Tirumala Laddu Prasadam Weight : తిరుమల లడ్డూ బరువు వీడియో వైరల్.. క్లారిటీ ఇచ్చిన అధికారులు

తిరుమల లడ్డూ బరువు తగ్గిందని సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోపై స్పందించిన అధికారులు తనిఖీలు చేశారు. ఉండాల్సిన బరువులోనే అన్ని లడ్డూలు ఉన్నట్లు తేల్చారు.

Tirumala Laddu Prasadam Weight : తిరుమల లడ్డూ బరువు వీడియో వైరల్.. క్లారిటీ ఇచ్చిన అధికారులు

Tirumala Laddu Prasadam Weight : తిరుమల లడ్డూ కౌంటర్ల దగ్గర తూనికలు కొలతల శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. లడ్డూ బరువు తగ్గిందని సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోపై స్పందించిన అధికారులు ఈ తనిఖీలు చేశారు.

ఉండాల్సిన బరువులోనే అన్ని లడ్డూలు ఉన్నట్లు తేల్చారు. వేయింగ్ మిషన్ లో సాంకేతిక సమస్యల వల్లే లడ్డూ బరువు తక్కువ చూపించిందన్న అధికారులు.. సోషల్ మీడియాలో వచ్చిన వార్తలు అవాస్తవం అన్నారు. శ్రీవారి లడ్డూ ప్రసాదం పరిమాణంపై, బరువుపై అపోహలు వద్దన్న అధికారులు కచ్చితంగా 160 నుంచి 180 గ్రాములే ఉంటుందని క్లారిటీ ఇచ్చారు.

శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని భక్తులకు అత్యంత ప్రీతిపాత్రంగా చూస్తారు. కాగా, లడ్డూ ప్రసాదం బరువు తగ్గిందంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో దుమారం రేపింది. ఆలయ నిబంధనల ప్రకారం శ్రీవారి లడ్డూ ప్రసాదం 160 గ్రాముల నుంచి 180 గ్రాములు బరువు ఉంటుంది. కానీ, ఓ భక్తుడు కొనుగోలు చేసిన లడ్డూలు తూకం వేయగా.. 90 నుంచి 110 గ్రాముల బరువు మాత్రమే ఉన్నాయి. దీంతో భక్తుడు లడ్డూ కౌంటర్‌లోని సిబ్బందితో వాగ్వాదానికి దిగాడు. ఆ దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి.

లడ్డూలు చిన్నవిగా ఉండడాన్ని సదరు భక్తుడు నిలదీశాడు. దాంతో కౌంటర్ లో ఉన్న ఉద్యోగి ఓ లడ్డూను వెయింగ్ మెషీన్ పై ఉంచగా, అది 90 గ్రాములు తూగినట్టు కనిపించింది. దాంతో ఆ భక్తుడు ఇది చీటింగ్ అని మండిపడ్డాడు. వైఎస్ జగన్, వైవీ సుబ్బారెడ్డి కలిసి చేస్తున్న చీటింగ్ అని ఆరోపించాడు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. దీనిపై స్పందించిన టీటీడీ అధికారులు వివరణ ఇచ్చారు. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం బరువుపై సోషల్‌ మీడియాలో వస్తున్న అపోహలు నమ్మొద్దని భక్తులకు విజ్ఞప్తి చేశారు. వెయింగ్‌ మిషన్‌లో సాంకేతిక సమస్య కారణంగా, కాంట్రాక్ట్ సిబ్బంది అవగాహన లోపం వల్లే అలా జరిగిందని వివరణ ఇచ్చారు. వెయింగ్ మెషీన్ లో సాంకేతిక సమస్య కారణంగా మైనస్ 70 అని ఉండటంతో లడ్డూ బరువుపై భక్తులు అపోహలకు లోనయ్యారని వివరించింది.

లడ్డూ బరువు కచ్చితంగా 160 నుంచి 180 గ్రాములు ఉంటుందని స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి సందేహాలకు తావులేదని టీటీడీ పేర్కొంది. బరువులో ఎలాంటి తేడా లేదని, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని భక్తులు నమ్మవద్దని విజ్ఞప్తి చేసింది. కొన్ని వందల సంవత్సరాల నుంచి రాజీ లేకుండా లడ్డూ ప్రసాదాన్ని పోటు కార్మికులు తయారు చేస్తున్నారని తెలిపారు.

కాగా.. లడ్డూ ప్రసాదం బరువు వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది. ప్రతిక్షాలు ప్రభుత్వాన్ని టార్గెట్ చేశాయి. దొంగలకు అధికారం ఇవ్వడం అంటే దోపిడీకి అనుమతి ఇచ్చినట్టేనని జగన్ అండ్ కో నిరూపిస్తోందని టీడీపీ తీవ్ర విమర్శలు చేసింది. పరమ పవిత్రమైన తిరుపతి లడ్డూలోనూ వారు దోపిడీని వెతుక్కోవడం దారుణం అంది. 175 గ్రాములు ఉండాల్సిన తిరుపతి లడ్డూ బరువు 90 గ్రాములే ఉండటం ఘోరం అని టీడీపీ నేతలు ధ్వజమెత్తారు.