Tirupati by-election : తిరుపతి ఉప ఎన్నికపై వైసీపీ ఫోకస్ : 4 లక్షల మెజార్టీని టార్గెట్‌గా పెట్టిన సీఎం జగన్

ఏపీలో వరుస ఎన్నికలు హీటు పుట్టిస్తున్నాయి. ఇప్పటికే పంచాయితీ, మున్సిపల్‌ ఎన్నికల్లో విజయాలతో జోరు మీదున్న వైసీపీ.. ఇప్పుడు తిరుపతి లోక్ సభ స్థానంపై ఫోకస్ పెట్టింది.

Tirupati by-election : తిరుపతి ఉప ఎన్నికపై వైసీపీ ఫోకస్ : 4 లక్షల మెజార్టీని టార్గెట్‌గా పెట్టిన సీఎం జగన్

తిరుప‌తి మెజార్టీ టార్గెట్ ఫిక్స్

Tirupati Lok Sabha by-election : ఏపీలో వరుస ఎన్నికలు హీటు పుట్టిస్తున్నాయి. ఇప్పటికే పంచాయితీ, మున్సిపల్‌ ఎన్నికల్లో విజయాలతో జోరు మీదున్న వైసీపీ.. ఇప్పుడు తిరుపతి లోక్ సభ స్థానంపై ఫోకస్ పెట్టింది. ఉప ఎన్నికలో విజయం తమదేనని ఫిక్స్ అయిపోయింది. అంతేకాదు ఇప్పుడు నాయకుల దృష్టంతా మెజార్టీ పైనే ఉందట. సాదా సీదా గెలుపు కాదు.. కనీసం 4 లక్షల మెజార్టీ సాధించాలని సీఎం జగన్ టార్గెట్ ఫిక్స్ చేశారట. దేశం మొత్తం ఏపీ వైపు చూసేలా ఫలితాలు ఉండాలని నాయకులకు దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది.

తిరుపతి ఉపఎన్నికలో గెలుపుపై వైసీపీలో ధీమా కనిపిస్తోంది. సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకుంటామని ఆ పార్టీ నేతలు బల్ల గుద్ది చెబుతున్నారు. ఇప్పటికే తమ అభ్యర్థిగా డాక్టర్ గురుమూర్తిని వైసీపీ ప్రకటించింది. రాజకీయాలకు కొత్త.. ఉన్నత విద్యావంతుడు కావడంతో అతని అభ్యర్థిత్వంపై పాజిటివ్ టాక్ ఉందని అధికార పార్టీ భావిస్తోంది. లాభనష్టాలతో బేరీజు లేకుండా సీఎం జగన్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడన్నా సానుకూల అంశం కూడా గురుమూర్తికి భారీ మెజార్టీ తీసుకొస్తుందని వైసీపీ నేతలు భావిస్తున్నారు.

తిరుపతి పార్లమెంట్ పరిధిలో చిత్తూరు, నెల్లూరు జిల్లాలకు కలిపి ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. ఈ ఏడు నియోజకవర్గాలకు కీలక మంత్రులను నియమించడం ద్వారా గెలుపును ముందే డిక్లేర్ చేయాలని సీఎం జగన్ భావిస్తున్నారు. తిరుపతికి పేర్ని నాని, శ్రీకాళహస్తికి గౌతమ్ రెడ్డి, సత్యవేడు కొడాలి నాని, సూళ్లూరు పేటకు కన్నబాబు, వెంకటగిరికి బాలినేని శ్రీనివాసులు రెడ్డి, సర్వేపల్లికి ఆదిమూలపు సురేష్, గూడూరుకు అనిల్ కుమార్ యాదవ్ లను ఇన్ ఛార్జ్ లుగా నియమించారు. ఓవరాల్ బాధ్యతలను మంత్రి పెద్దిరెడ్డి, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి లకు కట్టబెట్టారు. కనీసం 4 లక్షల మెజారిటీ తగ్గకుండా సాధించాలని సీఎం జగన్ మంత్రులకు టార్గెట్ ఫిక్స్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది.

తిరుపతి పార్లమెంటు బరిలో సుమారు 16.5 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. 2019 ఎన్నికల్లో 13.20 లక్షల మంది ఓటేశారు. ఇందులో వైసీపీకి 7.22 లక్షల ఓట్లు రాగా, టీడీపీకి 4.94 లక్షల ఓట్లు వచ్చాయి. 80 శాతం పోలింగ్ జరగగా.. 2.28 లక్షల ఓట్ల మెజార్టీతో వైసీపీ గెలిచింది. మరి ఈ దఫా సీఎం జగన్ కోరుతున్నట్లు 4 లక్షల మెజారిటీ సాధించాలంటే.. పోలింగ్ శాతం పెంచడంతో పాటు మరిన్ని అదనపు ఓట్లు సాధించడమే వైసీపీ ముందున్న లక్ష్యం. అయితే మున్సిపల్ ఎన్నికల్లో అద్భుత ఫలితాలు, ప్రభుత్వం అమలు చేస్తున్న నవరత్నాలు తమకు కలిసివస్తాయని వైసీపీ భావిస్తోంది. ఇక మంత్రుల ఎంట్రీతో తిరుపతి బై పోల్ మరింత రసవత్తరంగా సాగనున్నట్లు తెలుస్తోంది.