Viveka Case: వివేకా హత్య కేసులో వై.ఎస్. భాస్కర్ రెడ్డి అరెస్ట్.. ఎంపీ అవినాష్ రెడ్డి ఇంటికి సీబీఐ అధికారులు?
వివేకా హత్య కేసులో వైఎస్ భాస్కర్‌రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. ఉదయం పులివెందులలో ఆయన నివాసానికి వెళ్లిన అధికారులు.. కొద్దిసేపటికే అరెస్టు చేశారు.

YS Bhaskar Reddy arrested
Viveka Case: మాజీ మంత్రి వై.ఎస్. వివేకానందరెడ్డి హత్య కేసు విచారణలో సీబీఐ అధికారులు వేగం పెంచారు. ఆదివారం ఉదయం వైఎస్ఆర్ జిల్లా పులివెందులలోని వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ తండ్రి భాస్కర్ రెడ్డి నివాసానికి సీబీఐ అధికారులు వెళ్లారు. ఉదయం రెండు వాహనాల్లో 10 మంది అధికారులు భాస్కర్ రెడ్డి ఇంటికి వెళ్లారు. కొద్దిసేపటి అనంతరం భాస్కర్ రెడ్డిని అరెస్టు చేశారు. 130 బి, రెడ్ విత్ 302, 201 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అనంతరం భాస్కర్ రెడ్డి భార్య లక్ష్మికి అరెస్ట్ సమాచారాన్ని సీబీఐ అధికారులు అందించారు. పులివెందుల నుంచి భాస్కర్ రెడ్డిని తరలించిన అధికారులు.. కడప లేదా హైదరాబాద్ తరలించే అవకాశం ఉంది. సాయంత్రం జడ్జి ముందు ప్రవేశపెట్టనున్నారు.
YS Viveka Case : ఉదయ్‌కుమార్‌రెడ్డి రిమాండ్ రిపోర్ట్‌లో కీలక విషయాలు
మరోవైపు పులివెందులలోని ఎంపీ అవినాష్ రెడ్డి ఇంటికి కూడా ఆదివారం సీబీఐ అధికారులు చేరుకున్నారు. అవినాష్ రెడ్డి హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు. హైదరాబాద్‌లోని అవినాష్ రెడ్డి ఇంటికి సీబీఐ బృందం వెళ్లినట్లు తెలిసింది. అవినాష్ రెడ్డి ఈ రోజు గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొనేందుకు కడపకు చేరుకోనున్నారు. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో ఎంపీ అవినాష్ రెడ్డిని కూడా సీబీఐ అధికారులు అరెస్టు చేస్తారన్న వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డిని సీబీఐ అధికారులు నాలుగు సార్లు ప్రశ్నించిన విషయం విధితమే.
వివేకా హత్య కేసులో రెండు రోజుల క్రితం ఉదయ్‌కుమార్ రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్టు చేసిన విషయం విధితమే. వివేకా హత్యకు ముందు భాస్కర్ రెడ్డి నివాసంలో ఉదయ్ ఉన్నట్లు గూగుల్ టేక్ అవుట్ ద్వారా సీబీఐ అధికారులు గుర్తించారు. ఉదయ్ కుమార్ రెడ్డి అరెస్టు జరిగిన రెండు రోజుల తరువాత ఆదివారం ఉదయం పులివెందులలోని ఎంపీ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి ఇళ్లకు సీబీఐ అధికారులు వెళ్లారు. భాస్కర్ రెడ్డిని అరెస్టు చేశారు. ఈ కేసులో భాస్కర్ రెడ్డి ప్రధాన సూత్రదారిగా సీబీఐ అధికారులు భావిస్తున్నారు.