నేనూ కాపునే : విజయసాయిరెడ్డి క్లారిటీ!

  • Published By: sreehari ,Published On : December 17, 2019 / 08:52 AM IST
నేనూ కాపునే : విజయసాయిరెడ్డి క్లారిటీ!

వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి.. ఏ సామాజిక వర్గానికి చెందినవారు? ఇప్పుడు ఇదే హాట్ టాపిక్‌గా మారింది. అదేంటీ.. ఆయన పేరు చివర రెడ్డి అని ఉంది కదా? ఇంకా ఏ వర్గం అని అంటారేంటీ అనుకుంటున్నారా? పేరులో రెడ్డి ఉన్నా ఆయన మాత్రం కాపు సామాజిక వర్గానికి చెందినవారేనట. ఇది ఎవరో చెప్పింది కాదు.. స్వయంగా ఆయనే ప్రకటించుకున్నారు కూడా. కావాలంటే ఆయన టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ చెక్ చేసుకోండి.. ఈ మాట కూడా విజయ సాయి రెడ్డి చెప్పిందే.

అసలేంటీ? ఈ కాపు.. రెడ్డి అనే అంశం ఎందుకు తెరపైకి వచ్చింది అనే విషయం తెలియాలంటే? ముందుగా కాపుల ఆత్మీయ సమ్మేళనం గురించి తెలియాలి. కాపుల ఆత్మీయ సమ్మేళనంలో.. రెడ్డి సందడి చేశారు. వినడానికి కాస్త వింతగా అనిపించినా.. అక్కడ జరిగింది ఇదే. విశాఖ కాపుల పిక్నిక్‌లో.. విజయసాయిరెడ్డి జ్యోతి ప్రజ్వలన చేయడం లోకల్ కాపుల్లో కలకలం రేపింది. వాళ్ల పిక్నిక్‌కు ఈయనెందుకు వెళ్లారన్నదానిపైనే ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతోంది.

అందుకే.. వెళ్లారా? :
విజయసాయి రెడ్డి.. మంత్రి అవంతి శ్రీనివాస్ ఆహ్వానం మేరకు కాపుల ఆత్మీయ సమ్మేళనానికి వెళ్లి ఉండొచ్చంటున్నారు. కానీ.. ఆయన మామూలుగా వెళితే ఇంత చర్చ జరిగేది కాదని చెబుతోంది ఓ వర్గం. దీని వెనుక కూడా రాజకీయ కోణం ఉందనే ప్రచారం జోరుగా సాగుతోంది. విజయసాయి రెడ్డి ఉత్తరాంధ్ర వైసీపీ ఇంచార్జ్‌గా ఉన్నారు. త్వరలోనే విశాఖ కార్పొరేషన్ ఎన్నికలు జరగబోతున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని.. కాపులను వైసీపీ వైపు తిప్పుకునేందుకే.. ఆయనకు అక్కడికి వెళ్లారనే ప్రచారం జరుగుతోంది. దీనిలో ఎంతవరకూ నిజం ఉందో కచ్చితంగా చెప్పలేని విషయం.

పార్టీ అధినేత జగన్ ఉత్తరాంధ్ర జిల్లాల బాధ్యతను విజయసాయిరెడ్డికి అప్పగించారు. ఈ క్రమంలో.. అక్కడ పార్టీని పటిష్టపరచడంతో పాటు విశాఖ లాంటి సిటిలోనూ వైసీపీ జెండా ఎగరేయాలని విజయసాయి చూస్తున్నారని, అందులో భాగంగానే ఆయన కాపుల పిక్నిక్‌కు వెళ్లారంటున్నారు. భవిష్యత్‌లో జరగబోయే విశాఖ కార్పొరేషన్ ఎన్నికల దృష్ట్యా.. కాపు సామాజిక వర్గానికి ముందే దగ్గర అవ్వొచ్చుననే.. రాజకీయ కోణంలోనే ఆయన అక్కడికి వెళ్లారనే టాక్ నడుస్తోంది.

మావైపు.. రెడ్డీలంతా కాపులే:
విషయం ఏదైనా.. ఆత్మీయ సమ్మేళనంలో విజయసాయిరెడ్డి జ్యోతి ప్రజ్వలన చేయడాన్ని కాపులు జీర్ణించు కోలేకపోయారు. విజయ సాయికి వ్యతిరేకంగా నిరసనకు దిగారు. కాపుల పిక్నికా.. లేక వైసీపీ పిక్నికా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాపుల నుంచి వ్యక్తమైన వ్యతిరేకతను చల్లార్చేందుకు విజయసాయిరెడ్డి ప్రయత్నించారు.

అయినప్పటికీ వారంతా వెనక్కి తగ్గకపోవడంతో.. తాను కూడా కాపునేనని ఎవరూ ఊహించని డైలాగ్ చెప్పారు విజయసాయి. నెల్లూరులో రెడ్డీలను.. కాపులుగానే పిలుస్తారని ఆయన క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. తన టెన్త్ క్లాస్ సర్టిఫికెట్ మీద కూడా ఓసీ కాపు ఉంటుందని చెప్పారు. కావాలంటే.. చెక్ చేసుకోమన్నారు.

కానీ.. కాపుల ఆందోళన ఆగలేదు. విజయసాయిరెడ్డి వాదనతో కాపులు ఏకీభవించలేదు. దీంతో.. విజయసాయిరెడ్డి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ ఊహించని పరిణామంతో.. మంత్రి అవంతి శ్రీనివాస్ అవాక్కయ్యారు. విజయ సాయిరెడ్డి విషయంలో ప్రవర్తించిన తీరుపై మంత్రి అవంతి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read : బాలయ్య.. బాబునే అన్నారా? : ఏపీలో హీటెక్కిన పాలిటిక్స్!