్లీ 2019 ఎన్నికల్లో పోటీ చేసేందుకు నామినేషన్ దాఖలు చేశారు. అయితే కుల ధ్రువీకరణ పత్రాల విషయంలో వివాదంతో నామినేషన్ తిరస్కరణకు గురయ్యింది. ఆయన నామినేషన్‌ను ఎన్నికల కమిషన్ తిరస్కరించింది. దీంతో ఆయన ఎన్నికల్లో పోటీ చేయలేకపోయారు. టీడీపీ ముందు జాగ్రత్తగా జనార్దన్ థాట్రాజ్ తల్లి నరసింహ ప్రియా థాట్రాజ్‌‌తో నామినేషన్ వేయించారు. ఈ నామినేషన్‌కు అధికారులు ఆమోదం తెలిపారు. ఆమె టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు.

థాట్రాజ్ మృతితో కురుపాం నియోజకవర్గంలో విషాదచాయలు అలుముకున్నాయి. థాట్రాజ్ మృతి పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్, కళా వెంకట్రావ్, టీడీపీ నేతలు, పలువురు రాజకీయ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు.