YS Viveka Case: అప్పటివరకు అవినాశ్ రెడ్డిని అరెస్టు చేయొద్దు: తెలంగాణ హైకోర్టు
వివేకానంద మృతి కేసులో అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. దీనిపైనే ఇవాళ కూడా వాదనలు కొనసాగాయి.

Avinash Reddy
Telangana High Court: వివేకానంద మృతి కేసులో ఏపీ (Andhra Pradesh) నేత, వైసీపీ (YSRCP) ఎంపీ అవినాశ్ రెడ్డి (Avinash Reddy)కి తెలంగాణ హైకోర్టులో కాస్త ఊరట దక్కింది. తీర్పు ప్రకటించే వరకు అరెస్ట్ చేయొద్దని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
అవినాశ్ పిటిషన్ పై బుధవారం (ఈ నెల 31న) తీర్పు ప్రకటిస్తామని హైకోర్టు తెలిపింది. వివేకానంద మృతి కేసులో అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. దీనిపైనే ఇవాళ కూడా వాదనలు కొనసాగాయి. హైకోర్టుకు సీబీఐ (CBI) అవినాశ్ గురించి పలు కీలక విషయాలు తెలిపింది. విచారణకు అవినాశ్ రెడ్డి సహకరించడం లేదని చెప్పింది.
విచారణను తమ పద్ధతిలో చేస్తామని, అంతేగాని అవినాశ్ రెడ్డి కోరుకున్నట్లుగా చేయబోమని పేర్కొంది. పిటిషన్ పై నేటితో హైకోర్టులో వాదనలు ముగిశాయి. వివేకానంద రెడ్డి మృతి కేసులో సోమవారం విచారణకు రాలేనని అవినాశ్ రెడ్డి సీబీఐకి లేఖ రాసిన విషయం తెలిసిందే.
తన తల్లి ఆరోగ్యం బాగోలేనందున విచారణకు హాజరు కాలేనని చెప్పారు. తన తల్లి ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాక విచాణకు వస్తానని, తనకు 10 రోజుల గడువు ఇవ్వాలని అన్నారు. అవినాశ్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని సీబీఐ ఇప్పటికే విచారించింది.