Aadhaar Services : ఇంటి వద్దకే ఆధార్ సేవలు.. అర్హులు వీరే.. ఈ సేవలు పొందడం ఎలాఅంటే?
Aadhaar Services : ఆధార్ కావాల్సిన వ్యక్తి పరిస్థితి, అప్‌డేట్ చేసుకోవాల్సిన అవసరం, వయసు వంటి పూర్తి వివరాలు తెలిసేలా..
Aadhaar Services
Aadhaar Services : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పొందాలన్నా.. దేనికైనా దరఖాస్తు చేసుకోవాలన్నా.. ప్రతి పనికి ఆధార్ తప్పనిసరి. ఆధార్ కార్డు పొందాలనుకునే వారు, ఆధార్ కార్డు అప్‌డేట్ చేసుకునేవారి కోసం భారత విశిష్ట ప్రాధికార సంస్థ (UIDAI) కీలక నిర్ణయం తీసుకుంది.
Also Read: Godavari Pushkaralu : గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు.. 12రోజులు నిర్వహణ.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ..
వృద్ధులు, దివ్యాంగులు, అనారోగ్యంతో ఇబ్బందులు పడేవారు.. ఇంటి నుంచి బయటకు వచ్చే పరిస్థితిలేని వారు ఆధార్ కార్డు కోసం, అప్‌డేట్ కోసం కార్యాలయాలకు వెళ్లాల్సిన పనిలేదు. వారికోసం సిబ్బంది ఇంటి వద్దకే వచ్చి ఆధార్ కార్డుకు సంబంధించిన వివరాలు నమోదు చేసుకుంటారు. అయితే, ఇందుకోసం ముందుగా వ్యక్తి కుటుంబీకులు ఎవరైనా ఉడాయ్ ప్రాంతీయ కార్యాలయంలో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.
ఈ సేవలకు ఎవరు అర్హులు..
ఇంటి వద్దనే ఆధార్ సేవలు పొందేందుకు వృద్ధులు, మంచం పట్టినవారు, బలహీనులు, దివ్యాంగులు మాత్రమే అర్హులు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించి హైదరాబాద్ అమీర్‌పేటలోని మైత్రీవనంలో ఉడాయ్ ప్రాంతీయ కార్యాలయం ఉంది.
ఇలా దరఖాస్తు చేసుకోండి..
♦ ఆధార్ కావాల్సిన వ్యక్తి పరిస్థితి, అప్‌డేట్ చేసుకోవాల్సిన అవసరం, వయసు వంటి పూర్తి వివరాలు తెలిసేలా ఓ ఉత్తరం రాయాలి.
♦ సంబంధిత వ్యక్తి ఏ పరిస్థితిలో ఉన్నారు.. ఎందుకు కార్యాలయానికి రాలేకపోతున్నారు.. అనే వివరాలతో అర్థమయ్యేలా తీసిన ఫొటోను తీసి దరఖాస్తుకు జతచేయాలి.
♦ వైద్యులు ఇచ్చిన మెడికల్ సర్టిఫికెట్ కూడా పొందుపరచాలి.
♦ ఒక ఫొటో, మరో గుర్తింపు కార్డు పత్రాలు వాటితో పాటు ఇవ్వాలి.
♦ ఆధార్ లోని తప్పులు, ఇబ్బందుల పూర్తి వివరాలు కనుక్కోవడానికి ఉడాయ్ సిబ్బంది సుమారు ఏడు రోజుల సమయం తీసుకుంటారు.
♦ ఆ తరువాత ఇంటి వద్దకే వచ్చి సమస్యను పరిష్కరిస్తారు.
♦ దీనికోసం దూరంతో నిమిత్తం లేకుండా రూ.700 తీసుకుంటారు.
