దొంగను పట్టిచ్చిన వాట్సప్ స్టేటస్

దొంగను పట్టిచ్చిన వాట్సప్ స్టేటస్

women thief arrested police through whatsapp status:  అపార్ట్ మెంట్ లో దొంగతనం చేసిన మహిళ… రెండు నెలల తర్వాత దొంగతనం చేసిన చీరను కట్టుకుని వాట్సప్ స్టేటస్ పెట్టటంతో పోలీసులకు దొరికిపోయింది. గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీసు స్టేషన్ పరిధిలోని డోలాస్ నగర్ లో ప్రైమ్ గెలాక్సీ అపార్ట్ మెంట్ లో కత్తి ఆమోద్ అనే వ్యక్తి కుటుంబం నివసిస్తోంది. 2020, నవంబర్ 29న అతని అపార్ట్ మెంట్ లో చోరీ జరిగింది. నాలుగు బంగారుగాజులు, మంగళ సూత్రం, నెక్లెస్, రెండు చెవిదిద్దులు, బేబీచైన్‌ ఒకటి, మరికొన్ని వస్తువులు చోరీకి గురయ్యాయి.

బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదే చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. కానీ పోలీసు విచారణలో ఫలితం లేకుపోయింది. దొంగను కనిపెట్టలేకపోయారు. అయితే చోరీ అయిన విలువైన వస్తువులతో పాటు కొన్ని చీరలు కూడా ఉన్నాయి. అదే అపార్ట్ మెంట్ లో గతంలో పనిచేసిన సునీత అనే మహిళ చోరీ అయిన బంగారు ఆభరణాలు, చీర కట్టుకుని డిసెంబర్ 24న  వాట్సప్ స్టేటస్ పెట్టింది. ఆ స్టేటస్ చూసిన ఆమోద్ భార్య వెంటనే భర్తకు చూపించింది. ఆమోద్ సునీత ఫోన్ నెంబర్ తో సహా, ఆధారాలతో స్క్రీన్ షాట్ ను పోలీసులకు అందచేశాడు. పోలీసులు నిందితురాలిని మంగళగిరి కొత్త బస్టాండ్ వద్ద అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు.

సునీత గతంలో అపార్ట్ మెంట్ లో కొంతకాలం పని మనిషిగా పని చేసేది. ఆసమయంలో ఖాళీగా ఉన్న అపార్ట్ మెంట్లు శుభ్రం చేయమని మేనేజర్ తాళాలు ఇవ్వగా వాటితోపాటు అమోద్ ప్లాటు డూప్లికేట్ తాళాలు కూడా తీసుకువెళ్ళి చోరీకి పాల్పడింది. అమోద్ ఫ్లాట్ లో కప్ బోర్డు పగలగొట్టి అందులో బంగారం దోచుకుని అక్కడి నుంచి వెళ్లిపోయిందని సీఐ సుబ్రహ్మణ్యం వివరించారు.