Vontimitta : ఒంటిమిట్ట కోదండరాముడి రథం కథ

ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయం ముఖ్యంగా ప్రధాన (రాజ)గోపురం ఎంత గంభీరంగా ఉంటుందో ఆలయ వార్షికోత్సవాలలో వినియోగించే రథం కూడా అంతే గంభీరంగా ఉంటుంది.

Vontimitta : ఒంటిమిట్ట కోదండరాముడి రథం కథ

Vontimitta Radham

Vontimitta :  ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయం ముఖ్యంగా ప్రధాన (రాజ)గోపురం ఎంత గంభీరంగా ఉంటుందో ఆలయ వార్షికోత్సవాలలో వినియోగించే రథం కూడా అంతే గంభీరంగా ఉంటుంది. ఈ రథం వెనుక ఆసక్తికరమైన చారిత్రక గాథ ప్రచారంలో ఉంది. కడప కైఫీయత్తుల్లో కూడా ఈ వివరాలు ఉన్నాయి.

1605–1700 ప్రాంతంలో ఈ ప్రాంతాన్ని మట్లి అనంతరాజు పాలించేవారు. బ్రహ్మోత్సవాలలో ఆయనే కొత్తగా రథం చేయించి రథోత్సవాన్ని తొలిసారిగా ఏర్పాటు చేయించినట్లు సమాచారం. దీన్ని అత్యంత సుందరంగా ఉండేటట్లు శిల్పకళా నైపుణ్యం ఉట్టిపడేలా తయారు చేసిన రథ శిల్పులకు ప్రజల్లో ఎంతో గౌరవముండేది.

తొలి బ్రహ్మోత్సవాలలో శిల్పులు తాము కూడా ఊరేగింపు సమయంలో రథంపై ఉంటామని డిమాండ్‌ చేశారు. స్థానికంగా ఎక్కువ ప్రాబల్యంగల ఓ వర్గం వారు దీన్ని వ్యతిరేకించారు. అర్చకులు , ఆలయ పెద్దలు మినహా ఇతరులెవరూ రథంపై ఉండకూడదని అడ్డుచెప్పారు. రథ శిల్పులు కూడా పట్టువీడలేదు. తాము రథంపై కూర్చొవాల్సిందేనని పట్టుబట్టారు.

ఆ సమయంలో తిరుపతిలో ఉన్న మట్లి అనంతరాజుకు విషయం తెలిసింది. ఆయన వెంటనే ఒంటిమిట్టకు వెళ్లి పరిస్థితిని చక్కదిద్దాలని ధర్మాధికారులను ఆదేశించారు. వారు ఒంటిమిట్టకు వచ్చి విషయాలను గమనించారు.

రథాన్ని నిర్మించిన రథ శిల్పులు ఉత్సవాల సమయంలో రథంపై కూర్చొనే సంప్రదాయం ఉన్నట్లు పండితుల ద్వారా తెలుసుకున్నారు. ఆ విషయాన్ని తమ ప్రభువు మట్లి అనంతరాజుకు తెలిపారు. ఆయన ఆజ్ఞ మేరకు ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలలో రథంపై రథ శిల్పులు కూడా ఉండే అవకాశం లభించింది.
Also Read : Vontimitta : ఒంటిమిట్ట రామాలయం విశేషాలు

ఆలయంలో తూర్పు ఎదుర్కోలు మండపం వద్ద గల తూర్పు మహా ప్రాకారంపై ఓ బండపై వివరాలు గల శాసనాన్ని గమనించవచ్చు. కడప కైఫీయత్తులలో శాసనం గురించి ప్రస్తావన కూడా ఉంది.