కళా వెంకట్రావు విడుదల

కళా వెంకట్రావు విడుదల

TDP leader Kala Venkata Rao : టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి కిమిడి కళా వెంకటరావును విజయనగరం జిల్లా పోలీసులు అరెస్ట్ చేసి బెయిల్‌పై విడుదల చేశారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇటీవల రామతీర్థంలో పర్యటించిన టైమ్‌లో రాళ్లు, చెప్పులు వేయించారనే.. అభియోగంపై టీడీపీ అధినేత చంద్రబాబు, పార్టీ ఏపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు, పొలిట్‌బ్యూరో సభ్యుడు కళా వెంకటరావుపై ఇటీవల కేసు నమోదైంది. ఈ కేసులోనే ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

రాజాం పట్టణంలోకి రాత్రి 8.35 గంటలకు పెద్ద ఎత్తున పోలీసు బలగాలు వచ్చి కళా వెంకటరావును అదుపులోకి తీసుకుని సమీపంలోని విజయనగరం జిల్లా చీపురుపల్లి పోలీసుస్టేషన్‌కు తరలించారు. ఆయన్ను అరెస్టు చేశారంటూ తెదేపా శ్రేణులు ఆందోళనలకు దిగాయి. చీపురుపల్లి, రాజాం ప్రాంతాల టీడీపీ నేతలు, కార్యకర్తలు భారీగా స్టేషన్ కు చేరుకుని ఆయన్ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. టీడీపీ చీఫ్ చంద్రబాబు చీపురుపల్లిలో పార్టీ నేతలతో ఫోన్ లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. కొద్దిసేపటి తర్వాత..కళా వెంకటరావుకు 41ఏ నోటీసులు ఇచ్చి విడుదల చేశారు.

రామతీర్థంలో కొండపైకి వెళ్తున్న క్రమంలో వైసీపీ నేత విజయసాయిరెడ్డిపై చెప్పుల దాడి జరిగింది. ఈ చెప్పుల దాడి ఘటనకు కారణం మాజీ మంత్రి కళా వెంకట్రావు అని పోలీసులు నిర్ధారించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల ఆయన్ను అరెస్టు చేశారు. అరెస్టు చేసే సమయంలో మీడియా, సన్నిహితులతో కళా వెంకట్రావు మాట్లాడటానికి ప్రయత్నం చేశారు. అక్రమ కేసులు బనాయించి తనను అరెస్టు చేస్తున్నారని మాట్లాడే ప్రయత్నం చేసినప్పటికి కూడా పోలీసులు అయన్ను పోలీసు వాహనం ఎక్కించుకుని తీసుకెళ్లారు.